Share News

తల్లులు మురిసె.. !

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:32 AM

తల్లికి వందనం ఆర్థికసాయం పథకానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న వారిలో మొత్తం 2,69,167 మంది విద్యార్థులు అర్హత సాధిం చగా, ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు చొప్పున మొత్తం 1,99,662 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రూ.355.56 కోట్లు నగదు జమ అవుతోంది.

తల్లులు మురిసె.. !
రామశింగవరంలో తల్లికి వందనం లబ్ధి పొందిన నలుగురు పిల్లలతో తల్లి చిట్టెమ్మ

రూ.367.03 కోట్లు.. తల్లికి వందనం సొమ్ములు విడుదల

జిల్లాలో 2.69 లక్షల మంది బాల బాలికలు అర్హత

కుటుంబంలో ఐదుగురు పిల్లలు ఉన్నా అందరికీ వర్తింపు

తల్లికి వందనం ఆర్థికసాయం పథకానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న వారిలో మొత్తం 2,69,167 మంది విద్యార్థులు అర్హత సాధిం చగా, ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు చొప్పున మొత్తం 1,99,662 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రూ.355.56 కోట్లు నగదు జమ అవుతోంది. ఇందులో పాఠశాల విద్య నుంచి 2,40,921 మంది బాలబాలికలు అర్హత సాధించగా, ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు చొప్పున మొత్తం 1,71,970 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రూ.313.19 కోట్లు, ఇంటర్మీడి యట్‌ నుంచి 28,246 మంది విద్యార్థులకు రూ.42.37 కోట్లు మొత్తం 27,692 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుంది.

ఏలూరు/ఏలూరు అర్బన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : తల్లులు తబ్బిబయ్యేలా తల్లికి వందనం పథకం లబ్ధి జమ కావడంతో జిల్లా అంతటా బుధవారం జోష్‌ నెలకొంది. తొలిరోజు దాదాపుగా 30 శాతం మందికి పైగా ఖాతాల్లో సొమ్ములు జమ అయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎంతమంది పిల్లలుంటే అందరికి తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభు త్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంతో కుటుంబంలో ఐదుగురు పిల్లలున్నా వారందరికీ పథకం వర్తించడం తో తల్లుల ఖాతాలకు రూ.65 వేలు జమ కావడంతో అయా కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది. తమ పిల్ల ల ఫీజుల బెంగ తీరిందని వారంతా కూటమి ప్రభు త్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో 605 సచి వాలయాల వద్ద నోటీసు బోర్డుల్లో అర్హుల జాబితా లను చూసుకున్న లబ్ధిదారులు బ్యాంకు, పోస్టల్‌శాఖ కార్యాలయాల బాట పట్టారు. ప్రతి సచివాలయం పరిధిలోను కనీసంగా 40 నుంచి 50 వరకు అనర్హు లుండే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావంతో మండు తున్న ఎండల కారణంగా చాలామంది ఇళ్లలో ఏసీ లను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో 300 యూని ట్లు విద్యుత్‌ బిల్లు దాటితే అటువంటి వారు తల్లికి వందనం పథకానికి అనర్హులయ్యారు.

మురిసిన అంగన్‌వాడీ సిబ్బంది

మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాల్లో తొలిరోజు పండుగ వాతావరణం నెల కొంది. తొలిసారిగా తల్లికి వందనం అందుకున్నామని, తమను కూడా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

వాస్తవానికి తల్లికి వందనం ఆర్థికసాయం కింద అర్హులైన ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున లెక్కించి, అందులో రూ.2వేలు స్కూలు మెయింటె నెన్సు నిమిత్తం మినహాయించుకుని, మిగతా రూ.13 వేలను విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు జమ చేస్తా రన్న విషయం విదితమే. ఆ ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున లెక్కిస్తే జిల్లాలో రూ.367.03 కోట్లను తల్లికి వందనం ఆర్థికసాయం కింద అర్హులైన తల్లులకు ప్రభుత్వం విడుదల చేసినట్టయింది.

పాఠశాల విద్య నుంచి..

