తాడేపల్లిగూడెం అండర్ గ్రౌండ్ డ్రెయినేజికి ఆటంకాలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:26 AM
తాడేపల్లిగూడెంలో అండర్ గ్రౌండ్ డైన్రేజీ పనులకు అడుగడుగునా ఆటంకాలు వెంటాడుతున్నాయి.
అమృత్ 1లో రూ.32 కోట్లు మంజూరు
50 శాతమే ఎస్టీపీ పూర్తి.. లిఫ్టింగ్ స్టేషన్లకు అడ్డంకులు
అమృత్ 2లో రూ.88 కోట్లు మంజూరు
డిజైన్ దశలోనే రెండు ఎస్టీపీలు
తాడేపల్లిగూడెంలో అండర్ గ్రౌండ్ డైన్రేజీ పనులకు అడుగడుగునా ఆటంకాలు వెంటాడుతున్నాయి. వన్ టౌన్‌లో అమృత్ 1 పథకంలో రూ.32.14 కోట్లతో చేపట్టిన ఎస్టీపీ పనులు 50 శాతం వరకే పూర్తయి నిలిచిపోయాయి. టూ టౌన్‌లో రూ.88 కోట్లతో చేపట్టనున్న మరో రెండు ఎస్టీపీలు డిజైన్ దశలోనే ఉన్నాయి. దీంతో కడకట్ల, వీకర్స్ కాలనీ వంటి ప్రాంతాల్లో ప్రజలు మురుగునీరు వెళ్లక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం వన్ టౌన్ యానాదుల కాలనీలో అమృత్ 1లో రూ.32.14 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)కు 2022 జూన్ 30న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చే వరకు పనులు కొనసాగాయి. దాదాపు 50 శాతం వరకు పూర్తయ్యాయి. ప్రధానంగా రెండుచోట్ల లిఫ్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కడకట్లలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ సమీపంలో ఒకటి, సంజీవనగర్ స్కూల్ సమీపంలో మరొకటి కట్టాలని ప్రతిపాదించారు. అక్కడ ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడం తో ఆ ప్రతిపాదన ప్రతిపాదన దశలోనే ఉండి పోయింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్‌కు పబ్లిక్ హెల్త్ శాఖ నుంచి నోటీసులు జారీ చేశారు ఈ ఎస్టీపీ పూర్తయితే వన్ టౌన్‌లో మురుగునీటి సమస్య కు పరిష్కారం దొరుకుతుంది. కలుషితమైన మురుగునీరు ఏలూరు కాలువలో కలవకుండా ఉండేందుకు మార్గం ఏర్పడుతుంది. ఇదే లక్ష్యం తో యానాదుల కాలనీలో ఎస్టీపీ ఏర్పాటు చేశా రు. కానీ శంకుస్థాపన చేసి నాలుగు సంవత్స రాలు దాటినా పరిస్థితులు మారడం లేదు.
డిజైన్ దశలోనే రెండు ఎస్టీపీలు
తాడేపల్లిగూడెం టూటౌన్‌లో అమృత్ 2 పథకంలో రూ.88 కోట్లతో రెండు ఎస్టీపీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం నిధులు కేటాయించింది. తొలుత రిక్షా పుంతలో ఒకటి, యాగర్లపల్లి చాకళ్ల చెరువు వద్ద మరొకటి ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు. చాకళ్ల చెరువు కేటాయింపులో ఇబ్బందు లు రావడంతో ఇప్పుడు రెండు ఎస్టీపీలను రిక్షా పుంతలోని స్లాటర్ హౌస్ సమీపంలో ఉన్న ఒకటిన్నర ఎకరాల భూమిలో ఏర్పాటు చేయను న్నారు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు డిజైన్ రూపొందించి అనుమతి కోసం పంపారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లను నాగార్జున కన్‌స్ట్రక్షన్ దక్కించుకుంది. డిజైన్‌కు అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని పబ్లిక్ హెల్త్ అధికారులు చెబుతున్నారు.
మురుగు ఆపేందుకు ప్రణాళిక
టూటౌన్‌లో పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు, పైప్ లైన్ ఏర్పాటు చేయాలి. వన్ టౌన్‌లోని కెఎన్ రోడ్డుకు తూర్పు వైపున ఉన్న పాతూరు, మహాలక్ష్మినగర్, సత్యవతి నగర్ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు ఏలూరు కాలువలో కలవకుండా పెద్ద శివాలయం సమీపం నుంచి రిక్షా పుంతలో ఏర్పాటు చేసే ఎస్టీపీలకు తరలిస్తారు. వన్ టౌన్‌లో కెఎన్ రోడ్డుకు తూర్పు భాగంలో ఉన్న 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 వార్డులకు సంబంధించిన మురుగునీరు ఏలూరు కాలువలో కలవకుండా కడకట్ల పాత రైల్వే గేట్ వద్ద డైవర్షన్ చేసి యానాదుల కాలనీకి మళ్లించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇదంతా పూర్తయితే ఏలూరు కాలువలోకి కలుషిత నీరు కలవడం తగ్గడంతోపాటు పట్టణ ప్రజలకు డ్రెయినేజీ ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. పనుల్లో జాప్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే ఫిర్యాదుల్లో యాభై శాతం డ్రైనేజీ సమస్యలపైనే వస్తున్నాయంటే పరిస్థితి అర్థమవుతోంది.
డ్రెయినేజీ ప్రక్షాళనే లక్ష్యం
తాడేపల్లిగూడెంలో డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నాం. అమృత్ 2 పథకంలో రెండు ఎస్టీపీల ఏర్పాటుకు రూ.88 కోట్లు నిధులు తీసుకొచ్చాం. పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రజల నుంచి చిన్నపాటి అభ్యంతరాలు వచ్చినా చర్చించి పరిష్కరిస్తాం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఎస్టీపీలు ఏర్పాటు చేయకుండా అండర్‌గ్రౌడ్ డ్రైనేజ్‌లు ఏర్పాటు కోసం రోడ్లు తవ్వేసి పైపులు పెట్టి వదిలేశారు. నేను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో వీటిని పూడ్పించాను. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రక్షాళన చేపట్టాను.
– బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే
ప్రజాదర్బారులో ప్రధాన సమస్య ఇదే
తాడేపల్లిగూడెం ప్రజా దర్బారులో వచ్చే అర్జీల్లో ఎక్కువ శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మురునీరు సమస్యలపైనే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీపీల ఏర్పాటుకు నిధులు విడుదల చేసింది. గత ప్రభుత్వం ఎస్టీపీలు ఏర్పాటు చేయకుండానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌ల కోసం రోడ్లు తవ్వి వదిలేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో దానిని సరిచేసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
– వలవల బాబ్జి, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్
నవంబరు నుంచి ఎస్టీపీల పనులు
అమృత్ 2 పథకంలో విడుదలైన నిధులు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాం. టూటౌన్‌లో రెండు ఎస్టీపీలను రిక్షా పుంత సమీపంలో ఏర్పాటు చేస్తున్నాం. డిజైన్‌ను ఉన్నతాధికారులకు పంపించాం. టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
– ఆర్.విజయ్, పబ్లిక్ హెల్త్ డీఈ