జాతర జోష్
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:19 AM
స్థానిక పడమరవీధిలో ఆదిమహాలక్ష్మీ, గంగానమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతరలో భాగంగా మేడల వద్ద ఆదివారం మహాకుంభ నివేదన నిర్వహణకు అంతా సిద్ధం చేశారు.
నేడు మహా కుంభ నివేదన.. రేపు కొర్లబండిలో అమ్మవార్ల భారీ ఊరేగింపు
ఏలూరు కార్పొరేషన్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక పడమరవీధిలో ఆదిమహాలక్ష్మీ, గంగానమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతరలో భాగంగా మేడల వద్ద ఆదివారం మహాకుంభ నివేదన నిర్వహణకు అంతా సిద్ధం చేశారు. అమ్మవార్ల వద్ద భక్తుల రాకపోకలకు బారికేట్లను ఏర్పాటు చేశారు. కుంభం పోసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజాము 2.35 గంటల నుంచి కుంభం పోసే కార్యక్రమం ప్రారంభించి అదే రోజు రాత్రి వరకు నిర్వహిస్తారు. మేడల్లోని అమ్మవార్లను దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి కుంభం పోసేందుకు వెసులుబాటు కల్పించారు. సోమవారం ఉదయం 8.36 గంటలకు అమ్మవార్లను కొర్లబండిపై అలంకరించి చిత్రవిచిత్ర వేషాలు, మేళతాళాలు, బాజాభజంత్రీలు, వసంతోత్సవాలతో నగరంలో ఊరేగింపు జరిపి ఊరి పొలిమేర్ల వరకు అమ్మవార్లను సాగనంపడంతో పడమర జాతర ముగుస్తుంది. ఆదివారం మహాకుంభ నివేదన కావడంతో శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు మేడల్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. శనివారం నగరంలో మేళతాళాలతో కొర్లబండిని ఊరేగించి మేడల వద్దకు తీసుకువచ్చారు.
ఊరంతా సందడి
బంధువులకు నాన్‌వెజ్ వంటకాలతో విందు
నాటు కోళ్లకు, మేకపోతులకు డిమాండ్
ఏలూరు రూరల్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : పార్వతీదేవి అంశతో వెలసిన గ్రామ దేవతలు గ్రామ రక్షకులుగా వెలసి ఉంటారు. అలాంటి గ్రామ దేవతల జాతరలో ఏలూరులో సందడి నెలకొంది. ఇటీవల తూర్పు వీధితో పాటు ఐదు చోట్ల జాతర ముగిసింది. 150 ఏళ్ళ చరిత్ర ఉన్న పడమర వీధి గంగానమ్మ జాతర ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం కుంభం పోయుట, సోమవారం కొర్లబండిలో సాగనంపై కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడు నెలల పాటు వేడుకలకు దూరంగా ఉన్న నగర ప్రజలు ఆదివారం అసలైన పండగ, జాతర సందర్భంగా నగరంలో సందడి నెలకొంది. జాతరను పురస్కరించుకొని నూతన వస్త్రాలు ధరిస్తారు. బంధువులు పిలిచి నాన్‌వెజ్ వంటకాలతో, విందును ఏర్పాటు చేస్తారు. ఈక్రమంలో శనివారం వస్త్ర దుకాణాలు, చేపల మార్కెట్, కిరాణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఉన్నత చదువులకోసం, ఉద్యోగులకు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం నగరానికి చేరుకున్నారు. .
మార్కెట్లో చికెన్, మటన్, రొయ్యలు, చేపల ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో మటన్ 1200, కిలో బాయిలర్ చికెన్ 360, రొయ్యలు 350 పలికింది. ఇదే సమయంలో నాటు కోళ్ళకు డిమాండ్ పెరిగింది. స్థానిక పాత బస్టాండ్ సెంటర్ ఫ్లైఓవర్ వద్ద, వంగాయగూడెం సెంటర్, వద్ద నాటు కోళ్ళ కొనుగోలుకు జనం ఎగబడ్డారు. గంగానమ్మకు మేకలు, కోళ్ళ నైవేద్యం సమర్పించి ఇళ్ల వద్ద వాటిని కోసి భోజనంలో వడ్డిస్తారు. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువైంది. నాటు కోడి మాంసానికి మటన్ మాదిరిగానే రేటు పలుకుతోంది. కిలో కోడి ధర రూ.1000 చొప్పున, పుంజు రూ.3వేలు పైనే విక్రయాలు జరిగాయి. ఇక షామియానాకు, గిరాకీ పెరిగింది. ప్రతి ఇంటి ముంగిట షామియానాతో ఇల్లలన్నీ సందడి నెలకొన్నాయి.
1200 మంది పోలీసులతో బందోబస్తు
ట్రాఫిక్ జామ్‌తో ఇక్కట్లు
ఏలూరు క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జాతర సందర్భ ంగా క్యూ లైన్లలో తోపులాట జరుగకుండా పటిష్టమైన భద్రత తీసుకోవాలని అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు అన్నారు. ఏలూరు పడమరవీధి గంగానమ్మ జాతర ఈనెల ఒకటి, రెండు తేదీలలో జరుపుతున్న దృష్ట్యా 1200 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు నియమించారు. పోలీస్ సిబ్బంది అంతా శనివారం రాత్రి బందోబస్తు విధులకు హాజరవ్వగా అదనపు ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు సిబ్బందికి విధి నిర్వహణ, దిశ నిర్ధేశాన్ని చేశారు. ఇదిలావుండగా శనివారం రాత్రి 7 గంటల నుంచి నగరంలో జనసంచారం, వాహనాల రద్దీ మరింత పెరిగిపోయింది. ఎక్కువ వాహనాల రద్దీ పెదపాడు బ్రిడ్జి వద్దే ఉండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు ఈనెల 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 2వతేదీ అర్ధరాత్రి వరకూ నగరంలో రాకపోకలు నిషేధమని వెల్లడించారు.