Share News

వేసవి పనులకు కసరత్తు

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:43 AM

వేసవిలో పంట కాలువలు, డ్రెయిన్ల ప్రక్షాళనకు ప్రతిపాదనలు సిద్ధమవు తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కడా) కమిషనర్‌ ఈసారి ప్రతిపాదనలు పంపాలని దిశా నిర్దేశించారు.

వేసవి పనులకు కసరత్తు
లోసరి వద్ద పూడుకుపోయిన పంట కాల్వ

ప్రతిపాదనలు పంపాలని కోరిన కడా

సిద్ధం చేస్తున్న జల వనరుల శాఖ అధికారులు

రూ.70 కోట్ల విలువైన పనులకు అవకాశం

(భీమవరం–ఆంధ్రజ్యోతి) : వేసవిలో పంట కాలువలు, డ్రెయిన్ల ప్రక్షాళనకు ప్రతిపాదనలు సిద్ధమవు తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కడా) కమిషనర్‌ ఈసారి ప్రతిపాదనలు పంపాలని దిశా నిర్దేశించారు. ఆ మేరకు పశ్చిమ డెల్టా పరిధిలో పనులను గుర్తిస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపేందుకు కసరత్తు చేస్తున్నారు. నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు నిర్వహించ నున్నారు. ఈ ఏడాది పెద్ద మొత్తంలోనే నిధులు కేటాయించేలా ప్రతి పాదనలు పంపాలని అధికారులు నిర్ణయించారు. డ్రెయిన్లలో పూడికతీత పనులను చేప ట్టాలని యోచిస్తున్నారు. దీనివల్ల అధిక వర్షాలు కురిసినప్పుడు పంట పొలాలు ముంపు సమస్యను అధిగమించనున్నాయి. గడచిన కొన్నేళ్లనుంచి పూడిక తీయక పోవడంతో డ్రెయిన్లలో నీటి ప్రవాహవేగం తగ్గింది. ఫలితంగా కొద్దిపాటి వర్షాలు కురిసినా పశ్చిమ డెల్టాలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు ముంపు బారిన పడుతున్నాయి.ఉండిలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు దాతలను సమీకరించి డ్రెయిన్ల తవ్వకాలు చేపట్టారు. పంటకాలువ ప్రక్షాళన చేపట్టి శివారు ప్రాంతాలకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో కొద్దో గొప్పో పనులు జరిగాయి. అంతే తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో పెద్దగా పనులు చేపట్టలేకపోయారు. గతేడాది కొద్దిపాటి నిధులను విడుదల చేశారు. గత ప్రభుత్వంలో పూర్తిగా పశ్చిమ డెల్టాను విస్మరించారు. దాంతో కూటమి ప్రభుత్వంలోనూ కేటాయిస్తున్న నిధులు పశ్చిమడెల్టాకు సరిపోవడం లేదు. ఈ సారి పెద్దమొత్తంలోనే నిధులు కేటాయిం చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

బడ్జెట్‌లోనూ నిధులు

గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది ప్రభుత్వం దాదాపు రూ. 250 కోట్లు కేటాయించింది. వాటి నుంచి పంట కాలువలు, డ్రెయిన్లలోలో పూడిక తీతకు నిధులు కేటాయించాలి. గట్లు పటిష్టం చేయాలి. రివిట్‌మెంట్‌ వాల్స్‌ను నిర్మించాలి. తూములు, లాకులు మరమ్మతులు చేయాలి. గడచిన వేసవిలో తూడు, గుర్రపుడెక్క తొలగింపుకోసమని డ్రెయిన్లకు నిధులు కేటాయించారు. పూడిక తీతకు కేటాయింపులు లేవు. ఈసారి మాత్రం ఒక్క డ్రెయినేజీ విభాగంలోనే రూ. 40 కోట్లు విలువైన పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పంట కాలువల్లో సుమారు రూ.30 కోట్లు విలువైన పనులు చేపట్టాలని అంచనా వేస్తున్నారు. మొత్తం పైన రూ.70 కోట్లకు సంబంధించి కడాకు ప్రతిపాదనలు పంపేలా జిల్లా జలవనరుల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

నీటి సంఘాలకు బాధ్యత

నీటి సంఘాల ఆధ్వర్యంలోనే వేసవి పనులు చేపడుతున్నారు. సొంత పెట్టుబడులు చేసి గత వేసవి పనులు పూర్తి చేశారు. ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ సైతం దాదాపు రూ.3 కోట్లు మేర పెట్టుబడితో పనులు నిర్వహించారు. మార్చి తర్వాత ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఏడాది కూడా నీటి సంఘాల ఆధ్వర్యంలోనే పనులు చేపట్టనున్నారు. గతంలో రూ. 5 లక్షల వరకే నామినేషన్‌ పద్ధతిలో పనులు కేటాయించేవారు. ఈ ఏడాది నుంచి దానిని రూ. 10 లక్షలకు పెంచారు. ఫలితంగా నీటి సంఘాలకు బాధ్యత మరింత పెరిగింది. ప్రభుత్వం త్వరితగతిన నిధులు మంజూరు చేస్తేనే నీటి సంఘాలు వేసవిలో అనుకున్న సమయానికి పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది.

Updated Date - Jan 28 , 2026 | 12:43 AM