Share News

భీమవరం మున్సిపాలిటీకి ఊరట

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:28 AM

ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే భీమవరం మున్సిపాలిటీ మొదటి ఐదు ర్యాంకుల్లో ఉండేది.

భీమవరం మున్సిపాలిటీకి ఊరట

విలీన గ్రామాల పన్ను మినహాయింపు.. ప్రభుత్వం ఉత్తర్వుల జారీ

మున్సిపల్‌ రికార్డుల నుంచి

గ్రామాల అసెస్‌మెంట్‌ల తొలగింపు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే భీమవరం మున్సిపాలిటీ మొదటి ఐదు ర్యాంకుల్లో ఉండేది. ఏటా రూ.21 కోట్ల మేర పన్ను వసూలు చేస్తు న్నారు. వాస్తవానికి ఏడాదికి రూ.22 కోట్లు డిమాండ్‌ ఉంటుంది. ఇటీవల భీమవరం వెను కపడుతోంది. ర్యాంకుల్లో ఎక్కడికో పోయింది. గత ప్రభుత్వంలో భీమవరం చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేశారు. వాటి ఆస్తి పన్ను ను మున్సిపాలిటీ రికార్డుల్లో నమోదు చేశారు. అప్పటి నుంచే ఈ సమస్య ఏర్పడింది. భీమవ రంలో చినఅమిరం, రాలయం, తాడేరు, కొవ్వాడ అన్నవరం గ్రామాలను విలీనం చేశారు. ఆ గ్రామాల్లో ఏటా రూ.1.50 కోట్ల మేర పన్ను వసూలవుతోంది. విలీనమైన తర్వాత గ్రామాల్లో పంచాయతీలే పన్ను వసూలు చేస్తున్నాయి. కానీ మున్సిపాలిటీ రికార్డుల్లో పన్ను డిమాండ్‌ చేరింది. అప్పటి జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుని పంచాయతీల రికార్డులను మున్సిపాలిటీకి అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మున్సిపాలిటీల పరిధిలోని నాలుగు విలీన గ్రామాల అసెస్‌మెంట్‌ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. భీమవరం మున్సిపాలిటీలో పన్ను డిమాండ్‌ అధికమైంది. పన్ను వసూళ్ల ర్యాంకులో భీమవరం వెనుకబడి వుంది. ప్రభు త్వం దీని నుంచి ఉపశమనం కలిగించింది. విలీ న గ్రామాల పన్ను డిమాండ్‌ను మున్సిపాలిటీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

పంచాయతీలు వసూలు చేస్తున్న పన్ను

వాస్తవానికి పంచాయతీలే పన్ను వసూలు చేస్తున్నాయి. అయినా మున్సిపాలిటీలోనూ డిమాండ్‌ చూపిస్తోంది. పంచాయతీ పన్నుతో సహా మున్సిపాలిటీకి ఏరియర్స్‌తో కలిపి రూ.27.5 కోట్లు డిమాండ్‌ ఉన్నట్టు ఆన్‌లైన్‌లో ఉంది. వసూలయ్యేది మాత్రం రూ.22 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.5.5 కోట్లు వసూలు కానట్టు లెక్క. ఇది ఏటా పెరుగుతోంది. ప్రతీ ఏడాది భీమవరం మున్సి పాలిటీలో 80 శాతా నికి మించి పన్ను వసూళ్లు కావడం లేదంటూ ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తోంది. ఫలితంగా సమీక్షల్లో ఇదే అంశాన్ని ఉన్నతాధికారులు లేవనెత్తుతున్నారు. ఎందుకు వెనుకపడుతు న్నారంటూ నిలదీస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు వివరణ ఇస్తూనే ఉన్నారు.

వారు ముందే మేల్కొన్నారు

తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సి పాలిటీల్లో విలీన సమస్య ఉన్నప్పటికీ సదరు పట్టణాల్లో డిమాండ్‌ను తగ్గించుకున్నారు. పంచాయతీల పన్నును తమ పరిధిలో లేకుండా మినహాయించుకున్నారు. తాడేపల్లిగూడెంలో విలీన గ్రామాల పన్ను సమస్య లేనప్పటికీ ఇతర డిమాండ్‌ అధికంగా ఉండేది. ఆక్రమిత స్థలాల్లో నివాసాలకు పన్ను వసూలు చేసే వారు. కాలువ గట్లపై ఆక్రమణలు తొలగించినా పన్ను మాత్రం మున్సిపల్‌ రికార్డుల్లో ఉండి పోయింది. దీనిని తాడేపల్లిగూడెం మున్సిపల్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించి తొలగించుకున్నారు. దీంతో డిమాండ్‌ తగ్గింది. వాస్తవ డిమాండ్‌తో పన్ను వసూలు చేసుకుం టున్నారు. కేవలం భీమవరం మున్సిపాలిటీలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. విలీన గ్రామాల పన్ను మున్సిపల్‌ రికార్డుల్లోనూ వచ్చి చేరింది. ఇటీవల దీనిపై ప్రభుత్వానికి లేఖ రాశారు. చివరకు విలీన గ్రామాల పన్నును తొలగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది. భీమవరం మున్సిపాలిటీకీ ఉపశమనం లభించింది. ఈ ఏడాది నుంచి రూ.22 కోట్లు మాత్రమే డిమాండ్‌ ఉండనుంది.

అసెస్‌మెంట్‌లు తొలగింపు

భీమవరం మున్సిపాలిటీలో 36 వేల అసెస్‌మెంట్‌లు వున్నాయి. విలీన గ్రామాలకు సంబంధించి మరో 4600 అసెస్‌మెంట్‌లు వచ్చిచేరాయి. మొత్తంగా 40,600 అసెస్‌మెంట్‌లు అయ్యాయి. ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో అసెస్‌మెంట్‌లను తొలగించనున్నారు. విలీన గ్రామాలకు చెందిన 4,600 అసెస్‌మెంట్‌లు తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

విలీన గ్రామాలను మినహాయించి..

ఎన్నికల సంఘం మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆదేశాలు జారీచేసింది. విలీన గ్రామాలను వదులుకొని పాత వార్డుల ఆధారంగానే మున్సిపాలిటీలు ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల సంఘానికి పాత వార్డుల ప్రకారం ఓటర్ల జాబితాను, వార్డుల హద్దులతో నివేదిక సమర్పించాయి. మార్చిలో ప్రకటించే ఓటర్ల జాబితా పాత వార్డుల ఆధారంగానే ప్రచురించనున్నారు. విలీన గ్రామాలను మినహాయించి మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

Updated Date - Feb 20 , 2026 | 12:28 AM