Share News

టిడ్కో.. రికవర్రీ..!

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:44 AM

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు, బ్యాంకుల మధ్య పంచాయితీ నడుస్తోంది. ఇచ్చిన రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు పట్టుబడుతుంటే.. గృహ ప్రవేశం అయిన తర్వాత వాయిదాలు చెల్లిస్తామంటూ లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు.

టిడ్కో.. రికవర్రీ..!

ఇళ్లు అప్పగించిన తర్వాతే కడతామంటున్న లబ్ధిదారులు

నోటీసులు జారీతో లబోదిబో..

భీమవరంలో 2,448 ఇళ్లు..

పాలకొల్లులో 1,536 పెండింగ్‌

ఇళ్ల నిర్మాణం వేగవంతం.. డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు కసరత్తు

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు, బ్యాంకుల మధ్య పంచాయితీ నడుస్తోంది. ఇచ్చిన రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు పట్టుబడుతుంటే.. గృహ ప్రవేశం అయిన తర్వాత వాయిదాలు చెల్లిస్తామంటూ లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు. ఇచ్చిన గడువు ముగిసిందని, రికవరీ చేయాల్సిందేనని బ్యాంకర్లపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నాయి. భీమవరం, పాలకొల్లుల్లోనే ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో ఉంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం తదితర పట్టణాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి దశాబ్దంపైనే గడిచింది. గత వైసీపీ ప్రభుత్వం దీనిని విస్మరించడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడు తున్నారు. ప్రభుత్వం 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా ఇచ్చింది. 365 చదరపు అడుగుల ఇంటి ధరను రూ.7.15 లక్షలుగా నిర్ధారించగా, లబ్ధిదారులు వాటా కింద రూ.50 వేలు చెల్లించారు. 430 చదరపు అడుగుల ఇంటి ధర రూ.7.65 లక్షలు కాగా, లబ్ధిదారులు రూ.లక్ష చెల్లించారు. ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు లక్షలు చొప్పున రాయితీ చెల్లించింది. మిగిలిన రూ.3.15 లక్షలు, రూ.3.65 లక్షలు బ్యాంకుల నుంచి రుణం మంజూరు చేయడంతో ఆ మొత్తం ప్రభుత్వ ఖాతాకు వెళ్లింది. తమ వంతు సొమ్ములను చెల్లించినా ఇళ్లు అప్పగించక పోవడంతో లబ్ధిదారులపై వడ్డీల భారం పెరుగుతోంది. అద్దె ఇళ్లల్లోనే ఉండాల్సి వస్తోంది. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాతే టిడ్కో ప్రాజెక్ట్‌ మళ్లీ పరుగులు తీస్తోంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేలా నిర్మాణ పనులు ముమ్మరం చేశారు. అయినప్పటికి రుణం చెల్లించాలంటూ లబ్ధిదారులపై బ్యాంకర్లు ఒత్తిడి ప్రారంభించి నోటీసులు జారీ చేస్తున్నారు.

తాడేపల్లిగూడెంలోనే వంద శాతం

తాడేపల్లిగూడెంలోనే వంద శాతం ఇళ్లను పూర్తి చేసి ఈ ఏడాది మార్చిలో లబ్ధిదారులకు అప్పగించారు. పాలకొల్లులో పెండింగ్‌లో వున్న 1,536 ఇళ్లను అక్టోబరు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేపడు తున్నారు. భీమవరంలో 3,904 ఇళ్లను అప్పగించారు. మరో 2,000 పూర్తిచేశారు. మిగిలిన 2448 ఇళ్లను నిర్మిస్తున్నారు. సీపేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు సిద్ధమయ్యాయి. తాడేపల్లిగూడెం, పాలకొల్లులో ప్లాంట్‌లు నడుస్తున్నాయి. భీమవరంలో ప్లాంట్‌ నిర్మాణం పూర్తయ్యింది. దీనికి డ్రైనేజీ, రహదారులు నిర్మించాలి. ఈ ఇళ్లను ఒకేసారి ఇచ్చేలా అధికారులు ప్రణాళిక చేస్తున్నారు.

లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తారా..

టిడ్కో ఇళ్లు నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. నాలుగో అంతస్తుకు వెళ్లడానికి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇళ్లకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరుగుతోంది. వీటిని ఏర్పాటు చేస్తే ఈ ఇళ్లకు మరింత విలువ పెరుగుతుంది. లబ్ధిదారులంతా సొంతిళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు.

టిడ్కో ఇళ్ల ప్రగతి ఇలా

పట్టణం మొత్తం ఇళ్లు పూర్తయినవి అప్పగించినవి పెండింగ్‌

భీమవరం 8,352 5,904 3,904 2,448

పాలకొల్లు 6,144 4,608 4,608 1,536

తాడేపల్లిగూడెం 5,376 5,376 5,376 0

Updated Date - Jul 14 , 2026 | 12:44 AM