Share News

లెక్క కుదిరింది !

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:17 AM

స్థానిక సంస్థల్లో కూటమి పార్టీల మధ్య సర్దుబాటు లెక్కలు కుదిరాయి. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల విషయంలో కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. నామినేటెడ్‌ పదవుల తరహా లోనే స్థానిక సంస్థల అభ్యర్థుల విషయంలోనూ కూటమి అధిష్ఠానం తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య మార్గదర్శ కాలను సూచించింది. ఆ..మేరకే స్థానిక నేతలు చర్యలు తీసుకుంటున్నారు.

లెక్క కుదిరింది !

ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలపై కుదిరిన పొత్తు

తెలుగుదేశం నియోజకవర్గాల్లో

ఒక ఎంపీపీ, జడ్పీటీసీ జనసేనకు

జనసేన నియోజకవర్గాల్లో చెరి సగం

భీమవరం నియోజకవర్గంలోమీకొకటి.. మాకొకటి

నేతల మధ్య కుదిరిన సయోధ్య

తాడేపల్లిగూడెంలో పట్టు విడుపులు

తణుకులో వ్యూహాత్మకంగా పావులు

ఉండిలో ఒక మండలం జనసేనకు

ఆచంటలోనూ స్పష్టత

పాలకొల్లులో మంత్రి కసరత్తు

నర్సాపురంలో చెరిసగమే

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల్లో కూటమి పార్టీల మధ్య సర్దుబాటు లెక్కలు కుదిరాయి. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల విషయంలో కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. నామినేటెడ్‌ పదవుల తరహా లోనే స్థానిక సంస్థల అభ్యర్థుల విషయంలోనూ కూటమి అధిష్ఠానం తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య మార్గదర్శ కాలను సూచించింది. ఆ..మేరకే స్థానిక నేతలు చర్యలు తీసుకుంటున్నారు.

భీమవరంలో కుదిరిన సయోధ్య

భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం ఎంపీపీ పదవి జనసేనకు, జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. భీమవరం రూరల్‌ మండలంలో ఎంపీపీ తెలుగుదేశం పార్టీకి, జడ్పీటీసీ జనసేనకు వెళ్లింది. నేతల మధ్య ఆ మేరకు సయోధ్య కుదిరింది. భీమవరం మున్సిపల్‌ ఎన్నికలు ప్రస్తుతం లేకపోవడంతో కూటమి నేతలు ఎంపీపీ, జడ్పీటీసీ, పంచా యతీల ఎన్నికలపై దృష్టి సారించారు. ఎటువంటి అపోహలకు తావులేకుండా కూటమి శ్రేణులను సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకున్నారు.

తాడేపల్లిగూడెంలో పట్టు విడుపులు

తాడేపల్లిగూడెంలోనూ చెరి రెండు పదవులు ఒక్కో పార్టీకి వరించనున్నాయి. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో ఎంపీపీ పదవి జనరల్‌కు, జడ్పీటీసీ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. పెంటపాడు మండలంలో ఎంపీపీ , జడ్పీటీసీలు రెండు జనరల్‌ మహిళకు కేటాయించారు. ఇక్కడ తెలుగు దేశం, జనసేన మధ్య పంపకాలు జరగాల్సి ఉంది. అయితే చెరో పార్టీకి ఒక ఎంపీపీ, జడ్పీటీసీ ఇవ్వాలన్న లెక్క తేలింది. కానీ ఎవరికి అన్నది ఇంకా తేలాల్సి ఉంది. పెంటపాడు మండలంలో రెండు పదవులు జనసేన ఉంచుకునేలా తొలుత ప్రతిపాదన వచ్చింది. దానికి తెలుగుదేశం సమ్మతించలేదు. రెండు మండలాల్లోనూ ఒక పార్టీకి ఒక పదవి ఉండేలా ప్రతిపాదన చేస్తున్నారు. ఒక పార్టీకి ఒక మండలం పూర్తిగా విడచిపెట్టడం కుదరదంటూ ఇక్కడ తెలుగుదేశం పట్టుబ ట్టింది. దీనివల్ల ఓట్లు పార్టీ అభ్యర్థులకే పడతాయంటూ కూటమి శ్రేణుల్లో ఉంది. ఆ దిశగానే అంతిమ నిర్ణయం ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సర్దుబాటు కుదిరిన తర్వాత ఎవరి పార్టీ అభ్యర్థులను వారి నాయకత్వమే నిర్ణయించనుంది. పార్టీ మెండేట్‌లు ఇవ్వనుంది.కానీ అందుకు భిన్నంగా నియోజ కవర్గంలో అపోహలు ముందుగా ప్రచారం జరుగు తోంది. దీనిపైనా వైసీపీ కూడా ఒక కన్నేసి ఉంచింది.

