ఇలాగైతే ఎలా ?
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:17 AM
గ్రామాల్లో పన్నులు వసూళ్ల వేగం నత్తనడకన సాగుతోంది.
నత్తనడకన పన్ను వసూళ్లు
గ్రామాల్లో చెల్లించాల్సింది రూ.63.16 కోట్లు
వసూలైంది రూ.25.88 కోట్లు.. పెండింగ్ రూ.37.34 కోట్లు
మరో వారంలో నూరు శాతం వసూలు కావాలి
అధికారుల టార్గెట్లు..
ఇళ్ల బాట పట్టిన సిబ్బంది
భీమవరం రూరల్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి) గ్రామాల్లో పన్నులు వసూళ్ల వేగం నత్తనడకన సాగుతోంది. అధికారులు నెల రోజులుగా దీనిపై దృష్టి సారించినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో పన్నుల వసూళ్ల లక్ష్యసాధనలో వెనుకబడ్డారు. ఈ ఏడాది ఇంటి, నీటి, ఇతరపన్నుల చెల్లింపులు వచ్చే నెల వరకు గడువు ఉంది. అయితే ఈ నెల 15వతేదీలోగా నూరు శాతం పన్నులు కట్టించుకోవాల్సిందేనని అధికా రులు టార్గెట్‌లు ఇచ్చారు. ఇప్పటి వరకు పన్నుల వసూళ్లు 41 శాతమే జరిగింది. జిల్లాలో మూడు లక్షల 24 వేల 316 అసెస్‌మెంట్స్ ఉన్నాయి. వాటికి రూ.63 కోట్ల 16 లక్షల పన్నుల బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.25 కోట్ల 88 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు. ఇంకా రూ.37 కోట్ల 34 లక్షలు బకాయిలు ఉన్నా యి. వీటిని ఈ వారం రోజుల్లో కట్టించుకోవడం సాధ్యపడదు. కాబట్టి మార్చి నెలాఖరుకల్లా లక్ష్యాన్ని అధికారులు చేయాల్సి ఉంది.
విధుల నిర్వహణకు పన్నులే ఆసరా
గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు పన్నుల సొమ్ములు జత అయితే గ్రామా ల్లో చేయవలసిన పారిశుధ్యం, తాగునీరు అందించడం, సిబ్బంది జీతాలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధు లు జిల్లాలోని 393 గ్రామాలకు రూ.21 కోట్ల వరకు వచ్చాయి. వాటిని అవసరం మేరకు ఉపయోగించాలని ప్రభుత్వం ఈ మధ్యలో గ్రామాధికారులకు సూచించింది. ఇప్పుడు పన్నుల వసూళ్లు వంద శాతం చేసి వాటిని గ్రామాల్లో అవసరమైన పనులకు ఉపయోగించేలా ప్రభుత్వం ఆలోచనలో ఉంది.
పకడ్బందీగా పన్నుల వసూలు
గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు పన్నులు వచ్చే వాటి సంఖ్య పెరిగింది. గ్రామాల్లో ఉన్న ప్రతి దానిని గుర్తించి అన్నింటిని పన్నులు చెల్లించుకునే జాబితాలోకి తెచ్చారు. దీంతో గ్రామాల్లో పన్నుల ఆదాయం బాగుంది. గృహం, నీరు, కొబ్బరి చెట్లు, చెరువులు.. ఇలా పంచాయతీకి సంబంధించిన అన్నింటి పన్నులు వసూలవుతున్నాయి. గత ఏడాది పన్నుల వసూళ్లలో జిల్లాలో మంచి స్థానం నిలుపుకుంది.
పన్నులన్నీ ఆన్‌లైన్‌లోనే..
గ్రామాల్లో పన్నుల చెల్లింపుల్లో ఆన్‌లైన్ విధానం వచ్చాక ఎప్పటికప్పుడు వసూళ్ల రిపోర్టు తెలుస్తోంది. పన్ను చెల్లించిన లబ్ధిదారునికి సెల్‌ఫోన్ మెసేజ్ కింద సమాచారం వెళుతోంది. దీనివల్ల చెల్లింపులలో మోసం జరగకుండా ఉం టుంది. ఎంత బకాయి ఉన్నదీ ఆన్‌లైన్‌లో పొందుపరచి ఉంటుంది.