సంక్షేమం..అభివృద్ధే కూటమి లక్ష్యం
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:30 AM
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యమని కూటమి నేతలు పునరుద్ఘాటించారు. రాజకీయ కక్షలు, కుట్రలకు తావులేని స్వఛ్చమైన, స్వేచ్ఛాయుత పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. భీమవరం సమీపంలోని రాధా కన్వెన్షన్ హాలులో శుక్రవారం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సదస్సు నిర్వహించారు.
కుట్రలు, కుతంత్రాలు, వేధింపులు లేవు
అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి
కూటమి రెండేళ్ల పాలనపై
భీమవరంలో విజయోత్సవ సదస్సు
భీమవరం/ కాళ్ల (ఆంధ్రజ్యోతి) : అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యమని కూటమి నేతలు పునరుద్ఘాటించారు. రాజకీయ కక్షలు, కుట్రలకు తావులేని స్వఛ్చమైన, స్వేచ్ఛాయుత పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. భీమవరం సమీపంలోని రాధా కన్వెన్షన్ హాలులో శుక్రవారం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సదస్సు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం నియోజవకర్గాల నుంచి అధిక సంఖ్యలో కేడర్ హాజరయ్యారు.కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్ట్‌లతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్, దివ్యాంగులకు పెన్షన్‌లు, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్, ఉద్యాన పంటలు, ఆక్వా ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. రెండేళ్లలో రాష్ట్రంతో పాటు, జిల్లా సాధించిన ప్రగతిని నేతలు వివరించారు, ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం, వేధింపులు, కుట్రలు, కుతంత్రాలను ఏకరువు పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని ప్రభుత్వం నెరవేరుస్తోందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ స్పష్టం చేశారు. రైతుల అభివృద్ధికి, ఆక్వా రంగం విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తున్నట్టు మంత్రి వివరించారు.
ముగ్గురి సహకారంతో అభివృద్ధి : మంత్రి గొట్టిపాటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది లబ్ధిదారులకు రూ.33 వేల కోట్ల వ్యయంతో పెన్షన్‌లు అంది స్తున్నామన్నారు. తల్లికి వందనంలో అందరి పిల్లలకు రూ.15 వేలు వంతున ఏడాదికి రూ. 10 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. వైసీపీ హయాంలో రహదారులపై పిడికె డు మట్టి వేయలేదు. ప్రాజెక్ట్‌లను చేపట్టలేదు. పవన్ కల్యాణ్ నాయకత్వంలో పల్లెల్లో మౌలిక వసతులు మెరుగవుతున్నాయన్నారు. లోఓల్టేజీ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఏడు వేల సబ్‌స్టేషన్‌లు అవసరం కానున్నాయి. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
గోదావరి డెల్టాలో 36 ప్రాజెక్ట్‌లు : మంత్రి నిమ్మల
ఉభయగోదావరి డెల్టా ప్రాంతంలో 36 ప్రధాన ప్రాజెక్ట్‌లను రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయ డానికి చర్యలు తీసుకు న్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు తెలిపారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను 2027నాటికి వినియోగంలోకి తీసుకువ స్తామ న్నారు. కుట్రలు, కుతంత్రాలు లేవు. అభివృద్ధి చేస్తున్నాం. గత ఐదేళ్లలో 11 పర్యాయాలు విద్యుత్ చార్జీలు పెంచారు. ఇప్పుడు చార్జీలు పెంపులేదు. అయినా వాళ్ల పత్రిక ద్వారా గొడ్డలి పార్టీ పచ్పి అబద్ధాలు చెపుతోందని మంత్రి తూర్పారబట్టారు.
ఎవరేమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి మించిన మంచి పాలన ఎవరూ చేయలేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజలే తెలుసుకోవాలన్నారు.
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత ఐదేళ్ళలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందన్నారు. వైసీపీ పాలించిన ఐదేళ్ళలో ఎప్పుడూ కనిపించని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్ళలో చేసి చూపించిందన్నారు.
నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జలజీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆ పథకాన్ని తిరిగి పునరుద్ధరించారని తెలిపారు. డీఎస్సీ ద్వారా సుమారు 16 వేల పైబడి ఉద్యోగాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని గొడ్డలి పార్టీ నేతలు సూపర్ సిక్స్ అమలు చేయలేకపోయామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామన్నారు. గడిచిన రెండేళ్లలో సుమారు 65 వేల కోట్లు పెన్షన్లు రూపంలో పంపిణీ చేశామన్నారు.
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి కులాలను దూరం చేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. తప్పు చేసినవారిని జైలులో పెట్టడం తప్పేం కాదన్నారు. అనవసర రాద్ధాంతాలు పట్టించుకోవద్దని, అభివృద్ధే ప్రధానంగా ఎమ్మెల్యేలు అంతా పనిచేస్తున్నారని తెలిపారు.
రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. గత ఐదేళ్ళలో ఎంతో అభివృద్ధికి సహకరించిన వైసీపీ తమ పార్టీని ద్రోహిగా చిత్రీకరించిందన్నారు.
సదస్సులో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ కనకరాజు సూరి, గ్రంథాలయాల ఛైర్మన్ జుత్తిగ నాగరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి, ఎండీ షరీఫ్, పొత్తూరి రామరాజు, పీతల సుజాత, అంగర రామ్మోహనరావు, జనసేన, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, అయినంపూడి శ్రీదేవి, జేసీ టి.రాహుల్ కుమార్‌రెడ్డి, పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.