మిగులు టీచర్ల సర్దుబాటుకు దిగులు!
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:31 AM
మిగులు ఉపాధ్యాయులను కొరతవున్న పాఠశాలలకు సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్‌మెంట్) చేయడానికి ఈ నెల 30 తుదిగడువుగా విద్యా శాఖ నిర్ణయించింది.
400 మంది సర్‌ప్లస్ టీచర్లు ఎక్కడివారక్కడే !
కొత్త జిల్లాల ప్రకారమే వర్క్ అడ్జస్ట్‌మెంట్
ఏలూరు అర్బన్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): మిగులు ఉపాధ్యాయులను కొరతవున్న పాఠశాలలకు సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్‌మెంట్) చేయడానికి ఈ నెల 30 తుదిగడువుగా విద్యా శాఖ నిర్ణయించింది. సర్దుబాటు మార్గదర్శకాల మేరకు కొత్త జిల్లాల పరిధికే పరిమితం చేయాల్సి ఉంది. ఈ నెల 20వ తేదీని కటాఫ్‌గా తీసుకుని అన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రామాణికంగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించడం తోపాటు, టీచర్ల కొరతవున్న స్కూళ్ల సంఖ్యను తేల్చారు. రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యా శాఖ వద్దవున్న యుడైస్ డేటా ప్రకారం ఉపాధ్యాయుల సర్‌ప్లస్, నీడ్(కొరత)వున్న పాఠశాలలను, మండలాలవారీగా ఖాళీలను గుర్తించారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోయినట్టు తేలింది. సర్దుబాటులో మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లను మాత్రమే తాత్కాలికంగా డిప్యుటేషన్లపై నియమించడానికి అవకాశం ఉంది. ఎస్జీటీల్లో మాత్రం 180 వరకు ఆయా పాఠశాలల్లో కొరత వున్నట్టు గుర్తించినా క్షేత్రస్థాయిలో 40–50కి మించి ఖాళీలు లేవని తెలిసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌కు ఉమ్మడి జిల్లాలో అన్ని ఖాళీలను పెట్టేయడంతో తాజాగా వర్క్ అడ్జస్ట్‌మెంట్‌కు ఖాళీలు లేవు. జిల్లాలో సర్‌ప్లస్ టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీలు లేకపోవడంతో సుమారు 400మందిని సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొంది. సర్‌ప్లస్ టీచర్ల లో అత్యధికులు ప్రస్తుత పాఠశాలల్లోనే కొనసాగాల్సిన పరిస్థితులు కనబడుతు న్నాయి. కాగా గత ఏడాది నుంచి ప్రారంభమైన మోడల్ ప్రైమరీ స్కూళ్ల (ఎంపీఎస్)లో నిర్దేశిత కనీస విద్యార్థుల సంఖ్య 60కంటే తక్కువ వున్న పాఠ శాలలు ఎక్కువగా ఉన్నప్పటికీ సర్‌ప్లస్ టీచర్లను సర్దుబాటు చేయడానికి ఆస్కారం లేకపోవడంతో ఎక్కడివారక్కడే ఉండాల్సి రావచ్చని విద్యాశాఖ వర్గాల అంచనా. తాజా మార్గదర్శకాల ప్రకారం సర్‌ప్లస్ టీచర్ల వివరాలను మండలాల వారీగా సంబంధిత ఎంఈవోల లాగిన్లకు పంపించారు. ఎంఈవోలు నిర్ధారించు కుని మండలంలో కొరతవున్న పాఠశాలల్లో ఖాళీలను గుర్తించాలి. సంబంధిత టీచర్లకు ఈ నెల 26న మండలాల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలి. మిగిలిన టీచర్లను డివిజన్‌స్థాయికి పంపించి, సీనియార్టీ ఆధారంగా ఖాళీలను భర్తీచేయా లి. ఇంకా సర్‌ప్లస్ టీచర్లుంటే జిల్లాస్థాయికి పంపించి భర్తీచేస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 30లోగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.