చుర్రుమంటూ..!
ABN , Publish Date - May 24 , 2026 | 12:53 AM
జిల్లాలో శనివారం విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 6గంటల నుంచి 12 గంటల వరకు సూరీడు కొంత శాంతిం చాడు. ఉదయం సమయంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మబ్బులతో కూడిన గాలులు వీచాయి. ఇక మధ్యాహ్నం నుంచి భానుడి ప్రతాపం చూపాడు.
తగ్గని ఎండ మంటలు
ఉదయం మబ్బులు.. మధ్యాహ్నం నుంచి తీవ్రంగా ఎండలు
కుక్కునూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
వడగాడ్పుల తీవ్రతతో అల్లాడిన ప్రజలు
రానున్న ఐదు రోజులు అత్యంత వేడిగాలులు
జిల్లాలో డేంజర్ అలర్ట్ జారీ : కలెక్టర్
(ఏలూరుసిటీ – ఆంధ్రజ్యోతి)
జిల్లాలో శనివారం విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 6గంటల నుంచి 12 గంటల వరకు సూరీడు కొంత శాంతిం చాడు. ఉదయం సమయంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మబ్బులతో కూడిన గాలులు వీచాయి. ఇక మధ్యాహ్నం నుంచి భానుడి ప్రతాపం చూపాడు. రాత్రి వరకు వీచిన వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. జిల్లాలో శనివారం అత్యధికంగా కుక్కునూరు లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే ఐదు రోజులు అత్యంత వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. 24న జిల్లాలో ఒక మండలంలో అత్యంత తీవ్రమైన వేడిగాలులు, 13 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని, 25న మూడు మండలాల్లో అత్యంత తీవ్రమైన వేడిగాలులు, 21 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని హెచ్చరిం చింది. జిల్లాలోని అన్ని మండలాల్లో 41 నుంచి 54 డిగ్రీల మధ్య సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేసినట్టు కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఈ మేరకు డేంజర్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు. తీవ్రమైన ఎండలు, వేడిగాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ఉదయం 11 గంట ల నుంచి సాయం త్రం 4గంటల వరకు అత్యవసర మైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు విద్యుత్ ట్రాన్ష్‌ఫార్మర్లు మొరాయించడం తో తరచూ విద్యుత్ అంతరాయాలు
ఏర్పడుతున్నాయి. ఒక పక్క గాలిలో తేమ శాతం పెరుగుతుండడంతో ఉక్కబోతను భరించలేక అవస్థలు పడుతుంటే మరోవైపు విద్యుత్ అంతరాయాలతో ఇళ్లల్లో ఉండలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు..
వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అవసరమైన చోట్ల అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం, లోడ్ బాలెన్సింగ్ చర్యలు చేపడుతున్నట్టు ఏపీఈసీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు శనివారం తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. జంగారెడ్డిగూడెంలో ఏర్పడిన విద్యుత్ సమస్యల పరిష్కా రానికి 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు ఆరు ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా విద్యుత్ సమస్యలు ఉంటే తనకు గాని (9440812702), జంగారెడ్డిగూడెం ఈఈ (94910 49797)కు గాని, అడిషినల్ ఈఈ జంగారెడ్డిగూడెం (94408 12722)కు గాని లేదా విద్యుత్ శాఖ 1912 కు గాని తెలిపితే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
నిర్మానుష్యంగా రోడ్లు
పోలవరం/కామవరపుకోట/చింతలపూడి : ఎండ తీవ్రత, ఉక్కబోతతో ప్రజానీకం అల్లల్లాడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతకు గురై తల్లడిల్లుతున్నారు. ఎండల ధాటికి ప్రజలు వీధుల్లో తిరిగేందుకు సాహసించడం లేదు. వ్యవసాయ, ఇతర పనులు చేసుకునే కూలీలు ఎండల వలన పనులకు వెళ్లకుండా నివాసాలకే పరిమితమవుతున్నారు. జన సంచారం లేకపోవడం, వడగాడ్పుల వల్ల మధ్యాహ్న వేళల్లో షాపింగ్‌లన్నీ మూసివేస్తుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొబ్బరి బొండాలకు, శీతల పానీయాలకు గిరాకీ పెరిగింది. కొబ్బరి నీళ్లు లీటరు రూ.120 నుంచి రూ.130లకు అమ్మకాలు కొనసాగాయి. పోలవరంలో ప్రధాన రహదారులు, పోలవరం ప్రాజెక్టుకి వెళ్లే రోడ్డు మార్గం నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రత తాపానికి తాళలేక పలువురు గోదావరిలో స్నానాలు చేస్తూ సేదతీరారు. కామవరపుకోట మండలంలో ఎండల ధాటికి జనం అల్లాడుతున్నారు. ఉదయం 11 గంటలకే జీలకర్రగూడెం సెంటర్ నిర్మానుష్యంగా మారింది. చింతలపూడిలో నాలుగైదు రోజులుగా చింతలపూడి పరిసరాల్లో ఎండలు తీవ్రమయ్యాయి. మరోవైపు కరెంట్ కోతలతో ఉక్కపోత, నిద్రలేమితో జాగారం చేస్తున్నారు. బస్సుల్లో ప్రయాణికులు తగ్గిపోయారు.
వడదెబ్బకు ఇద్దరి మృతి
పెదవేగి, మే 23 (ఆంధ్రజ్యోతి): వడదెబ్బకు గురై మండలంలో ఇద్దరు మృతి చెందారు. కొప్పాకకు చెందిన చల్లారి రాటాలరావు(55) స్థానిక పెద్దచెరువులో మట్టి పనులు చేస్తూ శనివారం ఉదయం సొమ్మసిల్లి పడిపోగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. పెదవేగి గ్రామానికి చెందిన మారగాని శ్రీనివాసరావు (60) రెండేళ్లుగా పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విధులకు హాజరు కాగా ఎండ తీవ్రతకు సాయంత్రానికి అస్వస్థతకు గురికావడంతో గురువారం విధులకు హాజరుకాలేదు. శుక్రవారం రాత్రి విధులకు హాజరయ్యాడు. శనివారం ఉదయం 6గంటలకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించే సరికే మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాటాలరావు, శ్రీనివాసరావు మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని భరోసా నిచ్చారు.
18 మందికి అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స
దెందులూరు/పోలవరం: ఎండల తీవ్రతకు దెందులూరు మండలంలోని వివిధ గ్రామా లకు చెందిన 15 మంది రైతు లు, కూలీలు, ఇళ్ల వద్ద వున్న వడదెబ్బకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, తల తిరగడం వంటి లక్షణాలు వీరంతా చికిత్స నిమిత్తం దెందులూరు పీహెచ్‌సీకి వచ్చారు. డాక్టర్ సుందరబాబు వీరికి చికిత్స చేయడంతో కోలుకున్నారు. అనంతరం లస్సీ, మజ్జిగ, కొబ్బరి నీళ్లను తెప్పించి అందజేశారు. ఎంత పని వున్నా ఎండలో తిరగవద్దని గంట గంటకు తాగు నీరు, ద్రవ పదార్థాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోవాలన్నారు. ఎండ దెబ్బ తగలకుండా తలకు గుడ్డను కట్టుకోవాలన్నారు. పోలవరం మండలంలో మేదే కృష్ణస్వామి (టేకూరు), షేక్ రమణ (రాజంపాలెం), గేదెల చంద్రరావు (పట్టిసీమ) వడదెబ్బకు గురై వాంతులు, విరేచనాలు కావడంతో పోలవరం ప్రభుత్వాసు పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వడదెబ్బకు గురైన వారికి చికిత్స అందించి పర్యవేక్షణలో ఉంచినట్టు సూపరిండెంట్ రాంబాబు తెలిపారు.