Share News

రోహిణీ సెగ

ABN , Publish Date - May 26 , 2026 | 12:11 AM

రోహిణీ కార్తె ప్రభావం జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తొలిరోజే సెగ చూపించింది. ఉదయం 7గంటలకే భానుడి ప్రతాపం కనిపించింది.

రోహిణీ సెగ

జిల్లావ్యాప్తంగా కొనసాగిన భానుడి భగభగలు

కుక్కునూరులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూమ్స్‌

(ఏలూరుసిటీ – ఆంధ్రజ్యోతి)

రోహిణీ కార్తె ప్రభావం జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తొలిరోజే సెగ చూపించింది. ఉదయం 7గంటలకే భానుడి ప్రతాపం కనిపించింది. జిల్లాలో వడగాడ్పులు, ఉక్కబోతతో తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. సోమవారం జిల్లాలో అత్యధికంగా కుక్కునూరు మండలంలో 46.1 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 26న జిల్లాలో 13 మండలాల్లో తీవ్రకరమైన వేడి గాలులు , ఈనెల 27న 16 మండలాల్లో తీవ్రకరమైన వేడిగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీవ్రమైన ఎండలు, తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో విద్యుత్‌ అంతరాయాలు కొనసాగుతున్నాయి.

విద్యుత్‌శాఖ ప్రత్యేక కార్యాచరణ

ప్రస్తుత వేసవిలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నా మని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక విద్యుత్‌ లోడ్‌ నమోదు అవుతున్న ప్రాంతాలను గుర్తించి అదనపు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌) ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక సమస్యలను పరి ష్కరించేందుకు సర్కిల్‌ పరిధిలోని 9 మండ లాల్లో ప్రతి మండలానికి మూడు చొప్పున ప్రత్యేక అత్యవసర బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 400 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి విద్యుత్‌కు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్‌ సమస్యలపై సంప్రదించాల్సిన నంబర్లు.. పర్యవేక్షక ఇంజనీర్‌ : 94408 12702, ఈఈ, జంగారెడ్డిగూడెం : 94910 49797, ఈఈ, ఏలూరు : 94408 12704, విద్యుత్‌శాఖ టోల్‌ఫ్రీ నెంబర్‌: 1912, లోడ్‌ మానిటరింగ్‌ సెల్స్‌: జంగారెడ్డిగూడెం డివిజన్‌: 94910 30712, ఏలూరు డివిజన్‌: 94409 04037

ఏలూరు సర్కిల్‌ : 94409 02926 ..

నిర్మానుష్యంగా జాతీయ రహదారి

దెందులూరు : నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే దెందులూరు 16వ నంబర్‌ జాతీయ రహదారి సోమవారం 11 గంటలకే నిర్మానుష్యంగా మారింది. మధ్యాహ్నం ఎండ 47 డిగ్రీలు ఉండడంతో రోడ్డంతా ఖాళీగా కనిపించింది. వాహనాలను చెట్ల కింద, బంకుల దగ్గర పార్కింగ్‌ చేసి డ్రైవర్లు విశ్రాంతి తీసుకున్నారు.

వడదెబ్బతో మృతి

ఏలూరు క్రైం : ఒక గుర్తు తెలి యని యువకుడు వడదెబ్బకు గురై నడిరోడ్డుపై మృత్యు వాత పడ్డాడు. హనుమాన్‌జంక్షన్‌ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు ఈనెల 24వ తేదీ రాత్రి రోడ్డుపై అకస్మాత్తుగా పడిపోయాడు. స్థానికుల సమాచారంతో 108లో ఏలూరు ప్రభుత్వాసుత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఎమ్మెల్సీగా నమోదు చేసి ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Updated Date - May 26 , 2026 | 12:11 AM