Share News

మాస్టర్‌ ప్లానే వేశారు!

ABN , Publish Date - May 09 , 2026 | 12:42 AM

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అడ్డగోలు లాభాలు ఆర్జించాలని ఉందా ? కోట్లకు పడగలెత్తేయాలని ఆశపడుతున్నారా ?

మాస్టర్‌ ప్లానే వేశారు!

అక్కడ ప్రైవేటు స్థలాలకు టీడీఆర్‌ బాండ్‌లు

వైసీపీలో స్కెచ్‌ ..కూటమిలో అమలు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు రూ.కోట్లలో లబ్ధి

కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు

మున్ముందు మరిన్ని బాండ్‌లు జారీకి సిద్ధం

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అడ్డగోలు లాభాలు ఆర్జించాలని ఉందా ? కోట్లకు పడగలెత్తేయాలని ఆశపడుతున్నారా ? అయితే జిల్లాలోని వాణిజ్య కేంద్రమైన మున్సిపాలిటీకి వెళ్లండి. అక్కడ మాస్టర్‌ ప్లాన్‌ రహదారి ఉన్న భూములు కొనుగోలు చేయండి. అంత సొమ్ములు లేకపోతే భూ యజమానితో ఒప్పందం చేసుకోండి. అడ్వాన్స్‌ సొమ్ములు ఇవ్వండి. ఆ తర్వాత అసలు కథ మొదలెట్టండి. మాస్టర్‌ ప్లాన్‌ రహదారిలోకి వెళ్లినంత భూమిని మున్సిపాలిటీకి దఖలు పరచండి. అంతకు నాలుగింతలు విలువైన టీడీఆర్‌ బాండ్‌లను చేతికొచ్చేస్తాయి.మీరు కొన్న భూమి ధరకంటే అధికంగా సొమ్ము సంపాదించ వచ్చు. వైసీపీ హయాంలో వేసిన మాస్టర్‌ ప్లాన్‌ స్కెచ్‌ అధికారులు ఇప్పుడు అమలు చేస్తున్నారు..

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాజాగా వాణిజ్య కేంద్రమైన మున్సిపాలిటీలో ఇదే జరిగింది. మాస్టర్‌ ప్లాన్‌ వెళ్లే సుమారు ఎనిమిది ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కొనుగోలు చేసుకున్నారు. అందులో మూడు ఎకరాల భూమిని నివాస యోగ్యమైన విధంగా మార్పిడి చేశారు. అందులోనే 40 సెంట్లు భూమి అంటే దాదాపు 1,650 గజాలు మాస్టర్‌ ప్లాన్‌ రహదారిలో పడింది. దానికి నాలుగింతలు టీడీఆర్‌ బాండ్‌లు పొందారు. బాండ్‌ల విలువ సుమారు రూ. 8 కోట్లు ఉంటుంది. గత వైసీపీ హయాంలోనే సదరు పట్టణంలో మాస్టర్‌ ప్లాన్‌ రహదారులంటూ ఇటువంటి స్కెచ్‌ వేశారు. వ్యవసాయ భూముల్లో మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను సిద్ధం చేశారు. కోట్ల రూపాయల విలువైన టీడీఆర్‌ బాండ్‌లను మున్సిపాలిటీ మంజూరు చేసింది.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భారీ లబ్ధి పొందారు. కోట్ల రూపాయలు వెనుకేసుకున్నారు.అందుకు సహకరించిన మున్సిపల్‌ అధికారులు పెద్ద మొత్తం లోనే సంపాదించుకున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత అటువంటి దందాలకు చెక్‌ పడుతుందని అంతా భావించారు. కానీ అప్పటి ప్రణాళికలను ప్రస్తుత అధికా రులు అమలు చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న కొందరు వైసీపీ సానుభూతి పరులకు అధికారులు సాగిల బడుతున్నారు. తాజాగా మంజూరు చేసిన టీడీఆర్‌ బాండ్‌లు ఇప్పుడు సదరు మున్సిపాలిటీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. మున్సిపల్‌ డైరెక్టరేట్‌లోనూ దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.

