మహా సంబరం
ABN , Publish Date - May 28 , 2026 | 12:35 AM
జిల్లా తెలుగు తమ్ముళ్లలో మహానాడు జోష్ కనిపించింది. మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో తొలిరోజు బుధవారం ఈ వేడుకలు నిర్వహించారు.
మహానాడు తొలిరోజు సక్సెస్
జిల్లాలో 68 చోట్ల స్ర్కీన్లు.. 30 వేల మంది హాజరు
నేతల దిశానిర్దేశం.. టీడీపీ నాయకులు, కేడర్‌లో ఉరకలేసిన ఉత్సాహం
రాష్ట్ర మహానాడుకు మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి, పితాని
పొలిట్‌బ్యూరో సభ్యులు మంతెన, షరీఫ్, సుజాత తదితరులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లా తెలుగు తమ్ముళ్లలో మహానాడు జోష్ కనిపించింది. మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో తొలిరోజు బుధవారం ఈ వేడుకలు నిర్వహించారు. భీమవరం, ఉండి, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోని 68 క్లస్టర్ల పరిధిలో కల్యాణ మండపాలు, పార్టీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్ల పరిసరాలు పసుపు జెండాల తోరణాల రెపరెపలతో కళకళలాడాయి. నియోజకవర్గానికి నాలుగు వేల నుంచి నాలుగు వేల 500 మంది చొప్పున మొత్తం క్లస్టర్లలో సుమారు 30 వేల మంది తమ్ముళ్లు, మహిళలు, యువత హాజరయ్యారు. పార్టీ ముఖ్య నేతలు జెండాలను ఆవిష్కరించి, ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. ఉదయం పది గంటలకు మహా నాడు వేడుకలు ప్రారంభం కాగా ఎండ వేడిమి పడకుండా భారీగా టెంట్లు, కుర్చీలు వేశారు. ప్రతిచోట ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం నాన్‌వెజ్‌తో భోజనాలు, కూలింగ్ వాటర్, మజ్జిగ అందజేత తదితర సకల సౌకర్యాలు ముఖ్య నేతల పర్యవేక్షణలో సాగాయి. ప్రతిచోట 300కు పైబడి నాయ కులు, కార్యకర్తలు హాజరు కావడంతో భారీ కూలర్లను ఏర్పా టుచేశారు. మధ్యాహ్నానికి గ్రామీణ ప్రాంతాల్లోని క్లస్టర్లలో నాయకులు, కార్యకర్తలు అఽధిక సంఖ్యలో హాజరయ్యారు. వీరంతా ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎల్‌ఈడీ స్ర్కీన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్, ఇతర నేతల ప్రసంగాలను ఆసక్తిగా తిలకించారు.
ఇన్‌చార్జ్‌ల పరిశీలన
నియోజకవర్గ పరిశీలకులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, బూత్ కన్వీనర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇన్‌చార్జ్ తోట సీతారామలక్ష్మి భీమవరం పరిధిలోని క్లస్టర్లను పరిశీలించి క్యాడర్ ను ఉత్సాహపరిచారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి, నరసాపురంలో పొత్తూరి రామరా జు, ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తనయుడు కనుమూరు భరత్, ఆచంటలో పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. క్యాడర్, పార్టీ నాయకులను ఉత్సా హపరిచారు. తెలుగుదేశం అధిష్టానం పొదుపులో భాగంగా తొలిసారి నిర్వహించిన క్లస్టర్ విధానం విజయవంతం కావటంతో జిల్లా నాయకత్వంలో జోష్ నింపింది. వారం రోజులుగా చేసిన ఏర్పాట్లు ఫలించాయి. కార్యకర్తలకు వివిధ రకాల రుచులతో భోజన సౌకర్యాలను కల్పించారు.
యువ నాయకత్వం జోష్
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా యువ నాయకత్వం ఈసారి వర్చువల్ మహానాడులో కీలకపాత్ర పోషించింది. ఎన్నికల్లో సీట్ల కోసం ఇప్పటి నుంచే పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కార్యకర్తలకు, నాయకులకు చేదోడు వాదోడుగా ఉంటూ మహానాడు వేదికలపై సందడి చేశారు. లోకేశ్ ప్రసంగాలకు మహిళలు, యువత, కీలక నేతలు సైతం కేరింతలతో సందడి చేశారు. రెండో రోజూ పలు అంశాలపై చర్చలు సాగనున్నాయి. జిల్లా అభివృద్దికి సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మహానాడులో మన నేతలు
టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడుకు మంత్రి నిమ్మల రామానాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, మంతెన రామరాజు, ఎంఏ షరీఫ్, పీతల సుజాత, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. తొలిరోజు జిల్లా నుంచి జోనల్ ఇన్‌ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎంఏ షరీఫ్ మాట్లాడటానికి అవకాశం లభించింది. రాష్ట్రాభివృద్ధిని, సీఎం చంద్రబాబు ప్రజలకు అందిస్తున్న లబ్ధిని వివరించారు.