Share News

కాలుష్యం కోరల్లో..

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:14 AM

తణుకు పట్టణాన్ని కాలుష్యం పీడిస్తోంది.. పట్టణంతో పాటు పరిసర గ్రామాలపై ఈ ప్రభావం ఎక్కువుగానే ఉంటోంది.. ఒక పక్క నీటి కాలుష్యం, మరోపక్క వాయు కాలుష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలుష్యం కోరల్లో..

తణుకు పట్టణానికి పొంచి ఉన్న ప్రమాదం

వాయు, జల కాలుష్యంతో ఇబ్బందులు

మురుగునీరు, వ్యర్థాలన్నీ కాలువలోకే..

విష వాయువులతో శ్వాసకోస ఇబ్బందులు

ప్రజారోగ్యానికి తప్పని ముప్పు

తణుకు పట్టణాన్ని కాలుష్యం పీడిస్తోంది.. పట్టణంతో పాటు పరిసర గ్రామాలపై ఈ ప్రభావం ఎక్కువుగానే ఉంటోంది.. ఒక పక్క నీటి కాలుష్యం, మరోపక్క వాయు కాలుష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తణుకు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) :తణుకు పట్టణంలో ఇటీవల కాలంలో వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పచ్చదనం, పరిశుభ్రతకు పేరొందిన తణుకు ఇపుడు ధూళి, పొగ, విష వాయువులతో నిండిపోతోంది. వాహనాల పొగ, పాత డీజిల్‌ ఆటోలు, బస్సులు విడుదల చేసిన కార్బన్‌ వాయువులు గాలిని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువుగా ఉండటంతో గాలి నాణ్యత మరింత దిగజారుతోందని చెబుతున్నారు. పట్టణ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులు కూడా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. భారీ నిర్మాణాల సమయంలో ఎటువంటి బరకాలతో ఎటువంటి అడ్డుకట్టలు కట్టకపోవడంతో ఇసుక, సిమెంటు, ఇటుకల ధూళి గాలిలో కలవడంతో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యర్థాలను బహిరంగంగా తగలబెట్టడం వల్ల విష వాయువులు గాలిలోకి వెళ్లి ప్రజారోగ్యంపై వ్రభావం చూపుతున్నాయి.

చర్యలు తీసుకోవాలి

మున్సిపల్‌ అదికారులు, కాలుష్య నియంత్రణ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వాహన కాలుష్య నియంత్రణ పరీక్షలు కఠినంగా అమలు చేయడం, నిర్మాణ ప్రదేశాల్లో నీటి పిచికారీ చేయడం, పట్టణంలో విస్తృతంగా మొక్కలు నాటడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పచ్చదనం పెంచడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే తణుకు పట్టణాన్ని ఆరోగ్యకరమైన ప్రాంతంగా మార్చుకోవచ్చని స్థానికులు కోరుతున్నారు.

ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

ఎక్యూఐ (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్సు) అంటే గాలిలో నాణ్యత ఎంత ? కాలుష్యం ఎంత ఉందో తెలుసు కోవడానికి ఉపయోగించే సంఖ్యాత్మక సూచిక .గాలిలో ఉండే హానికరమైన పదార్థాల స్థాయిని ఆధారంగా తీసుకుని ఎయిర్‌ క్వాలిటీ నిర్ణయిస్తారు. సూక్ష్మధూళి కణాలు, దూళి కణాలు, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, న్తెట్రోజన్‌ డయాక్సైడ్‌ 0–50 వరకు ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు. వీటి పరిమాణం 51–100 వరకు స్వల్ప ప్రభావం, 101 నుంచి 200 వరకు ఉంటే సున్నిత వ్యక్తులకు ఇబ్బందికరం. 201 నుంచి 300 వరకు శ్వాసకోస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 301 నుంచి 400 వరకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, 401 నుంచి 500 అత్యంత హానికరమని చెప్పవచ్చు.. తణుకులో ఎక్యూఐ 166 ఉండగా తాడేపల్లిగూడెంలో 161, భీమవరం 162, ఏలూరులో 136 వరకు ఉంది. భీమవరంతో పోల్చుకుంటే తణుకు పర్వాలేదు. అయితే ముందస్తు చర్యలు లేకపోతే ఇబ్బందులు తప్పవు.

సూక్ష్మధూళి కణాలు అత్యంత ప్రమాదకరం

సూక్ష్మ ధూళి కణాల వల్ల అస్తమా, చాతినొప్పి, శ్వాస ఇబ్బందులు శరీ రానికి ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. పిల్లలపై దగ్గు, శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది. తరచూ జలుబు, శ్వాసకోస ఇన్ఫెక్సన్లు, ఆస్తమా వచ్చే అవకాశం పెరగడం. ఎక్యూఐ ఎక్కు వుగా ఉన్నపుడు బయటకు వెళ్లకుండా ఉండాలి. తప్పనిసరి అయితే ఎన్‌ 95 మాస్కు ధరించాలి. ఇంట్లో పొగ, అగరబత్తీలు, ధూపం వాడ కూడదు. పోషకాహారం నీరు ఎక్కువ తీసుకోవాలి.

రెడ్డి అనిల్‌బాబు, జనరల్‌ ఫిజీషియన్‌, తణుకు

ప్లాస్టిక్‌ కవర్లు వాడకుండా చర్యలు

మార్కెట్లో ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రెండు రోజులు క్రితం కూడా పలు షాపుల్లో దాడులు చేసి అర ట్రక్కు ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. రూ.30 వేలు అపరాధ రుసుం వసూలు చేశాం.

టి.రామ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, తణుకు

పరీక్షలు చేసి చర్యలు తీసుకుంటాం

తణుకులో ఎక్యూఐ నిర్దారణ చేస్తాం. పట్టణంలో ఎయిర్‌ క్వాలిటీ పరీక్షలు చేసి వాయు కాలుష్యం ఉందని నిర్దారణ అయితే తగిన చర్యలు తీసుకుంటాం.

సంధ్య, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏఈ, భీమవరం

Updated Date - Feb 04 , 2026 | 12:14 AM