గురుపూజోత్సవానికి ఫ్యాప్టో దూరం!
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:48 AM
:గురుపూజోత్సవం సంద ర్భంగా జిల్లాలో ఎంపిక చేసిన టీచర్లకు శనివారం ఏలూరు జడ్పీ హాలులో జిల్లా విద్యాశాఖ అందజేయనున్న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఽఘాల నుంచే నిరసన ఎదురవుతోంది.
రావికంపాడు హైస్కూలు హెచ్‌ఎంపై దాడి ఘటనలో డీఈవో హామీలు నిలబెట్టుకోలేదని ఆవేదన
నేడు అన్ని పాఠశాలల్లో నిరసనలకు పిలుపు
ఏలూరు అర్బన్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి):గురుపూజోత్సవం సంద ర్భంగా జిల్లాలో ఎంపిక చేసిన టీచర్లకు శనివారం ఏలూరు జడ్పీ హాలులో జిల్లా విద్యాశాఖ అందజేయనున్న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఽఘాల నుంచే నిరసన ఎదురవుతోంది. టీచర్స్ డే వేడుకను బహిష్కరించడంతో పాటు, జిల్లాలోని అన్ని పాఠశాల ల్లో ఇంటర్వెల్ సమయంలో విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాలకు వినతి పత్రాలను ఇవ్వాలని శుక్రవారం సాయంత్రం ఏలూరులో సమావేశమైన ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు పిలుపునిచ్చారు. ఇటీవల కామవరపుకోట మండలం రావికం పాడు జడ్పీ హైస్కూలు హెచ్‌ఎంపై వచ్చిన అభియోగాలపై విచారణ జరపడానికెళ్లిన డీఈవో వెంకటలక్ష్మమ్మ సమక్షంలోనే కొందరు వ్యక్తులు హెచ్‌ఎంపై భౌతికదాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనలో డీఈవో వైఖరిని ఖండిస్తూ ఉద్యమానికి ఫ్యాప్టో సభ్య సంఘాలు నిర్ణయిం చగా, ఉద్యమాన్ని నిలువరించడానికి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈవో అప్పట్లో చర్చలు జరిపారు. హెచ్‌ఎంపై దాడికి పాల్పడిన వ్యక్తు లపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పున రావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఫ్యాప్టో నాయకులు శాంతించారు. అయితే వారాలు గడుస్తున్నా దాడికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు లేకపోవడంతో మళ్లీ ఉద్యమించాలని ఫ్యాప్టో సభ్యసంఘాలు నిర్ణయించాయి. శుక్రవారం జరిగిన ఫ్యాప్టో జిల్లా సమావేశంలో చైర్మన్ జి.మోహన్ మాట్లాడుతూ హెచ్‌ఎంపై జరిగిన భౌతికదాడిని తీవ్రమైన అంశంగా పరిగణించి కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ చేయించాలని, బాధిత హెచ్‌ఎంకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్యాప్టో జిల్లా నాయకులు జి.వెంకటేశ్వరరావు, జె.రవీంద్ర, ఐ.రమేష్, టి.రామారావు, వి.మురళీకృష్ణ, ఇ.రామ్మోహన్, డి.ప్రకాశ్ పాల్గొన్నారు.