పాఠశాల విద్య నుంచి అత్యధికంగా జిల్లాలో ఈ పథకంలో లబ్ధి పొందిన వాటిలో ఏలూరు అర్బన్‌ మండలం నుంచి 40,210 మంది విద్యార్థులు అర్హత సాధించగా 29,697 మంది తల్లులకు ఆర్థిక సాయం అందింది. జంగారెడ్డిగూడెం మండలంలో 20,563 మంది విద్యార్థులకు గాను 14,758 మంది తల్లులు, నూజివీడు 19,701మంది విద్యార్థులకు గాను 13,723 మంది తల్లులు, చింతలపూడి 13,797 మంది విద్యార్థు లకు 9,796 మంది తల్లులు, పెదవేగి మండలంలో 10,165 మంది విద్యార్థులకు 7,400 మంది తల్లులు, కొయ్యలగూడెం 10,042 మంది విద్యార్థులకు గాను 7,016 మంది తల్లులు ఆర్థిక సాయానికి అర్హులయ్యారు. ఆ తదుపరి అక్షరక్రమంలో అగిరిపల్లి మండలంలో 4,495 మంది తల్లులు, భీమడోలు 7,170, బుట్టా యిగూడెం 5,710, చాట్రాయి 2,835, దెందులూరు 3,162, ద్వారకాతిరుమల 5,109, ఏలూరు రూరల్‌ 2,265, జీలుగుమిల్లి 2,847, కైకలూరు 4,373, కామవరపుకోట 5,444, కుక్కునూరు 2,787, లింగపాలెం 4,837, మండవల్లి 1,986, ముదినేపల్లి 4,936, ముసు నూరు 3,301, నిడమర్రు 2,459, పెదపాడు 6,195, పోలవరం 2,811, టి.నరసాపురం 3,581, ఉంగుటూరు 5,101, వేలేరుపాడు మండలంలో 1,811 మంది ఆర్థిక సాయానికి అర్హత సాధించారు.

ఇంటర్మీడియట్‌లో..

ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు జిల్లాలో 130 ఉండగా ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 12,717 మంది అర్హత సాధించగా రూ.19.08 కోట్ల ఆర్థికసాయం 12,444మంది తల్లులకు అందు తుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 15,529 మందికి రూ.23.29 కోట్లు 15,248 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. మొత్తం మీద ఇంటర్మీడియ ట్‌లో 32,145 మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వీరిలో 28,246 మంది అర్హత సాధించారు. మొత్తం 27,692 మంది తల్లులకు రూ.42.37 కోట్లు ఆర్థికసాయం అందుతుంది. జిల్లాలో మండలాల వారీగా అర్హత సాధించిన తల్లుల సంఖ్యలు తెలియరాలేదు. కాగా ఒకటో తరగతిలోకి, జూని యర్‌ ఇంటర్‌లోకి కొత్తగా అడ్మిషన్లు తీసుకోవడానికి ఆగస్టు 25వరకు గడువు ఉన్నందున వారినుంచి కూడా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేయాల్సి వుంది. వీరికి ఆగస్టు 30న ఆర్థిక సాయాన్ని తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.

పాంచ్‌ పటాకా..

ఒకే కుటుంబంలో ఐదుగురు పిల్లలకు రూ.65 వేలు

16 కుటుంబాల్లో నలుగురికి రూ.52 వేలు జమ

పెదవేగి,జూలై 22(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకం చిన్నారుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపిం ది. పెదవేగి మండలం అంకన్నగూడెంలో మెడ ఏస మ్మ, జోజి దంపతులకు ఐదుగురు సంతా నం. గౌరి (10వ తరగతి), లావణ్య(10వ తరగతి), సుమంత్‌ (7వ తరగతి), నాగవల్లి(6వ తరగతి), కుమార్‌(5వ తరగతి)లకు పథకం కింద తల్లి ఖాతా లో రూ.13 వేలు చొప్పున రూ.65 వేలు జమ కావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇంత మొత్తం సొమ్ము అందుతుందని ఊహించలేదని తల్లిదండ్రు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మపాలెం, బాపి రాజుగూడెం, కొండలరావుపాలెం(2), ముండూరు, రామశింగవరం, వేగివాడ, విజయరాయిగ్రామాల్లో నలుగురేసి పిల్లలు ఉన్న 16 కుటుంబాలకు తల్లికి వందనం సొమ్ము ఒక్కో కుటుంబానికి రూ.52వేలు జమ కావడంతో వారి కుటుంబాల్లో ఆనందం నిండింది. మండలంలో ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం సొమ్ము జమ అయిన కుటుంబాలు 317 ఉన్నాయి. మండలంలో 7,987 మంది తల్లుల ఖాతాలో రూ.10,38,31,000 నగదు జమ చేశారు.

