టీడీపీ జోష్
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:09 AM
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో జిల్లాలో విజయవంతమైంది.
ఇంటింటికీ ప్రచారంతో కేడర్ ఉత్సాహం
ప్రజల్లో సానుకూలత ఉందని సంతృప్తి
స్థానిక ఎన్నికల్లో గెలుపుపై ధీమా
లక్ష్యాన్ని పూర్తి చేయడంలో కష్టపడ్డ నాయకత్వం
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో జిల్లాలో విజయవంతమైంది. జిల్లా పరిధిలోని ఏడు నియోకజవర్గాల్లో నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు కష్టపడ్డారు. ఇంటింటా టీడీపీ కార్యక్రమంలో దాదాపు ప్రతి గ్రామానికి వెళ్లారు. మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలు, పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం లక్ష్యాన్ని తణుకు, పాలకొల్లు నియోకవర్గాల్లో నూరు శాతం పూర్తి చేశారు. ఉండి నియోజకవర్గంలో కూడా దాదాపు అన్ని ఇళ్లకు పార్టీ శ్రేణులు వెళ్లాయి. ఆచంట, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో లక్ష్యం చేరకున్నా ఆశించిన దానికంటే అధికం గా ఇంటింటికి వెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామంటూ భరోసా ఇచ్చారు. కొత్తగా పింఛన్లు ఇప్పించాలని పలువురు కోరడంతో త్వరలో మంజూర వుతాయని టీడీపీ నేతలు హామీ ఇచ్చి ముందుకు సాగారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధిష్ఠానం నియోజకవర్గ బాధ్యులకు, ముఖ్యనాయకులకు దిశానిర్దేశం చేసింది. పంచాయతీలు, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే నాయకులు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. నియోజకవర్గాల్లో ఎన్ని ఇళ్లు తిరిగారో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ వచ్చారు. అధిష్ఠానం నిత్యం దీనిపై అప్రమత్తం చేస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సైతం జూమ్ కాల్స్ ద్వారా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కష్టపడే వారికి పదవులు వస్తాయంటూ స్పష్టం చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ప్రజా నాడి కూడా బోధ పడింది. కూటమి ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నట్టు సంబరపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పాలకొల్లు ముందంజ
పాలకొల్లు నియోకవర్గంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమా న్ని వందశాతం పూర్తి చేశారు. గత ఏడాది కూడా అత్యధిక ఇళ్లకు వెళ్లిన జాబితాలో పాలకొల్లు టాప్‌లోనే ఉంది. ఈ సారి లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయగలిగారు. ఇతర జిల్లాలో బిజీగా ఉన్నా సరే అవకాశం ఉన్నప్పుడల్లా మంత్రి నిమ్మల రామానాయుడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాతి స్థానంలో తణుకు నియోజకవర్గం ఉంది. ఇక్కడ 99శాతం లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కేడర్‌ను వెంటబెట్టుకుని గ్రామాలు, వార్డుల్లో తిరిగారు. ఉండి నియోజకవర్గంలో కూడా పార్టీ కేడర్ మంచి జోష్ కనబరించింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించి కేడర్‌ను ఉత్సాహపరిచారు. ఆచంటలో ఈసారి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రతి గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా రు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిలు తోట సీతారామలక్ష్మి, వలవల బాబ్జి, పొత్తూరి రామరాజు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందున్నారు. పార్టీ నాయకులను కలుపుకొంటూ ప్రజల వద్దకు వెళ్లారు. జిల్లావ్యాప్తంగా 4,82,195 ఇళ్లున్నాయి. ఇప్పటిదాకా 3,85,574 ఇళ్లకు పార్టీ శ్రేణులు వెళ్లాయి. దాదాపు 79 శాతం ఇళ్లకు వెళ్లి జనంతో మమేకమయ్యారు.