Share News

ఎండ..ప్రచండం!

ABN , Publish Date - May 22 , 2026 | 12:31 AM

ప్రచంఢ భానుడి ప్రతాపానికి జిల్లా ప్రజలు విలవిలలాడారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.

ఎండ..ప్రచండం!
గురువారం సాయంత్రం 4గంటలకు నిర్మానుష్యంగా జీలుగుమిల్లి–జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి

తీవ్రమైన వేడిగాలులు.. ఉక్కబోత

అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు అవస్థలు

చింతలపూడిలో 47.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు

రానున్న ఆరు రోజులు అత్యంత వేడిగాలులు వీచే అవకాశం

అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు : అధికారుల హెచ్చరికలు

(ఏలూరుసిటీ – ఆంధ్రజ్యోతి/న్యూస్‌నెట్‌వర్క్‌):

ప్రచంఢ భానుడి ప్రతాపానికి జిల్లా ప్రజలు విలవిలలాడారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. జిల్లాలో వడగాడ్పుల తీవ్రత విపరీతంగా పెరగడంతో ఉదయం 7గంటల నుంచే ప్రజలు భీతిల్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటలు నాటికి ఉష్ణోగ్రతలు తార స్థాయికి చేరాయి. జిల్లాలోనే అత్యధికంగా చింతల పూడి మండలంలో 47.3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణో గ్రత నమోదు కాగా, నిడమర్రు మండలంలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరుతో పాటు చింతలపూడి, లింగపాలెం, ఉంగు టూరు, ఆగిరిపల్లి, కుక్కునూరు, ముసునూరు, పెద పాడు, భీమడోలు ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి 46.8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలుల తీవ్రతతో ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం 11 గంట లకే జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రా లలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. శుక్ర, శనివారాల్లో జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవు తాయని ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 22న జిల్లాలో 4 మండలాల్లో అత్యంత తీవ్రమైన వేడిగ ాలులు, 19 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని, 23న 14 మండలాల్లో తీవ్రవేడిగాలులు వీస్తాయని ఇప్పటికే రాష్ట్ర విపత్లుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదే శించారు. కలెక్టరేట్‌ చాంబర్‌ నుంచి ఎండ తీవ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో నిర్వహిం చిన టెలీకాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జనం బెంబేలు

చింతలపూడిలో జిల్లాలోనే అత్యధికంగా 47.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మూడు రోజులుగా ఇదే తరహా ఎండలు కాయడం, తీవ్ర మైన వడగాడ్పులతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కలిదిండిలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఉక్కబోతతో అల్లాడిపోయారు. ముదినేపల్లి ప్రాంతం లో ఎండ వేడిమితో పాటు వేడిగాలులు వీయడంతో ప్రజలు హడలెత్తిపోయారు. ముదినేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీలుగుమిల్లి– జంగారెడ్డి గూడెం జాతీయ రహదారిపై పగటిపూటవాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. జీలుగుమిల్లిలో 44.4 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. పాములవారిగూడెం లో అప్రకటిత విద్యుత్‌ కోతతో గ్రామస్థులు తాగునీటి కి ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో ఓ వ్యక్తి రాత్రి సమయంలో కరెంటు లేక డాబా పైకి గాలికోసం ఎక్కి చీకట్లో కిందపడడంతో

ఆస్పత్రి పాలయ్యాడని స్థానికులు వాపోయారు. చాట్రాయి మండలంలో 44.6 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. ఫ్యాన్లు, కూలర్ల నుంచి వెచ్చటిగాలులు వస్తుండటంతో అల్లాడిపోయారు. పెదపాడు మండలంలో 45.6 డిగ్రీలు నమోదు కావడంతో చిన్నారులు, వృద్ధులు విలవిల లాడారు. ద్వారకాతిరుమల శ్రీవారిక్షేత్రం నిప్పులు కొలిమిని తలపించింది. భక్తులు ఎండవేడిమి, ఉక్క బోతకు ఉక్కిరిబిక్కిరయ్యారు. శేషాచల ఘాట్‌రోడ్డు, క్షేత్ర రహదారులు జనసంచారం లేకుండా కన్పించాయి.

ఎండ తీవ్రతతో ఆక్వా ఉక్కిరి బిక్కిరి

ఆక్సిజన్‌ అందక చెరువుల్లో తేలుతున్న చేపలు.. రైతుల ఆందోళన

కలిదిండి, మే 21 (ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా ఎండతీవ్రత అధికంగా ఉండడంతో ఆక్వా చెరువుల్లో నీరు వేడెక్కిపోవడంతో చెరువుల్లో చేపలు, రొయ్యలు ఆక్సిజన్‌ అందక విలవిలాడుతున్నాయి. మండలంలో సుమారు 33 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. రెండురోజులుగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రివేళల్లోను వేడిగాలులు, ఉక్కబోత, అప్రకటిత విద్యుత్‌కోత కారణంగా చెరువుల్లో ఆక్సిజన్‌ లోపించి ఉదయాన్నే చెరువుల్లో రొయ్యలు,చేపలు నీటిపై తేలాడుతున్నాయి. మట్టగుంటకు చెందిన ఓ రైతు 30 ఎకరాల చెరువులో ఆక్సిజన్‌ లోపించి చేపలు చనిపోవడంతో సుమారు రూ.కోటి నష్టం వాటిల్లింది. పెదలంకకు చెందిన ఓ రైతు చెరువులో రాత్రి పూట ఆక్సిజన్‌ లోపించి రూ.15లక్షల విలువ గల చేపలు చనిపోయాయి. రైతులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. ఎకరానికి రూ.2లక్షలు పైగా పెట్టుబడులు పెట్టారు. వేలాది రూపాయలైన ఖరీదైన మందులు చల్లుతున్నారు. విద్యుత్‌కోతకు ప్రత్యా మ్నాయంగా అద్దె జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేపలు, రొయ్యలు, చేతికి వస్తాయో రావోనని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.

వడగాడ్పులకు ఐదుగురి మృతి

జీలుగుమిల్లి/ఆగిరిపల్లి/ముదినేపల్లి/చాట్రాయి/పెనుగొండ, మే 21(ఆంధ్రజ్యోతి): ఏలూరు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో గురువారం వీచిన వడగాడ్పులకు ఐదుగురు మృతి చెందారు. జీలుగుమిల్లికి చెందిన కుప్పాల వెంకటేశ్వరావు(35) మక్కినవారిగూడెం తాపీ పనికి వెళ్లి మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుని వడ దెబ్బకు మృతి చెందాడు. ఆగిరిపల్లికి చెందిన కాశీ బ్రహ్మం(45) కార్పెంటర్‌ ఉదయం పనికి వెళ్లి ఎండకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ముదినేపల్లిలో సీనియర్‌ పాత్రికేయుడు, ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యుడు వనాబత్తిన విజయ్‌కుమార్‌(63) వడ దెబ్బకు మృతి చెందారు. చాట్రాయి మండలం పోతనపల్లి మాజీ సర్పంచ్‌ పేరం బసవయ్య(70) ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ద్వారకాతిరుమల చిన్న వెంకన్న దర్శనానికి కారులో వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు. అనంతరం వడదెబ్బకు గురై మృతి చెందాడు. పెనుగొండ మండలం సిద్ధాంతం కేదారిఘాట్‌ వద్ద వడగాడ్పులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ గంగాధరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 22 , 2026 | 12:31 AM