Share News

ఆ..బాండ్లకు ఓకే

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:29 AM

తణుకు టీడీఆర్‌ బాండ్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్లు కొనుగోలు చేసినవారు వినియోగించుకునేందుకు వీలుగా హైకోర్టు ఆదేశాలకనుగుణంగా మునిసిపల్‌ , పట్టణాభివృద్ధి శాఖ అనుమతి ఇచ్చింది.

ఆ..బాండ్లకు ఓకే

తణుకు టీడీఆర్‌ బాండ్‌లపై ప్రభుత్వ నిర్ణయం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తణుకు టీడీఆర్‌ బాండ్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్లు కొనుగోలు చేసినవారు వినియోగించుకునేందుకు వీలుగా హైకోర్టు ఆదేశాలకనుగుణంగా మునిసిపల్‌ , పట్టణాభివృద్ధి శాఖ అనుమతి ఇచ్చింది. వైసీపీ హయాంలో తణుకు మున్సిపాలిటీ కంపోస్ట్‌ యార్డు విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్‌ ఏర్పాటు, పేదల ఇళ్ల కోసం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు రహదారి కోసమంటూ మున్సిపాలిటీ 21 ఎకరాలు సేకరించింది. దానికి రూ.800 కోట్ల విలువైన 29 టీడీఆర్‌ బాండ్‌లను జారీచేసింది. బాండ్ల జారీ విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మునిసిపల్‌ శాఖ విచారణ చేసి ఆ బాండ్లు చెల్లుబాటు కాకుండా నిలిపివేసింది. అప్పటికే బాండ్‌లు పొందిన వ్యాపారులు మార్కెట్‌లో చాలా వరకు విక్రయించేశారు. విశాఖకు చెందిన అప్పటి వైసీపీ నేత రూ.70 కోట్ల విలువైన బాండ్‌లు కొనుగోలు చేశారు. విజయవాడకు చెందిన బిల్డర్లు కొన్నారు. తాము ఎప్పుడో కొనుగోలు చేశామని చెల్లుబాటు కాకుండా చేస్తే నష్టపోతామని కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ బాండ్లు చెల్లుబాటయ్యేలా చూడాలని కోర్టు మునిసిపల్‌ శాఖను ఆదేశించింది.

తాజా బాండ్‌లు నిలిచిపోయినట్టే

కూటమి ప్రభుత్వం గతంలో మంజూరైన బాండ్‌లను పరిగణలోకి తీసుకోలేదు. మున్సిపాలిటీ సేకరించిన 21 ఎకరాలకు వ్యవసాయ భూముల ఆధారంగా ధరను నిర్ణయించారు. ఒక్కో ఎకరం మార్కెట్‌ విలువ రూ.55 లక్షల నుంచి కోటి వరకు ధరను నిర్ణయించారు. అందుకు నాలుగు రెట్లు విలువైన బాండ్‌లు జారీచేశారు. దీంతో దళారుల దందాకు చెక్‌ పడిందని అంతా భావించారు. బాండ్‌ల విలువ గరిష్టంగా రూ.80 కోట్లకు పడి పోయింది. గతంలో బాండ్‌లను కొనుగోలు చేసినవారు హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. గతంలో విక్రయించిన 17 బాండ్‌లకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మిగిలిన 12 బాండ్‌లను నిలిపివేసింది. వాటిని హోల్డ్‌లో పెట్టింది.

Updated Date - Apr 09 , 2026 | 12:29 AM