టీచర్ల పదోన్నతులకు సిద్ధం
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:41 AM
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల టీచర్లకు పదోన్నతి కల్పించేందుకు ఉద్దేశించిన సీనియార్టీ జాబితాలను జిల్లా విద్యా శాఖ శనివారం విడు దల చేసింది.
ఉమ్మడి పశ్చిమలో రెండో విడత సీనియార్టీ జాబితాలు విడుదల
ఏలూరు అర్బన్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల టీచర్లకు పదోన్నతి కల్పించేందుకు ఉద్దేశించిన సీనియార్టీ జాబితాలను జిల్లా విద్యా శాఖ శనివారం విడు దల చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్, మున్సిపాల్టీలు, ఏలూరు నగరపాలక సంస్థ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తొలివిడత సాధారణ సీనియార్టీ జాబితాను టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(టిస్) ఆధారంగా రూపొందించింది. ఈ జాబితాపై అందిన అభ్యంతరాలను పరిష్కరించామని, సవరణలతో కూడిన రెండో విడత సీనియార్టీ జాబితాను ఈ నెల 15 నుంచి డీఈవోఏలూరు.ఓఆర్‌జీ వెబ్‌సైట్, నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచుతామని ఉమ్మడి జిల్లా డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు వుంటే ఈ నెల 16 నుంచి 21వ తేదీలోగా అన్ని పనిదినాల్లో ఉదయం పది నుంచి సాయంత్రం సాయంత్రం ఐదు గంటలలోపు సరైన ఆధారాలతో సంబంధిత డీవైఈవోలు, ఎంఈవోల ద్వారా ఏలూరులోని ఉమ్మడి జిల్లా డీఈవో కార్యాలయంలో సమర్పించాలని కోరారు. అభ్యంతరాల స్వీకరణకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.
హేతుబద్దీకరణ తర్వాతే పదోన్నతులు
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 16,210 మంది టీచర్లు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరందరికీ సీనియార్టీని సబ్జెక్టుల వారీగా నిర్ధారించి జాబితాలను రూపొందించారు. ఇటీవలే మెగా డీఎస్సీ–2025 రిక్రూట్‌మెంట్ పూర్తికాగా, కేవలం జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల్లో అరకొర వెకెన్సీలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాలు, ఏలూరు నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల/తరగతి వారీగా ఉపాధ్యా యుడు : విద్యార్థుల సంఖ్యను ఒక కటాఫ్ తేదీకి ప్రామాణికంగా తీసుకుని హేతుబద్దీకరణ(రేషన లైజేషన్)ను ముందుగా చేసి, సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్ల కొరతను నిర్ధారిం చుకుని ఆ మేరకు వెకెన్సీలను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిలో సంబంధిత సబ్జెక్టుకు మిగులు (సర్‌ప్లస్)గా ఉంటే ఆ పోస్టులను ఆయా సబ్జెక్టుల్లో కొరతవున్న పాఠశాలలకు సర్దుబాటు/షిఫ్ట్ చేస్తారు.
వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద ఈ ఏడాది ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసిన వారందరినీ త్వరలో జరుగనున్న సాధారణ బదిలీల కౌన్సెలింగ్‌లో చేర్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే నికరంగా ఎన్ని వెకెన్సీలు వుంటాయో గుర్తించి, అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతులు ఇస్తారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పదోన్నతులిచ్చే అవకాశం ఉంది.