Share News

మద్యం మత్తు.. అతివేగం

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:10 AM

అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఒకే ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు మిత్రులు మద్యం మత్తులో.. రాంగ్‌ రూట్‌లో.. 75 కిలోమీటర్ల వేగంతో వచ్చి, ఎదురుగా వస్తున్న ఓ కళాశాల బస్సును ఢీకొట్టారు. ముగ్గురు తలలు పగిలి, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందారు.

మద్యం మత్తు.. అతివేగం
ఘటనా స్థలిలో చెల్లా చెదురుగా మృతదేహాలు..

రాంగ్‌ రూట్‌లో వచ్చి కళాశాల బస్సును ఢీకొట్టిన బైక్‌

తలలు పగిలి ముగ్గురు దుర్మరణం.. వంగూరు సమీపంలో ప్రమాదం

పెదవేగి, మార్చి 2(ఆంధ్రజ్యోతి):అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఒకే ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు మిత్రులు మద్యం మత్తులో.. రాంగ్‌ రూట్‌లో.. 75 కిలోమీటర్ల వేగంతో వచ్చి, ఎదురుగా వస్తున్న ఓ కళాశాల బస్సును ఢీకొట్టారు. ముగ్గురు తలలు పగిలి, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందారు. పెదవేగి ఎస్‌ఐ ఎం.హరిగోపాల్‌ తెలిపిన వివరాలివి.. ఏలూరు బీడీ కాలనీ చెరువుగట్టుకు చెందిన బొంతు దుర్గాప్రసాద్‌, చిట్టి ఆంజనేయులు, షేక్‌ అహ్మద్‌ వలీ స్నేహితులు. దుర్గాప్రసాద్‌ పెట్రోల్‌ బంకులో పనిచేస్తుండగా, అహ్మద్‌, ఆంజనేయులు తాపీ పని కార్మికులు. సోమవారం ఉదయం విజయరాయి వెళ్లిన ముగ్గురు మధ్యలో మద్యం సేవించినట్లు భావిస్తున్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంతో వేగంగా వాహనం నడిపినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4.45 గంటల సమయంలో ఒకే ద్విచక్ర వాహనంపై జానంపేట వైపు నుంచి ఏలూరు వస్తున్నారు. ఆ సమయంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల బస్సు జానంపేట వైపు వెళుతోంది. వంగూరు సమీపంలోని రంగరాయ గోడౌన్‌ దాటిన తర్వాత మలుపులో ద్విచక్ర వాహనం రాంగ్‌ రూట్‌లో వేగంగా వచ్చి, బస్సు ఎడమ వైపు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో ద్విచక్రవాహనం స్పీడో మీటరు 75 కిలోమీటర్ల దగ్గర ఆగిపోయింది. దుర్గాప్రసాద్‌(26)కు భార్య, కుమారుడు, కుమార్తె, వలీ(26)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఆంజనేయులు (30)కు నాలుగు నెలల కిందట వివాహమైంది. ప్రమాదం సమాచారం తెలసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. పెదవేగి ఎస్‌ఐ ఎం.హరిగోపాల్‌ మృతుల వివరాలు సేకరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం రక్తసిక్తంగా మారింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, వాటి నుంచి కారిన రక్తంతో తడిసిన రహదారి.. చూపరులను భయభ్రాంతులకు గురిచేసింది. చిధ్రమైన మృతదేహాలను శవ పరీక్షకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి ప్రాంగణం మృతుల బంధువుల రోదనలతో నిండిపోయింది.

Updated Date - Mar 03 , 2026 | 12:10 AM