కాలుష్య కోరల్లో తమ్మిలేరు
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:15 AM
తమ్మిలేరు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఏళ్ల తరబడి ఈ పరిసరాల్లో చెత్త, ఇతర వ్యర్థాలను డంపింగ్ చేయడంతో ఇటువైపు రాకపోకలు సాగిం చే లక్షలాది మంది జనం దుర్వాసనతో అల్లాడుతున్నారు.
చెత్త డంపింగ్ యార్డుగా పరిసరాలు
పట్టించుకోని కార్పొరేషన్,ఇతర శాఖలు
దుర్వాసనతో అల్లాడుతున్న జనం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
తమ్మిలేరు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఏళ్ల తరబడి ఈ పరిసరాల్లో చెత్త, ఇతర వ్యర్థాలను డంపింగ్ చేయడంతో ఇటువైపు రాకపోకలు సాగిం చే లక్షలాది మంది జనం దుర్వాసనతో అల్లాడుతున్నారు. ఒకప్పుడు నగరా నికి జీవనాధారంగా ఉన్న ఈకాల్వ ఇప్పుడు ప్రజలకు జల వనరు కాకపో వడంతో ఇష్టారాజ్యంగా తమ్మిలేరును అధ్వాన కేంద్రంగా మార్చేస్తున్నారు.
చెత్త గుట్టలు.. గుట్టలుగా
నగరంలోని ఎఫ్‌సీఐ గొడౌన్ నుంచి వంగూరు వరకు తమ్మిలేరు పరి వాహాక ప్రాంతంలో చెత్తను గుట్టలు.గుట్టలుగా డంప్ చేస్తున్నారు. తంగెళ్ల మూడి పంచాయతీ నగరంలో విలీనం అయినప్పటికి.. సమీప పరిసరాల్లో వచ్చే చెత్తను కూడా ఇక్కడ డంప్ చేస్తున్నారు. అరటి పళ్లు వ్యాపారులు, కొబ్బరి బొండాల వ్యాపారులు తమ దగ్గర ఉన్న చెత్తను గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ డంప్ చేసి మెల్లగా జారుకుంటున్నారు. కాల్వ ఒడ్డున భారీగా చెత్త గుట్టలుగా పోయడంతో పాటు ప్లాస్టిక్, గృహ వ్యర్థాలను ట్రాక్టర్లతో తెచ్చి పడేస్తున్నారు. బహిరంగంగా చెత్తను దహనం చేస్తు న్నారు. ఈ చెత్త వద్ద కుక్కలు, పందులు, ఆవులు చేరి చెత్తను చెల్లాచెదా రుగా చేయడంతో వ్యర్థాలు తమ్మిలేరు నదిలో కలిసి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్న అటు కార్పొ రేషన్, ఇటు జలవనరులశాఖ అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు.
ఇసుక, మట్టి తరలిపోతున్నా..
ఈ పరిసరాల్లోనే నిత్యం మట్టి, ఇసుకలను కొందరు ప్రజాప్రతినిధుల అనుచరగణం కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి తరలించుకుపోతున్నా అడ్డుకునే వారే కరవయ్యారు. వాగులు, వంకలు, నది ప్రాంతాల్లో ఇసుక, మట్టిని యంత్రాలతో తవ్వరాదు. అలా చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణ పరం గా విపత్తులు తలెత్తినప్పుడు ప్రమాదాలకు దారి తీస్తుందని కోర్టుల తీర్పులున్నా.. మట్టి, ఇసుక మాఫియా దందాలకు అడ్డుకట్ట పడడం లేదు. వాల్టా చట్టం కింద తహసీల్దార్, ఇతర అధికారుల కమిటీ ఆధ్వర్యంలో దందాకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేయడానికి అవకాశం ఉన్న చట్టాన్ని కాంట్రాక్టర్లు తమకు చుట్టంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు న్నాయి.
పర్యావరణ పరిరక్షణ గోడలకే పరిమితం
కాల్వ సమీపంలోనే ప్రభుత్వ కార్యాలయాల గోడలపై పర్యావరణ పరి రక్షణ... శుభ్రత. నీటి సంరక్షణ వంటి నినాదాలు రాయించిన అధికారు లు ఆచరణలో తమ చిత్తశుద్ధిని ప్రదర్శించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వర్షాకాలంలో ఈ చెత్త నేరుగా నీటిలో కలవడం వల్ల దుర్వాసన, దోమలతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు మురుగుతో పాటు ఇళ్లలో సెప్టిక్ వ్యర్థాలను తెచ్చి రోడ్లపైనే పోస్తున్న ఆపే వారు కరువయ్యారు. కాల్వ ప్రక్షాళన చేయ లేకపోయినా.. కనీసం తమ్మిలేరును కాలుష్య కాసారంగా మార్చుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.