దొంగలొచ్చారు.. జాగ్రత్త !
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:29 AM
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దోపిడీ దొంగల గ్యాంగ్‌లు ఉమ్మడి జిల్లాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి దోపిడీ దొంగలు తెలుగు రాష్ట్రాలను ఎంచుకుంటున్నారు. ఖాళీ ప్రదేశాల్లోని నివాసాలు, అపార్ట్‌మెంట్లు టార్గెట్‌గా చేసుకుని పగలు రెక్కీ నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతుంటారు.
ఉమ్మడి పశ్చిమలో
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్
ఏలూరు రామచంద్ర కాలేజీలో
థార్ గ్యాంగ్ దోపిడీ
ముఠాను పట్టుకునేందుకు
ఇతర రాష్ర్టాలకు పోలీసు బృందాలు
వస్తువులు అమ్మేవారిగా వీధుల్లో రెక్కీ..
ఖాళీ ప్రదేశాల్లో , ఊరి చివర ఉన్న ఇళ్లే టార్గెట్
ఎక్కడికక్కడ నిఘా పెట్టిన పోలీసులు
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దోపిడీ దొంగల గ్యాంగ్‌లు ఉమ్మడి జిల్లాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి దోపిడీ దొంగలు తెలుగు రాష్ట్రాలను ఎంచుకుంటున్నారు. ఖాళీ ప్రదేశాల్లోని నివాసాలు, అపార్ట్‌మెంట్లు టార్గెట్‌గా చేసుకుని పగలు రెక్కీ నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతుంటారు. అడ్డు వస్తే ఆయుధాలతో దాడులు చేసి చంపడానికి కూడా వెనుకాడరు. ఇటీవల ఏలూరు జిల్లాలో మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాకు చెందిన థార్ గ్యాంగ్ కదలికలు కనపడటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అనుమానితులపై నిఘా పెంచింది. అన్ని రహదారుల వెంబడి ముమ్మర గస్తీ ఏర్పాటు చేశారు.
ఏలూరు క్రైం / భీమవరం క్రైం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మధ్య ప్రదేశ్‌కు చెందిన థార్ గ్యాంగ్ ఏలూరు జిల్లాలో చోరీకి పాల్పడి లక్షలాది రూపాయలు అపహరించుకుపోవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి అప్రమత్తమైంది. థార్ గ్యాంగ్ విశాఖ నుంచి విజయవాడ వైపు పయనిస్తున్నారంటూ జిల్లా పోలీసు యంత్రాంగానికి ముందే సమాచారం ఉండటంతో అప్రమత్తమైంది. ఈ గ్యాంగ్ ఊరి శివారుల్లోని కాలనీలు, నిర్మానుష్యంగా వున్న ప్రాంతాల్లోని ఇళ్లల్లో చొరబడి దోపిడీలు చేస్తూ ఉంటారనే సమాచారం ఉండటంతో ఏలూరులో జాతీయ రహదారికి సమీపంలో ఉండే ఇళ్లు, గ్రామాల్లో కూడా పోలీసు నిఘా పెట్టారు. అయితే ఏలూరు సమీపంలో జాతీయరహదారి పక్కనే వున్న రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 16వ తేదీ రాత్రి థార్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. ఆ కాలేజీలోని పరిపాలనా విభాగంలోని గదిలోకి ప్రవేశించి కాలేజీ చెస్ట్ లాకర్‌ను అపహరించి కాలేజీ ఆవరణలోకి తీసుకెళ్లి రాళ్లతో పగులకొట్టి అందులో వున్న రూ.78 లక్షలు నగదు అపహరించుకుపోయారు.
వస్తువులు అమ్మేవారిలా వస్తారు..
మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాకు చెందిన థార్ గ్యాంగ్ టెక్నికల్‌గా నైపుణ్యం కలిగి ఉంటారు. దోపిడీ చేయడానికి ముందు రెక్కీ నిర్వహిస్తారు. వివిధ వస్తువులు విక్రయించే వారిలా వీధుల్లో తిరుగుతూ అనువుగా ఉన్న ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు.గ్యాంగ్‌లోని ముగ్గురు సభ్యులు విశాఖపట్నం నుంచి ఏలూరు వరకు రైలు మార్గంలోనే వస్తూ మధ్యమధ్యలో ఉన్న ప్రాంతాల్లో సంచరించినట్లుగా ఫేస్ రికగ్నజైడ్ సిస్టం ద్వారా పోలీసు అధికారులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లోని సభ్యులు ముందుగా రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో వున్న గోభూమి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక లారీడ్రైవర్ వద్ద తమకు ఇల్లు అద్దెకు కావాలని, కుర్చీలు అమ్ముకునేందుకు ఈ ప్రాంతానికి వస్తున్నామని ఇల్లు అద్దెకు దొరికిన తరువాత లోడు వస్తుందని చెప్పినట్టు ఆ ప్రాంతం వారు చెబుతున్నారు. వారు హిందీలో మాట్లాడటంతో అనుమానం వచ్చి ఆధార్ కార్డు కావాలని అడగటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్యాంగ్ సభ్యులు చుట్టుగుంట, గోభూమి ప్రాంతాల్లో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. మొత్తం ఆరుగురు సభ్యుల గ్యాంగ్ రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో దోపిడీకి పాల్పడగా ముగ్గురిని ఎఫ్‌ఆర్‌ఎస్ కెమెరాలు గుర్తించినట్లు స్పష్టమైంది. వీరు విజయవాడ వరకూ రోడ్డు మార్గాన వెళ్లి అక్కడ నుంచి వారి ప్రాంతాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ప్రతాప శివకిశోర్ ఆదేశాలతో డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు మధ్యప్రదేశ్‌కు వెళ్లాయి. మరో నాలుగు బృందాలు వేరే ప్రాంతాల్లో కూడా గాలింపు చేపట్టారు.
