ఉపాధ్యాయుల ఉద్యమ బాట
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:56 AM
ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు ఏలూరులో మంగళవారం భారీ ర్యాలీ, పికెటింగ్ నిర్వహించారు.
డీఏ, 12వ పీఆర్సీపై ఫ్యాప్టో ఆందోళన
ఏలూరులో భారీ ర్యాలీ
కలెక్టరేట్ వద్ద పికెటింగ్
ఏలూరు రూరల్, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు ఏలూరులో మంగళవారం భారీ ర్యాలీ, పికెటింగ్ నిర్వహించారు. ఏపీ ఎన్‌జీవో సంఘం కార్యదర్శి, ఏపీ జేఏసీ కోచైర్మన్ నెరుసు రామారావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి, అనంతరం డీఆర్‌వోకు వినతిపత్రం సమర్పించారు. ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ జి.మోహన్ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కోచైర్మన్ కె.నరహరి మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని కోరారు. టెట్‌కు సిద్ధమయ్యే సమయంలో బోధనకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, టెట్ సిలబస్‌ను ఉపాధ్యాయుల బోధనా అంశాలకు అనుగుణంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. 2023లోనే ఏర్పాటు కావల్సిన 12వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. తక్షణమే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసి అప్పటి వరకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఉపాధ్యాయుల పీఎఫ్ సమస్య పరిష్కారం, అంతర్ యాజమాన్య బదిలీలు, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు, బోధనేతర పనుల నుంచి విముక్తి, ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం, కారుణ్య నియామకాల పెండింగ్ కేసులు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈవో సంఘం ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయ సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.