రిజిస్ట్రేషన్ ఛార్జీల బకాయిలపై కదలిక
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:47 AM
స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ శాఖ చెల్లించా ల్సిన బదలాయింపు పన్ను (ట్రాన్స్‌ఫర్ డ్యూటీ– టీడీ) బకాయిల విడుదలలో ఎట్టకేలకు కదలిక వచ్చింది.
వీటి విడుదలపై ఆరా తీసిన ప్రభుత్వం.. వివరాలు సమర్పించిన అధికారులు
స్థానిక సంస్థలకు రావాల్సింది రూ.102.80 కోట్లు.. విడుదలైతే అభివృద్ధికి ఊతం
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ శాఖ చెల్లించా ల్సిన బదలాయింపు పన్ను (ట్రాన్స్‌ఫర్ డ్యూటీ– టీడీ) బకాయిల విడుదలలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నిధుల లేమితో మున్సిపాలిటీలు, పం చాయతీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరు ణంలో, ప్రభుత్వం ఈ బకాయిల వివరాలపై ఆరా తీసింది. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి స్థానిక సంస్థలకు జమ కావాల్సిన నిధు లు గత ప్రభుత్వ హయాం నుంచే భారీగా పేరు కుపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లుల ను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుండటంతో, టీడీ నిధులపైన ఆశలు చిగురించాయి. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక సంఘం, అమృత్, ఉపాధి హామీ నిధులతోనే స్థానిక సంస్థల్లో పనులు సాగుతు న్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు లభిస్తే బకాయిలు త్వరలోనే స్థాని క సంస్థల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది.
బదలాయింపు పన్ను లెక్కలిలా..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు జరిగిన ప్పుడు 7.5 శాతం స్టాంప్ డ్యూటీని వసూలు చేస్తారు. ఇందులో 1.5 శాతం సొమ్మును స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీలకు బదలాయింపు పన్నుగా జమ చేయాలి. స్థానిక సంస్థలకు ఇది ప్రధాన ఆదాయ వనరు. గ్రామాల్లో, పట్టణాల్లో అంతర్గత అభివృద్ధి పనులకు ఎంతగానో ఉప యోగపడుతుంది. గిఫ్ట్‌డీడ్, తనఖా, మ్యూటేషన్ రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ప్రధానంగా భూముల కొనుగోలు అమ్మకాల ద్వారానే ఈ ఆదాయం అధికంగా సమకూరుతుంది.
రూ.102.80 కోట్ల మేర నిధులు..
గతంలో ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు స్థానిక సంస్థలకు బదిలీ చేసేవారు. అయితే కొన్నేళ్లుగా ఈ నిధుల చెల్లింపులు నిలిచిపోవడంతో జిల్లావ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఏకంగా రూ.102.80 కోట్ల మేర బకాయిలు పేరుకు పోయినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా ప్రభుత్వం ఈ వివరాలను తెప్పించుకోవడంతో నిధులు విడుదలై ఆర్థిక ఊరట లభిస్తుందని స్థానిక సంస్థల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో టీడీ బకాయిలు
2023–24 రూ.3.38 కోట్లు
2024–25 రూ.42.89 కోట్లు
2025–26 రూ.58.25 కోట్లు
2026–27 రూ.18.28 కోట్లు