త ణుకులో ఒక ఎంపీపీ, జడ్పీటీసీ జనసేనకు

తణుకు నియోజకవర్గ పరిధిలో మూడు మండలా లున్నాయి. అందులో ఒక ఎంపీపీ, జడ్పీటీసీ జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. జడ్పీటీసీ విషయంలో అత్తిలి లేదా తణుకు రూరల్‌కు కేటాయించాలని యోచిస్తున్నారు. అక్కడ సామాజిక సమీకరణలను అంచనా వేసుకుని ఇరగవరం జడ్పీటీసీకి తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. ఎంపీపీల విషయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎంపీటీసీలు గెలిచిన తర్వాత ఎంపీపీ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంపైన తెలుగుదేశం, జనసేనకు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలపై లెక్కలు తేలిపోయాయి.

ఉండిలోనూ అదే పంథా

ఉండి నియోజకవర్గ పరిధిలో ఏకంగా నాలుగు మండలాలు ఉన్నాయి. నాలుగు ఎంపీపీ, నాలుగు జడ్పీటీసీ పదవులకు అక్కడ పోటీ ఉంది. ఆశావహులు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఆకివీడు నగర పంచాయతీపై కూటమి నాయకత్వం దృష్టి పెట్టింది. నామినేషన్‌లు పర్వం ముగిశాక గ్రామ సానిక సంస్థలపై అక్కడ దృష్టి సారించనున్నారు. నాలుగు మండలాల్లోనూ ఒక ఎంపీపీ, జడ్పీటీసీ జనసేనకు ఇచ్చి మిగిలిన మూడు ఎంపీపీలు, జడ్పీటీసీలు తెలుగుదేశం ఉంచుకోనుంది. ఇలా ఉండి నియోజకవర్గంలోనూ ఒక స్పష్టత వచ్చేసింది.

ఆచంటలోనూ స్పష్టత

ఆచంట నియోజకవర్గ పరిధిలో పెనుమంట్ర, ఆచంట, పెనుగొండ, పోడూరులోని కొన్ని గ్రామాలున్నాయి. అక్కడ కూడా ఒక ఎంపీపీ, జడ్పీటీసీ జనసేనకు కేటాయిస్తున్నారు. ఇంకా ఎక్కడ ఇవ్వాలనే విషయంపైనే తర్జన భర్జన పడుతున్నారు. ఆచంటపైనే తెలుగుదేశం, జనసేనలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి.పోడూరు మాత్రం తెలుగు దేశం పార్టీకి ఉండే అవకాశం ఉంది. అక్కడ గ్రామాలు కొన్ని ఆచంట నియోకజవర్గం, ఇంకొన్ని పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకోసం రెండు నియోజకవర్గాల పరిధిలోని గ్రామ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తెలుగుదేశం తరపున ఎంపీపీ, జడ్పీటీసీ పదవులకు రెండేసి పేర్లు ఎంపిక చేసుకున్నారు. అందులో ఆచంట నియోజకవర్గ పరిధిలో ఉండే గ్రామాలకు ఒక పదవి, పాలకొల్లు పరిధిలో ఉన్న గ్రామాలకు మరో పదవి వరించనుంది.

మంత్రి ఇలాకాలో

పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో రెండు మండలా లున్నాయి. అక్కడ కూడా ఒక ఎంపీపీ లేదా జడ్పీటీసీ జనసేనకు ఇవ్వాలని యోచిస్తున్నారు. పోడూరు మండలంలో వచ్చే పదవిని బట్టి పాలకొల్లు నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు మండల స్థాయి పదవులు జనసేనకు వరించనున్నాయి. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల్లో జనరల్‌కు ఒక్క స్థానం కూడా లేదు. అభ్యర్థుల ఎంపిక పై మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తున్నారు.

నర్సాపురంలో చెరిసగమే

నర్సాపురం నియోజకవర్గంలోనూ మొగల్తూరు, నర్సాపురం రూరల్‌ మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను చెరో పార్టీకి కేటాయించనున్నారు. కూటమి నాయకులు ఆ దిశగా అక్కడ కుస్తీ పడుతున్నారు. ఇప్పటిదాకా మున్సిపాలిటీపైనే మల్లగుల్లాలు పడ్డారు. ఇకపై ఎంపీటీసీ, జడ్పీటీసీపై దృష్టి పెట్టనున్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:17 AM