Share News

ఆటకు ‘శిక్ష’ణ

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:31 AM

జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.

ఆటకు ‘శిక్ష’ణ
గత ఏడాది వేసవి క్రీడా శిబిరంలో హ్యాండ్‌ బాల్‌ ఆడుతున్న బాలికలు

1 నుంచి వేసవి క్రీడా శిబిరాలు

ఇంతవరకు జిల్లాకు చేరని పరికరాలు

మంజూరు కాని నిర్వహణ నిధులు

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో శిబిరాలు మొదలు కానుండగా ఆయా క్రీడలకు సంబంధించిన పరికరాలు ఇంత వరకు జిల్లాకు చేరలేదు. క్రీడల నిర్వహణకు నిధులు విడుదల కాలేదు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏటా వేసవిలో పాఠశాల స్థాయి విద్యార్థు లకు ప్రభుత్వం ఉచితంగా క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, వివిధ క్రీడల్లో రాణిస్తున్న ఎనిమిది నుంచి 14 ఏళ్ల లోపు బాల బాలికలను గుర్తించి వారిని మరింత ప్రో త్సహించడం ఈ శిబిరాల ఉద్దేశం. శిబిరాల ప్రారంభా నికి ముందే ఆయా క్రీడల పరికరాలను జిల్లాలకు ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు వాటిని మండలాలకు పంపుతుం టారు. గత ఏడాది శిబిరాలు ప్రారంభమయ్యేనాటికి పరికరాలు రాలేదు. దీంతో క్రీడా శిబిరాలకు హాజరైన విద్యార్థులు సొంత సొమ్ముతో పరికరాలు కొనుగోలు చేసుకున్నారు. ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సిద్ధమవుతున్నారు.

ఏలూరు, ద్వారకాతిరుమల, పోలవరం, నూజివీడు, జంగారెడ్డిగూడెం, కైకలూరులో వీటిని ఏర్పాటు చేయ నున్నారు. మొత్తం 20 క్రీడల్లో శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల బాల బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరి స్తున్నారు. క్రీడా పరికరాలను ముందుగా అందజేయా లని జిల్లా అధికారులు శాప్‌కు ప్రతిపాదనలు పంపించారు. క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు పది రోజులే ఉన్నా ఇంత వరకు క్రీడా పరికరాలు రాలేదు.

వాస్తవానికి వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు క్రీడా సామగ్రి, శిక్షకుడి గౌరవ వేతనం, మైదానం నిర్వహణ ఖర్చులకు అవసరమైన నిధులను శాప్‌ ముందుగానే విడుదల చేయాలి. గతంలో ఒక్కో శిబిరానికి రూ.10 వేలు అందజేశారు. ఈసారి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లా ప్రాధికార సంస్థకు నిధులు విడుదల కాలేదని సమాచారం. సొంత సొమ్ముతో పరికరాలు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందేమోనని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు నిధులు విడుదల కాకపోవడం, క్రీడా పరికరాలు ఇంత వరకు జిల్లాకు రాకపోవడంపై క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని ఏర్పాట్లు చేశాం..

వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. క్రీడా పరికరాలు, నిధులను శిబిరాల ప్రారంభానికి ముందే అందజేయాలని అధికారులను కోరాం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాం. క్రీడా పరికరాలు రాగానే శిబిరాలకు సరఫరా చేస్తాం. మరోవారం రోజుల్లో క్రీడా పరికరాలు వచ్చే అవకాశం ఉంది.

– ఎస్‌ఏ అజీజ్‌, డీఎస్‌డీవో, ఏలూరు

Updated Date - Apr 22 , 2026 | 12:31 AM