అక్కడంతా వ్యవసాయ భూమే

ప్రస్తుతం టీడీఆర్‌ బాండ్‌లు జారీచేసిన ప్రాంతంలో వ్యవసాయ భూము లున్నాయి. పైగా ఒకే సర్వే నంబర్‌లో ఎనిమిది ఎకరాల భూమి ఉంది. అందులో నుంచే 60 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రహదారి వెళ్లింది. అలా వెళ్లేలా వైసీపీ హయాంలోనే ప్రణాళిక గీశారు. మళ్లీ అధికారంలోకి వస్తే బాండ్‌లు జారీ చేసుకునేలా మాస్టర్‌ ప్లాన్‌ రహదారిని ఏర్పాటు చేశారు. వాస్తవానికి భూ యజమానులకున్న ఎనిమిది ఎకరాల భూమిలో కేవలం మూడు ఎకరాల భూమిని మాత్రమే వినియోగ మార్పిడి చేశారు. కొంత భూమిని వినియోగ మార్పిడి చేస్తే బాండ్‌లు ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. అక్కడ లేఅవుట్‌కు అనుమతి కూడా ఇవ్వడానికి లేదు. పట్టణంలో ఇలా ఎన్నో విధాలుగా రహదారులను మాస్టర్‌ ప్లాన్‌లో కొత్తగా ఏర్పాటు చేశారు. స్థల యజమానులు లేఅవుట్‌ వేస్తే ఉచితంగా రహదారులు వదలాల్సిన స్థలానికి బాండ్‌లు ఇచ్చేలా వైసీపీ హయాంలో స్కెచ్‌ వేశారు. వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చి తాము లబ్ధిపొందేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

అందరూ కుమ్మక్కయ్యారు..

టీడీఆర్‌ బాండ్‌లపై జారీపై అప్పట్లో కూటమి నేతలు దుమ్మెత్తిపోశారు. పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత, అధికారులు కుమ్మక్కై బాండ్‌లు జారీచేసి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారంటూ కోడై కూశారు. తీరా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే దందాకు మున్సిపల్‌ అధికారులు తెరలేపారు. మాస్టర్‌ ప్లాన్‌ రహదారి పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సహకరిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలో బాండ్‌లకు రికార్డు సిద్ధమైంది. ఇప్పుడు అదే రికార్డులను తిరగదోడారు. బాండ్‌లు జారీ చేసేశారు. మున్ముందు పట్టణంలో మరిన్ని బాండ్‌లు జారీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పట్టణ ప్రణాళిక విభాగంలో ఓ అధికారి, మున్సిపాలిటీలో ముఖ్య అధికారి కుమ్మక్కై బాండ్‌ల జారీకి సాహసిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్‌ ప్రాంతీయ అధికారి ఆశీస్సులు కూడా ఉన్నట్టు సమాచారం. తాజాగా 1,650 గజాలకు నాలుగు రెట్లు విలువైన బాండ్‌లు జారీ చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. మున్సిపాలిటీ ఇచ్చిన బాండ్‌లు విలువ రిజిస్ర్టేషన్‌ మార్కెట్‌ విలువ ప్రకారం దాదాపు 8 కోట్లు ఉంటుందని అంచనా. అధికారులకు ఇందులో పెద్ద మొత్తంలోనే ముడుపులు ముట్టినట్టు అంతా గుసగుసలాడుకుంటున్నారు.

ఇళ్లే లేని చోట బాండ్లు ఎందుకో.. ?

నివాస ప్రాంతాల్లో మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా రహదారిని విస్తరించాల్సి ఉంటే మున్సిపాలిటీ టీడీఆర్‌ బాండ్‌లు ఇస్తుంది. భూసేకరణకు మున్సిపాలిటీ వద్ద సొమ్ములుండవు. కాబట్టి భూయజమానులకు నాలుగు రెట్లు విలువైన బాండ్‌లు జారీచేయడం పరిపాటి. కానీ నివాస ప్రాంతాలు లేని, అవసరం లేని చోట మాస్టర్‌ ప్లాన్‌ రహదారిలో స్థలం ఉంది కదా అని బాండ్‌లు జారీచేస్తే అది ప్రభుత్వానికి తీరని నష్టం తెచ్చి పెడుతుంది. సదరు బాండ్‌లను కొనుగోలు చేసుకున్న వారంతా ప్రభుత్వ అనుమతి లేకుండా, స్థానిక సంస్థలకు సొమ్ములు చెల్లించకుండా బాండ్‌ల విస్తీర్ణం మేర అదనపు నిర్మాణాలు చేపట్టేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం కాసులకు కక్కుర్తిపడ్డ అధికారులు బాండ్‌లు జారీచేస్తున్నారు. వాణిజ్య కేంద్రంలోని పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేస్తున్న అధికారి అడ్డంగా దోచుకుంటున్నారు. మున్సిపాలిటీ ముఖ్యనేతతో కుమ్మక్కయ్యారు. జనాలను పట్టి పీడిస్తున్నారు. పట్టణ ప్రణాళిక అధికారి అయితే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోనూ ఆరితేరిపోయినట్టు పట్టణంలో పెద్ద చర్చే నడుస్తోంది. మున్ముందు మరింతగా బాండ్‌లు జారీకి సిద్ధమైనట్టు సమాచారం. అవసరం లేని బాండ్‌లు ఎందుకు జారీచేస్తున్నారో అధికారులకే తెలియాలి.

Updated Date - May 09 , 2026 | 12:42 AM