టిడ్కో ఫ్ల్లాట్లకు మోక్షం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:34 AM
టిడ్కో ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకుని కొంత సొమ్మును డీడీ రూపంలో అందించినా చాలా మందికి అవి మంజూరు కాలేదు.
ప్రారంభం కాని ఇళ్ల లబ్ధిదారులకు డిపాజిట్ మొత్తాలు త్వరలో వెనక్కి
అధికారుల కసరత్తు
భీమవరంటౌన్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకుని కొంత సొమ్మును డీడీ రూపంలో అందించినా చాలా మందికి అవి మంజూరు కాలేదు. వీరికి డిపాజిట్ సొమ్ము తిరిగి వెనక్కు ఇవ్వాలని సీఎం చంద్రబాబు రెండు రోజుల కిత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి వారికి డిపాజిట్ సొమ్ములను అందించేందుకు దాదాపు రూ.179 కోట్లు విడుదలకు ఆదేశాలు జారీ చేశా రు. దీంతో దాదాపు పదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ వార్త కొంత ఆనందాన్ని కలిగి స్తోంది. వాస్తవంగా 2014లో అధికారంలోకి వచ్చి న టీడీపీ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం పట్ట ణాల్లో టిడ్కో ఇళ్ల రూపంలో ఫ్లాట్ అందించేందు కు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీల్లో స్థలం అందుబాటులో ఉండడంతో ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ‘ఏ’ కేటగిరికి రూ.500, ‘బీ’ కేటగిరికి 50 వేలు, ‘సీ’ కేటగిరికి లక్ష రూపాయలు నిర్ధారించారు. దరఖాస్తుతో పాటు చాలామంది డీడీలు తీసి అందించారు. అందులో కొంతమందికి ఇళ్లు మంజూరు కాలేదు. దీంతో డిపాజిట్ చేసిన సొమ్ములు వెనక్కి ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది. చివరిగా 2019లో ఇళ్లు రావని నిర్ధారణ చేశారు. ఎన్నిసార్లు మునిసిపాలిటీ చుట్టూ ప్రదిక్షణలు చేసినా ఫలితం రాలేదు. చాలా మంది డిపాజిట్ సొమ్ములు వస్తాయనే ఆశను వదులు కున్నారు. ఈ నేపథ్యంలో సొమ్ములు తిరిగి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఎంతమంది ఉన్నారనే దానిపై మునిసిపల్ అధికారులు పాత రికార్డులను పరిశీలిస్తున్నారు.
జిల్లాలో రూ.3 కోట్లు అవసరం?
టిడ్కో ఇళ్లు రానివారికి డిపాజిట్‌ల సొమ్ముల చెల్లింపునకు జిల్లాకు దాదాపు రూ.3 కోట్ల వరకు అవసరం అంటుందని అంచనా వేస్తున్నారు.
భీమవరం మునిసిపాలిటీకి సంబంధించి 2017–18లో డీడీ రూపంలో ఇచ్చిన వారిలో ప్లాట్లు కేటాయించని వారు 367 మంది ఉన్నారు. వీరికి రూ.34.38 లక్షలు చెల్లించాలి. 2023–2024 విడుదల చేసిన జీవో 3429 ప్రకారం అనర్హత కారణంగా రద్దు చేసిన లబ్ధిదారులు 171 మంది వరకు ఉంటారని అంచనా. వీరికి రూ.19,50, 500 చెల్లించాలని అంచనా వేస్తున్నారు.
పాలకొల్లు మునిసిపాలిటీలో దాదాపు 800 దరఖాస్తులు ఉంటాయని, వీటికి రూ.కోటి 30 లక్షల వరకు సొమ్ములు అవసరంగా చెబుతున్నారు.
తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో 245 వరకు దరఖాస్తులు ఉంటాయి. ప్రస్తుతం సచివాలయాల వారీగా వస్తున్న సమాచారం మేరకు 192 దరఖాస్తులను గుర్తించారు. వీరికి ఎంత మేరకు సొమ్ములు చెల్లించాలన్న దానిపై అంచనా వేస్తున్నారు. వచ్చే నెల నాటికి దీనిపై స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది.