Share News

కల్యాణవైభోగమే..

ABN , Publish Date - May 01 , 2026 | 12:33 AM

సర్వజగధ్రక్షకుడైన శ్రీవారు సర్వాభరణ భూషితుడై పెండ్లి అలంకారాల్లో ఉండి, నుదుటున కల్యాణ తిలకం...బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న అలివేలు మంగ, ఆండాళ్‌ దేవేరులను పరిణయమాడారు.

కల్యాణవైభోగమే..
కల్యాణమూర్తులకు హారతులిస్తున్న అర్చకులు

చిన్నతిరుమలేశుని కల్యాణం....కడురమణీయం

ద్వారకాతిరుమల, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): సర్వజగధ్రక్షకుడైన శ్రీవారు సర్వాభరణ భూషితుడై పెండ్లి అలంకారాల్లో ఉండి, నుదుటున కల్యాణ తిలకం...బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న అలివేలు మంగ, ఆండాళ్‌ దేవేరులను పరిణయమాడారు. ఈ కల్యాణ ఘడియలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తజనులు తరించారు. ఆ దేవదేవుని కల్యాణ ఘట్టం ఆవిష్కృతమైన వేళ భక్తజనుల మది ఆనందంతో నిండింది. ఈ ప్రత్యక్ష అనుభవాన్ని చవిచూసిన భక్తులు గోవిందా......గోవిందా అంటూ భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ అద్భుత దృశ్యం ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిన్నతిరుపతివాసుని ఆలయంలో గురువారం రాత్రి ఆవిష్కృతమైంది.

వేదిక వద్దకు కల్యాణమూర్తులు

శ్రీవారు,అమ్మవార్ల కల్యాణమూర్తులను ఉంచి అలంకరించి ఆలయ అనివేటి మండపంలో ఏర్పాటుచేసిన వేదిక దగ్గరకు అట్టహాసంగా తెచ్చారు. అంతకు ముందే వేదికను పచ్చిపూలతో, కళాసౌందర్యాలతో నయనానందకరంగా అలంకరించారు. వేదికపై ఉంచిన బంగారు సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి అలంకరించి అర్చకులు కల్యాణతంతును ప్రారంభించారు.

కల్యాణతంతు ఇలా...

పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిగిన ఈ కల్యాణతంతులో భాగంగా ఆలయ అర్చకులు ముందుగా శాంతి హోమాన్ని జరిపి సర్వదేవతారాధన, సంకల్పం, కంకణపూజలు నిర్వహించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున, దేవస్థానం తరపున ఆలయ చైర్మన్‌ రాజా ఎస్‌వి సుధాకరరావు కల్యాణమూర్తులకు పట్టువస్త్రాలను అందజేశారు. ఆ తరువాత అర్చకులు మూర్తులకు మధుపర్కాలను సమర్పించారు. సుముహూర్త సమయంలో జీలకర్ర, బెల్లం ధరింపచేసి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాలు వైభవోపేతంగా జరిపించారు. ఈవో వి త్రినాథరావు కల్యాణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:33 AM