మన్యాన్ని వీడని పులి భయం
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:13 AM
జిల్లాలోని వేలేరుపాడు మండల అటవీ ప్రాంతం నుంచి గురువారం తెలంగాణలోకి ప్రవే శించిన పెద్దపులి మళ్లీ వెనక్కి వచ్చింది. అర్ధరాత్రి జీలుగుమిల్లి మండలం జిల్లేళ్ళగూడెం అడవిలోకి ప్రవేశించిన పులి శుక్రవారం తెల్ల వారుజామున అడవి సమీపంలోని పొలాల్లో కట్టేసి ఉన్న కుమ్మరి వెంకటేష్‌కు చెందిన ఎద్దుపై దాడి చేసి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది.
తెలంగాణ నుంచి జిల్లేళ్ళగూడెం అడవిలోకి ప్రవేశం
ఆపై ఎద్దుపై దాడి.. గిరిజనుల్లో భయాందోళన
జీలుగుమిల్లి,నవంబరు13 (ఆంధ్ర జ్యోతి):జిల్లాలోని వేలేరుపాడు మండల అటవీ ప్రాంతం నుంచి గురువారం తెలంగాణలోకి ప్రవే శించిన పెద్దపులి మళ్లీ వెనక్కి వచ్చింది. అర్ధరాత్రి జీలుగుమిల్లి మండలం జిల్లేళ్ళగూడెం అడవిలోకి ప్రవేశించిన పులి శుక్రవారం తెల్ల వారుజామున అడవి సమీపంలోని పొలాల్లో కట్టేసి ఉన్న కుమ్మరి వెంకటేష్‌కు చెందిన ఎద్దుపై దాడి చేసి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఎద్దు మెడ భాగం వద్ద రక్తం తాగి వెనుక భాగంలో గాయం చేసి కొంత మాంసం తిని వెళ్లినట్లు గిరి జనులు చెప్పారు. రెండు నెలల క్రితం మండలంలో పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. అప్పట్లో స్వర్ణవారిగూడెం, దర్భగూడెం, అంకన్నగూడెం గ్రామాల మీదుగా సంచరించి బుట్టాయగూడెం మండలం కామవరం మీదుగా దట్టమైన గుబ్బలమంగమ్మ అడవి మీదుగా పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమం లో రెండు రోజులకోసారి పశువుల్ని చంపి తన ఆకల్ని తీర్చుకునేది. పశువుల మాంసంకు అలవాటు పడిన పెద్దపులి మనుషులకు ఎటువంటి హాని తలపెట్టకుండా రాత్రి సమయంలో సంచరిస్తూ పశువుల్ని చంపి తింటోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లేళ్ళగూడెం, బొత్తప్పగూడెం సమీప సంగంవాగు ప్రాంతంలో మకాం వేసినట్టు అధికారులు చెప్పారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి సమయంలో గ్రామాల్లో మంటలు వేసుకోవాలని, ఒంటరిగా సంచరించవద్దని చెబుతున్నారు.