Share News

తడికలపూడి జడ్పీహెచ్‌ఎస్‌కు ‘ఎస్‌హెచ్‌వీఆర్‌’ పురస్కారం

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:53 PM

ప్రభుత్వ పాఠశా లల్లో సురక్షితమైన తాగునీటి పంపిణీ, నిర్వహణ, పారిశుధ్య, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్కూలు నిర్వహణలో సుస్థిరత ప్రధానాంశాలుగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) అందజేసే స్వచ్ఛ్‌ ఏవం హరిత విద్యాలయ రికగ్నిషన్‌ (ఎస్‌హెచ్‌వీఆర్‌)–2025 పురస్కారానికి ఏలూరు జిల్లాలోని తడికలపూడి జడ్పీ హైస్కూలు ఎంపికైంది

తడికలపూడి జడ్పీహెచ్‌ఎస్‌కు ‘ఎస్‌హెచ్‌వీఆర్‌’ పురస్కారం
తడికలపూడి జడ్పీ హైస్కూలు ప్రవేశద్వారం

రాష్ట్రంలో ప్రథమ, జాతీయస్థాయిలో ఆరో ర్యాంకు

ఏలూరు అర్బన్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశా లల్లో సురక్షితమైన తాగునీటి పంపిణీ, నిర్వహణ, పారిశుధ్య, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్కూలు నిర్వహణలో సుస్థిరత ప్రధానాంశాలుగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) అందజేసే స్వచ్ఛ్‌ ఏవం హరిత విద్యాలయ రికగ్నిషన్‌ (ఎస్‌హెచ్‌వీఆర్‌)–2025 పురస్కారానికి ఏలూరు జిల్లాలోని తడికలపూడి జడ్పీ హైస్కూలు ఎంపికైంది. ఈ విషయాన్ని ఎంహెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించగా, ఈ పురస్కారాలకు రాష్ట్రం నుంచి ఎంపికైన 8 పాఠశాలల వివరాలను సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశా రు. దేశవ్యాప్తంగా 191 ప్రభుత్వ పాఠశాలలు ఎస్‌హెచ్‌వీఆర్‌–2025 అవార్డులకు ఎంపికకాగా, రాష్ట్రం నుంచి ఎంపికైనవాటిలో తడికలపూడి జడ్పీహెచ్‌ఎస్‌ 7/7 గ్రేడ్‌ లెవెల్స్‌ (96శాతం స్కోరు)తో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు, జాతీయస్థాయిలో ఆరో ర్యాంకులో నిలిచిందని డీఈవో వెంకట లక్ష్మమ్మ, ఎస్‌ఎస్‌ఏ జిల్లా ఏపీసీ పంకజ్‌కుమార్‌ తెలిపారు. కేంద్రప్రభుత్వ మిషన్‌ లైఫ్‌ ప్రామాణికాలకు అనుగుణంగా రాష్ట్రస్థాయి స్ర్కీనింగ్‌ను నిర్వహించి ఈఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని రాష్ట్రంలో ఎంపిక చేసిన 20 ప్రభుత్వ పాఠశాలల ప్రదానో పాధ్యాయులకు స్టేట్‌ లెవెల్‌ ఎస్‌హెచ్‌వీఆర్‌ పురస్కారాలను అప్పట్లో ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ శ్రీనివాసరావు అందజేశారు.

వీటినే జాతీయస్థాయి పోటీలకు ఏపీ ప్రతిపాదించింది. క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం గత ఏప్రిల్‌, మే నెలల్లో ఎంహెచ్‌ఆర్‌డీ, యునిసెఫ్‌ బృందాలు వేర్వేరుగా సంబంధిత పాఠశాలలను సందర్శించి నిర్ధేశిత ప్రామాణికాలకనుగుణంగా సౌకర్యాలు, అమలు తీరుపై తనిఖీలు చేశాయి. పాఠశాలల హెచ్‌ఎంలను ఆన్‌లైన్‌ విధానంలో ఈనెల 11న ఇంటర్వ్యూ చేశాయి. జాతీయస్థాయి పురస్కారాలకు తుదిగా ఎంపికైన పాఠశాలల జాబితాను సోమవారం విడుదల చేశాయి. అవార్డుకు ఎంపికైన పాఠశా లకు రూ.లక్ష చొప్పున కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ బహుమతి, పరిశుభ్రత, హరిత కార్యక్రమాల్లో జాతీయస్థాయి గుర్తింపు పత్రం అందజేయ డంతోపాటు, సంబంధిత స్కూలు హెచ్‌ఎంను ఎంహెచ్‌ఆర్‌డీ నిర్వహించే అధ్యయన యాత్ర(ఎక్స్‌పోజర్‌ విజిట్స్‌)లకు అర్హత కల్పిస్తారు.

సమష్టి విజయమిది : సర్వేశ్వరరావు, హెచ్‌ఎం, తడికలపూడి జడ్పీ హైస్కూలు

స్కూలు ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణం, ఆరోగ్యకరమైన పరిస్థితులు జాతీయస్థాయి ప్రామాణికాలకు అనుగుణంగా ఉన్నాయంటే టీచర్లు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్యాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిదుల సమన్వయం, సహకారమే కారణం. సాధారణ పాఠశాలనే హరిత వనంగా అభివృద్ధి చేశాం. జాతీయస్థాయి పురస్కారం ఆగస్టు 15న ఢిల్లీలో అందజేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Updated Date - Jun 16 , 2026 | 11:53 PM