తేతలి వై.జంక్షన్ నిలిచిన వంతెన పనులు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:05 AM
పశ్చిమ గోదావరి జిల్లాలోని తేతలి వై.జంక్షన్‌లో నిర్మించే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు తీవ్ర జాప్యం జరుగుతుంది.
ఎక్కడి పనులు అక్కడే..
సంవత్సరాల తరబడి తీవ్ర జాప్యం
ప్రమాదాలకు నిలయంగా జంక్షన్
తణుకు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):పశ్చిమ గోదావరి జిల్లాలోని తేతలి వై.జంక్షన్‌లో నిర్మించే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు తీవ్ర జాప్యం జరుగుతుంది. నాలుగేళ్ల క్రితం జాతీయ రహదారిపై ఉండ్రాజవరం, తేతలి వై.జంక్షన్‌లలో ప్లైఓవర్‌లు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఉండ్రాజవరం జంక్షన్‌లో వంతెన నిర్మాణ పనులు చేస్తున్న సమయంలోనే తేతలి వై.జంక్షన్‌లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి కొన్ని పిల్లర్లు వేశారు. పిల్లర్ల నిర్మాణ సమయంలో కొంతమంది వంతెన నిర్మాణ ప్రాంత వాసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాణ సంస్థ పనులు నిలుపుదల చేసింది. ఈ మేరకు ఎక్కడి పనులు అక్కడే నిలపుదల చేశారు. పనులు ఆపి సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు. వంతెన నిర్మాణం ఎప్పటికి జరుగుతుందోననే ఆందోళన స్థానికులతోపాటు, వాహనదారులు ఎదురుచూస్తున్నారు.
2022లో నిలుపుదల చేసిన పనులు
ఉండ్రాజవరం, తేతలి వై.జంక్షన్‌ల ప్లైఓవర్ నిర్మాణ పనులు 2022 సెప్టెంబరులో రెండు వంతెనలు సమాంతరంగానే ప్రారంభించారు. ముందుగా ఉండ్రాజవరం జంక్షన్‌లో వంతెన పనులు కొద్దిమేర పిల్లర్లు వేసిన తర్వాత, తేతలి వై.జంక్షన్‌లో వంతెనకు పిల్లర్ల నిర్మాణం ప్రారంభించారు. హైవే అధికారులు, రెవెన్యూ అధికారులు రెండు ప్రాంతాల్లోనూ మార్కింగ్‌లు ఇచ్చారు. ఉండ్రాజవరం జంక్షన్‌లో పనులు జరిగాయి. తేతలి జంక్షన్‌లో కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో అదే సంవత్సరంలో పనులు నిలిచిపోయాయి.
అభ్యంతరాలు ఇలా..
ఫ్లైఓవర్ నిర్మాణం సమయంలో అధికారులు వంతెన కోసం ముందుగా అరవై మీటర్లు వెడల్పుగా నిర్ణయించారు. దానిని మళ్లీ నలభై మీటర్లకు తగ్గించారు. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమే అరవై మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేయాలని భూమి యజమానులు కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు మళ్లీ సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగానే సర్వే సమయంలో భూయజమానులు హక్కు పత్రాలతో హాజరై సంబంధిత స్థలం హద్దులు చూపించాలని అధికారులు కోరారు.
ప్రమాదాలకు పరిపాటిగా సెంటర్
తేతలి వై.జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా మారింది. హైవే ఆనుకుని ఉన్న అనేక గ్రామాలు తేతలి, వడ్లూరు, దువ్వ, సూర్యారావుపాలెం, సత్యవాడ, కాల్దరి, పసలపూడి వంటి రెండు జిల్లాలకు చెందిన ప్రజలు తణుకు వెళ్లాలంటే కచ్చితంగా తేతలి జంక్షన్ దాటి వెళ్లాల్సిందే. ఏదో ఒక సమయంలో జంక్షన్ వద్ద ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. కొంతమంది ప్రాణాలు పోవడం, మరికొంతమంది గాయాలపాలైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
కోర్టు ఉత్తర్వుల మేరకు సర్వే
తేతలి వై.జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణకు కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి, రెవెన్యూ అధికారులతో సర్వే ప్రారంభిస్తున్నాం. త్వరలోనే సర్వే పూర్తిచేసి ఎంతమేర భూమి ఉందో తేలుస్తాం. సర్వే సమయంలో భూయజమానులు హక్కు పత్రాలతో హాజరై స్థలం హద్దులు చూపించాలి.
– డీవీఎస్‌ఎస్ అశోక్ వర్మ, తహసీల్దార్
వంతెన పనులు పూర్తిచేయాలి
వంతెన నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి. చాలా గ్రామాల ప్రజలు తణుకు పట్టణంలోకి రావా లంటే జంక్షన్ దాటి రావాల్సిందే. హైవేపై భారీ వాహనాలు రాకపోకల తో రద్దీ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు సత్వరమే పనులు చేపట్టి పూర్తి చేయాలి.
– నల్లా సత్తిబాబు, పైడిపర్రు
ప్రమాదాలకు నిలయంగా జంక్షన్
తేతలి వై.జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా ఉంది. చాలా సందర్భాలలో జాతీయ రహదారికి ఇరువైపులా ట్రావెల్స్ బస్సులు నిలుపుదల చేస్తుంటారు. ట్రాఫిక్‌కు ఎక్కువగా ఉంటుంది. మోటారు సైకిళ్లు, ఆటోలను భారీ వాహనాలు ఢీకొట్టిన ఘటనలు చాలాసార్లు జరుగుతున్నాయి.
– తిరుపతి రమేశ్, పైడిపర్రు