పెదపాడు : మండలంలో పెదపాడు–2 పరిధిలో ఒకే కుటుంబంలోని ఐదుగురు, వట్లూరు–1 పరిధిలో నలుగురు విద్యార్థులు లబ్ధి పొందారు.

దెందులూరు : కొవ్వలిలో కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్న దుప్పల సత్యనారాయణ, ఝూన్సీ దంపతులకు ముగ్గురు సంతానం. రమ్మశ్రీ (10వ తరగతి), నవ్యశ్రీ (8వ తరగతి), సాయి మణికంఠ (7వ తరగతి) స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు. ముగ్గురికీ తల్లికి వందనం పథకం కింద రూ.39 వేలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ కావడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలు లేక పనులు అంతంత మాత్రమే ఉండడంతో ఇబ్బందుల పడుతున్న సమయంలో ప్రభుత్వం అందించిన సాయంతో చాలా సంతోషం వేసిందని, కుటుంబ పోషణ భయం లేకుండా పోయిందని, పిల్లలను ధైర్యంగా పాఠశాలకు పంపిస్తామంటూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

చాట్రాయి : ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి చనుబండలో స్థిరపడిన కె.జితేంద్రకుమార్‌, మాలతీదేవి దంపతుల నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద రూ.52 వేలు బ్యాంకు ఖాతాకు జమ కావడంతో ఆ కుటుంబం ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి పిల్లలు రితిక్‌కుమార్‌, సునయినాదేవి, మహీదేవి, జిగర్‌రాజులకు రూ.13 వేలు చొప్పున తల్లికి వందనం లబ్ధి చేకూరింది. గతేడాది ఈ కుటుంబానికి రూ.39 వేలు తల్లికి వందనం సాయం అందింది. కూటమి ప్రభుత్వ సాయంతో తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తామని జితేంద్రకుమార్‌ దంపతులు చెప్పారు. జితేంద్రకుమార్‌ పదేళ్ల నుంచి చనుబండ సెంటర్‌లో పానీపూరీ బండి పెట్టుకొని జీవిస్తున్నాడు.

ముసునూరు : ముసునూరు ఎస్సీ కాలనీకి చెందిన ముళ్లపూడి వెంకటేశ్వ రరావు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గోపవరం సెయింట్‌ యూజీఎన్‌ స్కూల్‌లో చిరు చైతన్య (5వ తరగతి), చిరు చందు (4వ తరగతి), సిరి (ఒకటవ తరగతి) చదువుతున్నారు. తల్లికి వందనం పథకంలో ముగ్గురు పిల్లలకు రూ.39 వేలు నగదు జమ అవడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సాయం పిల్లలను చదువులకు ఉపయోగపడుతుందన్నారు. పేద కుటుంబాల పిల్లలు చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం శుభపరిణామమని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

ముదినేపల్లి : అల్లూరు గ్రామానికి చెందిన గొల్లి రమేష్‌, శివగంగ దంపతుల ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం సొమ్ము రూ. 39 వేలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ అయింది. వారి కుమార్తెలు నాగమల్లీశ్వరి (తొమ్మిదో తరగతి), జానకి (ఆరో తరగతి), నంది కిశోర్‌ (నాల్గవ తరగతి) అల్లూరు జడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. గతేడాది సాంకేతిక కారణాలతో వారికి తల్లికి వందనం లబ్ది అందలేదు. ఆ సమస్యను సరిదిద్దడంతో ఈ ఏడాది పథకం లబ్ధి చేకూరింది. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న తమకు ఈ నగదు సాయం చాలా ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు తెలిపారు.

నిడమర్రు : ఛానమిల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న సానబోయిన లిఖితసాయి (9 వ తరగతి), వైష్ణవి (8వ తరగతి), మణికంఠ (6వ తరగతి) తల్లి సరోజిని ఖాతాలో రూ.39 వేల సొమ్ము జమ అయింది. దీంతో పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను కలిసి తన ఆనందం వ్యక్తం చేశారు. నేపల రూతిమణి కుమార్తెలు రమ్య (10వ తరగతి), రజిత (9వ) ప్రవల్లిక (7వ)లకు కూడా తల్లికి వందనం సొమ్ము జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచారు.

Updated Date - Jul 23 , 2026 | 12:32 AM