‘స్పెషల్ టెట్’ మంటలు!
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:24 AM
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం నిర్వహించనున్న స్పెషల్ టెట్’పై ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర నిరసన, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
మార్గదర్శకాలన్నీ అసంబద్ధమే : ఏపీటీఎఫ్
జిల్లావ్యాప్తంగా డివిజన్, మండల
కేంద్రాల్లో యూటీఎఫ్ నిరసనలు
నేటి నుంచి బైక్ బజాతాలు
3న చలో విజయవాడ
ఏలూరు అర్బన్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం నిర్వహించనున్న స్పెషల్ టెట్’పై ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర నిరసన, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీకి పోటీ పడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు నిర్ణయించినట్టు గానే ఇన్‌సర్వీస్ టీచర్లకు కూడా ఉత్తీర్ణతా మార్కు లను నిర్ణయిస్తే ‘స్పెషల్ టెట్’ ప్రయోజనమేంటని యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
స్పెషల్ టెట్ సిలబస్, నిర్వహణ విధానం అసం బద్ధంగా ఉన్నాయని, తక్షణమే సవరించి మరోదఫా మార్గదర్శకాలను విడుదలచేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రెడ్డిదొర డిమాండ్ చేశారు. నాన్ లాంగ్వేజెస్ ఉపాధ్యాయులకు తెలుగు, ఇంగ్లీషు సబ్జె క్టుల గ్రామర్, కవులు, గ్రంథాలు, తదితర అంశాల అవసరంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఇదే క్రమంలో భాషా సబ్జెక్టులు, సోషల్ స్టడీస్ టీచర్లకు సంబంధిత సబ్జెక్టుల నుంచి 60 మార్కు లకు ప్రశ్నలిచ్చి, గణితం, సైన్స్ టీచర్లకు మాత్రం వారి సబ్జెక్టుల నుంచి 16 మార్కులకే ప్రశ్నలను పరిమితం చేయడంలో ద్వంద్వవైఖరిని ప్రభుత్వం గమనించాలని డిమాండ్ చేశారు. స్కూల్ అసిస్టెం ట్ కేటగిరీ టీచర్లకు వారి సబ్జెక్టు నుంచి మాత్రమే ప్రశ్నలనివ్వాలని కోరారు. ఇన్‌సర్వీస్ టీచర్లందరికీ ఆన్‌లైన్ విధానంలో రోజులతరబడి టెట్ నిర్వహించ కుండా, పేపర్ పెన్ విధానంలో ఒకేరోజు, ఒకే విడతలో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసు కుంటేనే స్పెషల్ టెట్ అర్థవంతంగా ఉంటుందన్నా రు. 25–30 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు ప్రభుత్వం మాదిరి ఏపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని డిమాండ్ చేశారు. టీచర్లకు టెట్ ఉత్తీర్ణత మార్కులను సామాజిక వర్గాలవారీగా నిర్ణయించడం సబబు కాదన్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లందరికీ టెట్ ఉత్తీర్ణత మార్కులను 60గా నిర్ధారించాలన్నారు. డీఎస్సీ–2009కి ముందు నుంచి ఉపాధ్యాయవృత్తిలో కొనసాగుతున్న వారికి టెట్’ అవసరం లేకుండా విద్యాహక్కు చట్టాన్ని సవరించేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
డీఈవో కార్యాలయం వద్ద నిరసన
స్పెషల్ టెట్ ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిం చాలని, ఉత్తీర్ణత మార్కులను రిజర్వేషన్ కేటగిరీ ప్రామాణికంగాకాకుండా అందరికీ 35 మార్కులుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వ ర్యంలో డీఈవో కార్యాలయం వద్ద మంగళవారం టీచర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. సంఘ జిల్లా నాయకులు రవికుమార్, సుధారాణి, రాంబాబు, శివశంకరరావు, అంజన మాట్లాడుతూ 30 ఏళ్లకు పైబడి ఉపాధ్యాయ ఉద్యోగంచేస్తున్న వారిని స్పెషల్ టెట్ నుంచి మినహాయించాలని కోరారు. 50 ఏళ్ల వయసు పైబడిన ఉపాధ్యాయుల్లో అభద్రతాభావం నెలకొందని, టెట్ అర్హత సాధించకపోతే ఉద్యోగాలు కోల్పోవాల్సివస్తుందనే ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకోసం నిర్వహించనున్న స్పెషల్ టెట్‌లో ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనకు ఎటువంటి ఉపశమన చర్యలులేవన్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు డివిజన్, మండలాల్లో బైక్ జాతాలు, సమావేశాలు నిర్వహించి టీచర్లను ఉద్యమంలో భాగస్వాములుగా చేస్తామని, సెప్టెంబరు 3న చలో విజయవాడ ఆందోళన చేపడతామని వెల్లడించారు.