థార్ గ్యాంగ్ కోసం ప్రత్యేక బృందాలు
థార్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడటంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. స్థానికంగా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. థార్ గ్యాంగ్ నేరం చేసే ప్రాంతం సమీపంలో కంటైనర్ లాంటి వాహనాన్ని సిద్ధం చేసుకుని ఉంటారని, నేరం చేసిన వెంటనే ఆ కంటైనర్‌లో దాక్కుని రైల్వేస్టేషన్‌కు వెళ్లిపోయి రైలు ద్వారా తమ ప్రాంతానికి వెళ్లిపోతారని గతంలో గుర్తించారు. రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలో నేరం చేయడానికి ముందు గుజరాత్‌లో కూడా నేరానికి పాల్పడినట్లుగా జిల్లా పోలీసులకు సమాచారం అందింది. అక్కడ పోలీసులు కూడా గాలింపు చేపడుతున్నట్లుగా గుర్తించినట్లు సమాచారం.
అద్దెకు ఇళ్లు, లాడ్జీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త
ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లు అద్దెకు ఇవ్వడం కొరివితో తల గోక్కున్నట్లే.. వారు ఎక్కడ నుంచి వచ్చారు ? ఆధార్ కార్డులు, సరైన గుర్తింపు పత్రాలు చూసిన తర్వాత అద్దెకు ఇవ్వాలి. ముఖ్యంగా అనుమానితులు, ఇతర రాష్ట్రాల వారికి అద్దెకు ఇవ్వకపోవడమే మేలు. లాడ్జిల నిర్వాహకులు కూడా చాలామంది సొమ్ములకు ఆశపడి ఎవరో కూడా తెలియకుండానే రూమ్‌లు ఇచ్చేస్తారు. లాడ్జిల్లో పాగా వేసి పగటిపూట గస్తీ నిర్వహించి రాత్రిపూట దొంగతనాలు చేస్తూ ఉంటారు.
గతంలో కూడా దోపిడీలు
జూ మహారాష్ట్ర, నెల్లూరు ప్రాంతాల్లో ఉండే తెలగపాముల ముఠా 2006 సంవత్సరంలో ఏలూరు సమీపంలోని దెందులూరు, పెదవేగి, ఏలూరు మండలాల్లోని పొలాల్లో వున్న తోటల్లో పగటి వేళ దాక్కుని రాత్రివేళ అనేక దోపిడీ, దొంగతనాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా చొదిమెళ్ళ జాతీయ రహదారి పక్కన వున్న ఒక కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసి దోపిడీకి పాల్పడ్డారు.
–పెదవేగి మండలం జంగారెడ్డిగూడెం రోడ్డులోని ఒక హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడి కుటుంబంపై దాడికి పాల్పడి దోపిడీ చేశారు. అప్పట్లోనే 20 రోజుల పాటు ఈ ముఠా ఆ మండలాల్లో ఉంటూ దోపిడీలు, అత్యాచార యత్నాలకు పాల్పడింది. ఒక ముఠా సభ్యుడు పారిపోతూ చింతలపూడి రోడ్డులోని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. కాలు విరిగి పోలీసులకు చిక్కాడు. ఆ ముఠాని అరెస్ట్ చేయడంతో ఈ ముఠా దోపిడీలు తగ్గాయి.తరువాత ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి వచ్చి చోరీలకు పాల్పడ్డారు. అయితే కొన్ని కేసుల్లో వీరు చిక్కలేదు.
–ఏలూరు శాంతినగర్‌లో నివాసముంటున్న న్యాయవాది సత్యనారా యణ ఇంటికి చెడ్డీగ్యాంగ్ వచ్చి ఇంటి తలుపులు బిగించి ఆ ఇంట్లో చేపల చెరువుల యజమాని దోపిడికి చేయడానికి ఐదుగురు సభ్యుల ముఠా ప్రయత్నించారు. ఆ ఇంటికి సీసీ కెమెరాలు ఉంటంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఆ ముఠా సభ్యులు పారిపోయారు. ఆ రోజు రాత్రి చేపల చెరువు యజమాని వద్ద ఇంట్లో సుమారు రూ.2 కోట్లు ఉన్నట్లుగా అప్పట్లోనే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
– ఇటీవల మళ్లీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన వారు ఒక ముఠాగా ఏర్పడి ఏలూరులోని బంగారు షాపును కొల్లగొట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎఫ్‌ఆర్‌ఎస్ కెమెరాల పరిజ్ఞానంతో ఈ ముఠాను అరెస్ట్ చేసి మొత్తం రికవరీ చేశారు.