కరుణించు.. గుబ్బల మంగమ్మ !
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:18 AM
దినదినాభివృద్ది చెందుతున్న గుబ్బల మంగమ్మ ఆలయప్రాంతంలో సమస్యలు తిష్ఠవేశాయి. వీటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అమ్మవారి చెంత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు కోరుతున్నారు.
కరుణించు.. గుబ్బల మంగమ్మ !
అభివృద్ధికి అడ్డంకిగా సరిహద్దులు
సరిహద్దు సరిలేక అడ్డుకుంటున్న తెలంగాణ అటవీశాఖ అధికారులు
రాళ్లు పైకిలేచిన రోడ్లు, వెంటాడుతున్న విద్యుత్ సమస్య
బుట్టాయగూడెం, జూలై 18 (ఆంధ్రజ్యోతి):
అడవి బిడ్డల ఆరాధ్య ధైవం, ఆధ్యాత్మిక కేంద్రంగా
దినదినాభివృద్ది చెందుతున్న గుబ్బల మంగమ్మ ఆలయప్రాంతంలో సమస్యలు తిష్ఠవేశాయి. వీటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అమ్మవారి చెంత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు కోరుతున్నారు. మన్యం ప్రాంతంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొంది వేలాది మంది భక్తులచే పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ ఆలయంలో సమస్యలు భక్తులను వెంటాడుతున్నాయి. భక్తులు భక్తిభావంతో వీటిని మరిచిపోయి ప్రత్యేక పూజలు, మొక్కుబడులు చెల్లిస్తున్నారు. అమ్మవారి పవిత్ర క్షేత్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం అధికారులు, నాయకులపై ఉందని భక్తులు తెలియజేస్తున్నారు.
ప్రధాన అడ్డంకి సరిహద్దులే..
అమ్మవారి ఆలయ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు సరిహద్దు ప్రాంతాలే ప్రధాన అడ్డంకిగా మరాయి. రెండు తెలుగు రాష్ర్టాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న అమ్మవారి ఆలయం వద్ద అబివృద్ధి పనులు చేపట్టాలంటే సరిహద్దులు సరిగా లేకపోవడంతో తెలంగాణ అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎక్కడ ఏపని ప్రాంభించినా భూభాగం తమదేనంటూ అడ్డు తగులుతున్నారు. భక్తుల కోసం నిర్మించ తలపెట్టిన షెడ్లు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కారణం తెలంగాణ అటవీశాఖ అధికారులే. ఆలయం ప్రాంతంలో అభివృద్ధి పనులు ముందుకు సాగాలంటే తొలుత బుట్టాయగూడెం రెవెన్యూ, అటవీశాఖల సంయుక్తంగా సర్వే చేసి గుడి సరిహద్దును అధికారికంగా గుర్తించాలని భక్తులు కోరుతున్నారు.
సరైన రోడ్లు, సౌకర్యాలు నిల్
ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి పందిరిమామిడిగూడెం నుంచి కామవరం మీదుగా అమ్మవారి ఆలయం వరకు రహదారి పూర్తిగా పాడైపోయి రాళ్లు పైకిలేచి భక్తులను ఇబ్బందులు పెడుతున్నాయి. ఏళ్ల తరబడి విద్యుత్ సమస్యను అమ్మవారిని వెంటాడుతూనే ఉంది. వాహనాలు పార్కింగ్ సదుపాయం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శనం తర్వాత విశ్రాంతి తీసుకోడానికి హాలు లేదు. వంటషెడ్లు లేవు. మంచినీరు. మరుగుదొడ్లు లేవు. ఏదైనా సరే అడవిపైనే ఆధారపడాలి. పరిశుభ్రత అంతంత మాత్రమే. వర్షాకాలం వచ్చిందంటే రహదారి మార్గం లేక భక్తులు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. అమ్మవారు అటవీ ప్రాంతంలో ఉన్నందున మధ్య మధ్యలో కొండవాగులు దాటాలి. ప్రమాదాలు తప్పవు. వాగులపై కల్వర్టులు నిర్మించాలి.
విద్యుత్‌తో సమస్యలు పరిష్కారం..
విద్యుత్ సదుపాయం కల్పిస్తే చాలావరకు సమస్యలు పరిష్కారం అయినట్టే. ముఖ్యంగా సరిహద్దులు తేల్చి అటవీశాఖ అనుమతులు లభిస్తే భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించవచ్చు. రహదారిని ఏర్పాటు చేయవచ్చు. భక్తులకు విశ్రాంతి హాలు, మరుగుదొడ్లు, వంటషెడ్లు, పార్కిం గ్ సదుపాయం కల్పించవచ్చు. స్థానిక గిరిజనులకు దుకాణాలు ఏర్పాటు చేయవచ్చు. వీటన్నిటిని ఏర్పాటు చేయాలని కోరుతూ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ బొల్లా బొజ్జిదొరకు ఆలయ కమిటీవారు వినతిపత్రం అందజేశారు. రహదారి ఏర్పాటుకు ఏలూరు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారని కమిటీవారు తెలిపారు. సరిహద్దులు గుర్తించి నిధులు, అనుమ తులు ఇచ్చి మౌలిక సదుపాయాలను వేగవంతం చేయాలని కోరుతున్నారు. భక్తుల కష్టాలు తీరాలంటే అబివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు.