వెలుగు నీడలు
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:32 AM
డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువు తీరి నేటికి రెండేళ్లు. సీఎం చంద్రబాబు పాలనలో జిల్లా పలు అంశాల్లో ప్రగతి బాటలో పయనించింది. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ప్రజా ప్రతినిధు లు, అధికారుల భాగస్వామ్యం పెంచింది.
కూటమి పాలనకు నేటితో రెండేళ్లు
సంక్షేమం, అభివృద్ధితో ఏలూరు హోరు
పోలవరం, చింతలపూడికి మోక్షం కల్పించే దిశగా అడుగులు
కొల్లేరు కాంటూరు కుదింపుతో 20వేల ఎకరాలకు మోక్షం
పారదర్శక పాలన దిశగా మార్పులు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువు తీరి నేటికి రెండేళ్లు. సీఎం చంద్రబాబు పాలనలో జిల్లా పలు అంశాల్లో ప్రగతి బాటలో పయనించింది. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ప్రజా ప్రతినిధు లు, అధికారుల భాగస్వామ్యం పెంచింది. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన లు చేపట్టి ప్రజలకు సంతృప్తికరమైన సేవలను అందించే దిశగా కొద్ది నెలలుగా ప్రభుత్వం ప్రణా ళికాబద్ధంగా సాగుతోంది. మొదటి ఏడాది ఒడిదుడుకులను అధిగమించి ప్రభుత్వ పథకాల్లో సాంకేతికతకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో పథ కాలు పరుగులందుకున్నాయి. పోలవరం ప్రాజెక్టు వేగం పుంజు కోగా, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి తాజాగా ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టుకుని ముందుకు సాగుతోంది.
పోలవరం పరుగు.. రూ.2,250 కోట్లు జమ
పోలవరం ప్రాజెక్టును మరింత పరుగులు పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించిన కూటమి సర్కారు ఒక పక్క భూసేకరణ చేస్తూనే, మరోవైపు నష్టపోయిన రైతులకు పరిహారాల చెల్లింపులకు పెద్దపీట వేసింది.గత రెండేళ్ల కాలంలో నిర్వాసితులు 28,673 మందికి 2,250 కోట్ల 12 లక్షల మొత్తాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. బుట్టాయగూడెం, కుక్కునూరు, జీలుగుమిల్లిలో భూమికి పట్టాల కింద 192 మందికి 520.02 ఎకరాలు సిద్ధం చేసిం ది. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని వేగంగా అడుగులు వేస్తోంది.
ఆక్వాకూ భారీగా చేయూత
కూటమి ప్రభుత్వం వ చ్చిన రెండేళ్ల కాలంలో మత్య్సకారులకు, ఆక్వాకు పెద్దపీట వేసింది. ప్రస్తుతం యూనిట్ విద్యుత్‌కు రూ.1.50 ధర అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. అప్సడా అనుమతుల ద్వారా చేపలు, రొయ్యలు సాగుచేసే రైతులకు ఆక్వా జోన్ కింద రాయితీలను ప్రభుత్వం కల్పించింది. రాబోయే రోజు ల్లో ఏరియేటర్లు, ఇతర పరికరాలు, బోట్లకు రాయితీలు కల్పించనున్నారు. దాదాపుగా జిల్లాలో ఆక్వాను నమ్ముకుని మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. కైకలూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధం గా రూ.100 కోట్ల పైబడి రోడ్లు అభివృద్ధి చేశారు. మేజర్ డ్రెయిన్లలో పూడికతీతలకు రూ.ఐదు కోట్ల పనులు చేశారు. జల్‌జీవన్ నిధుల కింద రూ.36 కోట్ల పైబడి నిధులు కైకలూరుకు వచ్చాయి.
జోరందుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు
అన్నదాత సుఖీభవ కింద రెండు విడతలు 20 వేలు చొప్పున పంపిణీని పూర్తి చేశారు. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.5.17 కోట్లు విలువైన 1,441 యూనిట్లు మంజూరు చేశారు. కొద్దిరోజుల కిందట కోకో కాంక్లైవ్ జరగడం ద్వారా ఏలూరు కోకోసిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. జిల్లాలో కోకో హబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 500 ఎకరాలు కోకో సిటీ ఏర్పాటు చేయాలని స్థల సేకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ కింద 1.60,968 మందికి మూడు విడతలుగా కలుపుకుని రూ.270 కోట్లు జమ చేశారు. జిల్లాలో ప్రతినెల సుమారు 2.56,340 మంది పింఛన్‌దారులకు రూ.112.82 కోట్లు పంపిణీ చేస్తున్నారు. 26 రకాల పింఛన్లు అందజేస్తున్నారు. విద్యుత్‌శాఖ పరంగా కేంద్రం సూర్యఘర్ పథకాన్ని విస్తృత పరిచారు. మూడు కిలో వాట్లకు 78 వేలు సబ్సిడీ కింద ఇస్తున్నారు. రోడ్ల కింద ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా గతేడాది రూ.200 కోట్ల పైబడి ఖర్చు చేయగా, ఈ ఏడాది రూ.120 కోట్ల వ్యయంతో పనులు చేపట్టగా రూ.70 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి.
చింతలపూడి చింత తీర్చేలా..
రూ.4,900 కోట్ల వ్యయంతో చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం అడ్డంగులను అధిగమించే దిశగా గ్రీన్‌ట్రిబ్యునల్ ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా పర్యావరణ, తదితర అనుమతులు తీసుకునే దిశగా ప్రభుత్వం వేగం గా అడుగులు వేస్తోంది. 2027 జూన్ నెలాఖరు నాటికి ఫేజ్–1 కింద పూర్తి చేయడానికి ఇరిగేషన్ క్యాలెండర్ నిర్ణయం తీసుకున్నారు. చింతలపూడి పరిధిలోకి రాని ఏరియాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు 2014లో టీడీ పీ హయాంలో రూపొందించిన పిట్టలవారి గూడెం ఎత్తిపోతల పథకాన్ని కూటమి సర్కార్ పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతోంది. మరోవైపు తమ్మిలేరు జలాశయం ఆధునికీకరణకు జైకా నిధులు రూ.16 కోట్లకు ప్రభుత్వం అనుమతిని తెచ్చుకొంది.
మహిళల సంక్షేమంలో గీటురాయి
మహిళలకు సంక్షేమ పథకాల అమలులో గీటురాయనే చెప్పాలి. గతేడాది ఆగస్టు 15న స్ర్తీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ ం ప్రారంభం కావడం, మరోవైపు స్ర్తీ నిధి పథకం ద్వారా 30,885 మందికి స్వయం సహాయక సంఘా లకు రూ.256.06 కోట్లు రుణాలు, ఉన్నతి పథకం ద్వారా 1,568 మంది సభ్యులకు రూ.9.86 కోట్లు రుణాలను అందిం చారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గతేడాది మహిళలకు వ్యా ధుల నివారణకు ప్రత్యేకంగా క్యాన్సర్‌కు స్ర్కీనింగ్, చికిత్స శిబిరాలను పెద్ద ఎత్తున చేపట్టారు. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా హాస్టల్స్‌లో రూ.5.72 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేయగా, బీసీ హాస్టళ్లలోను రూ.1.50 కోట్ల వ్యయంతో 32 హాస్టళ్ల మరమ్మతులు పూర్తి చేశారు. ఈ ఏడాది టాయిలె ట్లు, తాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రత్యేకంగా కూలర్లు, మంచినీటి నాణ్యత తెలిపే టెస్టింగ్ కిట్లను సరఫరా చేశారు.
కొల్లేరుకు మోక్షం
జిల్లాలో దశాబ్దాల క్రితం నుంచి నలుగుతున్న కొల్లేరు కాంటూరు కుదింపునకు కూటమి సర్కారు పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర సీఈసీ కమిటీకి జిరాయితీ, సొసైటీ భూములకు 20 వేల వరకు మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. కొద్దినెలల్లో సీఈసీ కమిటీ దీనిపై మరోసారి పర్యటించి, తుది నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించనుంది. దీంతో కొల్లేరు భూము ల సమస్యకు పరిష్కారం దొరకనుంది. కొల్లేరు ముంపు నివారణకు ఉప్పుటేరు వద్ద చెత్త, తూడు తొలగింపు చేపట్టారు. కొల్లేరు నుంచి ప్రయాణించే 36 మేజర్, మైనర్ డ్రెయిన్ల ప్రక్షాళనకు అడుగులు వేసింది.
రెవెన్యూలో భారీగా సంస్కరణలు
జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సంస్కరణలతో సకాలంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలు పంపిణీని ప్రతినెలా రెండో తేదీ నుంచి నుంచి తొమ్మిదో తేదీ వరకు పంపిణీ చేస్తున్నారు. రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అర్జీల స్వీకరణ, 22ఏ నిషేధిత జాబితా నుంచి గ్రామ కంఠం, అసైన్డ్‌భూములు, ఇనామ్ భూముల మినహా యింపులకు సంస్కరణలను చేపట్టింది. దశాబ్దాలుగా సమస్యలతో సతమతం అవుతున్న రైతులు, ప్రైవేట్ వ్యక్తులు ఇప్పటి వరకు 1500 ఎకరాల వరకు నిషేధిత జాబితాల నుంచి మినహాయింపులను పొందారు.
జల్‌జీవన్ మిషన్.. మంచినీటి పథకాల విస్తరణ
జిల్లాలో జల్‌జీవన్ మిషన్ కింద రూ.265 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగునీటి కుళాయిల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. హౌసింగ్ కాలనీల్లో అన్ని ఇళ్లకు రూ.58 కోట్లతో తాగునీటి వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.
అధికారులు ఉరుకులు.. పరుగులు
జిల్లా పాలనలో పలు పెనుమార్పులకు కూటమి సర్కార్ వేగంగా అడుగుల వేస్తోంది. ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై విన తులు స్వీకరించి.. వాటిని పరిష్కరించాల్సి ఉంది. ఇదే సంద ర్భంలో ప్రతి రెండు నెలలకు ఒకమారు డీఆర్సీ సమా వేశంలో కీలకాంశాలపై చర్చించి.. అందుకు పరిష్కార మార్గాలను అన్వేషించేలా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒక నియోజకవర్గం.. నాలుగు పర్యటనలు కింద కలెక్టర్, ఎమ్మెల్యే ఇతర అధికారులు ప్రతి శుక్రవారం ఆ నియో జకర్గంలో పర్యటించి ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరిం చి.. వాటిని పరిష్కరించాల్సి ఉంది. ఇటీవలే నిడమర్రు మండలంలో ఈ రకమైన పర్యటనలు పూర్తయ్యాయి. పోలీసులు కూడా ఒక గ్రామంలో పల్లె నిద్ర చేసి ప్రజలతో మమేకం కావాలి. ఆయా గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యల పరిష్కారానికి సామరస్యంగా వారితో మాట్లాడి పరిష్కరించే దిశగా మార్పులు తేవాలి. జిల్లాలో ఎస్పీ కిశోర్, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పల్లె నిద్రలో పాల్గొని చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని తెలుసుకోవడానికి ఐవీఆర్‌ఎస్ సర్వేలు ద్వారా తెలుసుకుని, వారిలో సంతృప్తిస్థాయి పెంచడానికి సౌకర్యాలను అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేపడుతున్నారు.
సామాజిక సేవ కింద పీ–4
పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐల ద్వారా పేదలకు ఉపాధి, శిక్షణ, గూడు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం పీ–4కు శ్రీకారం చుట్టింది. ఇందులో 76వేల కుటుంబాలను దత్తత ఇచ్చారు. రాబోయే కాలంలో వేలాది మంది ఎన్‌ఆర్‌ఐ, పారిశ్రామికవేత్తల ద్వారా కాలనీల్లో సౌకర్యాలు పెరగనున్నాయి.
భరోసా ఇస్తోన్న సీఎం రిలీఫ్‌ఫండ్
జిల్లాలో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యసేవలకు వర్తించిన వివిధ రోగాలతో బాధపడుతున్న రోగులకు సత్వరం వైద్యం అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందరో పేదల ప్రాణాలను నిలుపుతోంది. ఎల్‌వోసీలు, సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలకు ప్రభుత్వం మంజూరుకు చెక్‌లు స్థానిక ఎమ్మెల్యే ద్వారా బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లతో రైతుల్లో హర్షం
వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు అష్టకష్టాలు పడేవారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 48 గంటల్లోనే ధాన్యం సొమ్మును రైతు ఖాతాలకు జమ అయ్యేది. ఈ ఏడాది 24 గంటల్లోనే రికార్డు స్థాయిలోనే రైతు ఖాతాలు ధాన్యం కొనుగోళ్లు తాలూకా మొత్తాలు జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంతో దళారుల బెడద 90 శాతంకు పైగా తగ్గిపోయింది.
పరిశ్రమలకు స్వర్గధామం
ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 47 ఎకరాల్లో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు మార్గం సుగమం అయ్యింది. త్వరలో శంకుస్థాపన జరగనుంది, నూజివీడు మర్సగూడెంలో ప్రైవేట్ వ్యక్తుల భూముల్లో మ్యాంగో పల్ఫ్ యూనిట్‌కు శంకుస్థాపన జరిగింది. తాజాగా మట్టి తవ్వి చదును చేస్తున్నారు. ద్వారకాతిరుమలలో సీహెచ్‌పోతేపల్లి గోద్రెజ్ ఆగ్రోవెట్ ప్రాసెసింగ్ యూనిట్ విస్తరణకు మంత్రి నాదెండ్ల మనోహర్ కొద్ది నెలల క్రితం శంకుస్థాపన చేశారు. స్ధానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఈ పార్కుల ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చింతలపూడి, ఏలూరులో పనులకు శంకుస్థాపనలు జరిగాయి. మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నారు.
ద్వారకాతిరుమలకు ఆధునిక సౌకర్యాలు
చినవెంకన్న ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ నియంత్రణకు అత్యాధునిక వసతులతో క్యూ లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రూ.12 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు.
16న రె ండేళ్ల పాలనపై సదస్సు
కూటమి సర్కార్ పాలన రెండేళ్లు పూర్తయిన నేపథ్యం లో జిల్లా స్థాయిలో విజయోత్సవ సభను ఈనెల 16న నిర్వహించనున్నారు. ఈ మేరకు తేదీ ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో వేదికను కలెక్టర్ వెట్రిసెల్వి నిర్ణయించనున్నారు. శాఖల వారీగా సాధించిన ప్రగతిపై నివేదికలతో రావాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
మట్టి, ఇసుక మాఫియా జోరు
జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో దారులు తెరుచుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మద్యం బెల్టుషాపులు ప్రజాప్రతినిధులు అనుచరులే నడుపుతు న్నారు. రేషన్ మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు. రేషన్ బియ్యంను రీ సైక్లింగ్ చేసే రైస్‌మిల్లులు కూడా ప్రజా ప్రతినిధుల అనుచరులే నడుపుతున్నారన్న విమర్శలున్నా యి. చికెన్ వ్యర్థాలు ఏలూరు జిల్లాలోని దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని చేపల చెరువులకు సర ఫరా యథేచ్ఛగా సాగుతోంది. దీనిలో వాటాలను అటు అధికారులు.. ఇటు ప్రజాప్రతినిధులు కలిసి పంచుకుంటు న్నారనే ఆరోపలున్నాయి. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సెటిల్‌మెంట్లకు కూటమి నాయకులే తెర తీస్తున్నారు. పేకాట, కోడి పందేలను కొన్ని నియోజకవర్గాల్లో రహ స్యంగా నిర్వహిస్తున్నారు. ఇటువైపుగా పోలీస్‌శాఖ దాడులు చేయకుండా ప్రజాప్రతినిధులే అడ్డుకుంటున్నారనే విమర్శ లున్నాయి. రోడ్లు, ఇతర పనుల చేయించడానికి పర్సం టేజీలు ఇస్తే గానీ పనులు ముందుకు సాగనివ్వడం లేదు. ఆఖరికి రేషన్ డిపో మంజూరు చేయాలన్న, ఆవుట్ సోర్సిం గ్ ఉద్యోగం అయినా ఎమ్మెల్యే ముద్ర పడందే మంజూరు చేయడానికి వీల్లేకుండా ఉంది. ఇటీవల ఒక ఎమ్మెల్యేను సైతం పవన్ కల్యాణ్ ‘తన వద్దకు పిలుపించుకుని మీలో మార్పు కోరుకుంటున్నాం.. అందరిని కలుపుకుని వెళ్లకపోతే కష్టం’ అని తేల్చేశారు. నెల రోజుల్లో పద్ధతి మార్చుకుంటానని సదరు ఎమ్మెల్యే చెప్పి బయట పడ్డారు.
అందుబాటులో అధికారులు అంతంతే..
జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలోనే అధికారులు సమ స్యల పరిష్కారంలో చెప్పే సాకులు చూస్తే ప్రజాప్రతినిధు లు షాక్ అయ్యేలా ఉంటున్నాయి. ప్రజాప్రతినిధులే విసు గెత్తేలా సమాధానాలుంటున్నాయి. ఇక మండల స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండేది తక్కువే..షటిల్ సర్వీస్ ద్వారా కొలువుల్లోకి వెళ్లడంతో అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలకు చుక్కలు కనపడుతున్నాయి.
అన్నీ పెండింగ్..
కోనసీమకు వెళ్లే వశిష్ట వారధికి రెండేళ్లు గడుస్తున్నాసరే మోక్షం లభించలేదు ఇంకా ప్రాజెక్ట్ పెండింగ్‌లోనే ఉంది. లోసరి నుంచి భీమవరం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే రహదారి అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిప్పటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీచేయలేదు. దాంతో రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం ఏర్పడినప్పటికి ఏళ్లు గడుస్తున్నాసరే కలెక్టరేట్‌కు సొంత కార్యాలయం లేదు. ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. బియ్యపుతిప్ప వద్ద హార్బర్ నిర్మిస్తే మత్స్యకారులతోపాటు, జిల్లా ప్రగతికి అవ కాశం ఉంటుంది. కాని కార్యరూపం దాల్చలేదు. జాతీయ విద్యా సంస్థ ఏపీ నిట్‌కు డైరెక్టర్ లేరు. నిధులు రావడం లేదు. మంజూరైన పోస్టులు భర్తీ చేయలేకపోతున్నారు. వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్‌ఆర్ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం జీత భత్యాలకే నిధులు కేటాయి స్తోంది. అంతకు మించి గడచిన రెండేళ్లలో పురోగతి లేదు. నర్సాపురం ఆక్వా విశ్వ విద్యాలయానికి ఈ ఏడాది కేవలం రూ. 30 కోట్లు మాత్రమే కేటాయించారు.దీనివల్ల కొద్ది పాటి ప్రయోజనం మాత్రమే ఉంటుంది.