మండుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:58 AM
జిల్లాలో రోజురోజుకు వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. శనివారం బుట్టాయిగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
పగలు వడగాడ్పులు.. సాయంత్రం ఈదురు గాలులు
నేడు నాలుగు మండలాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఏలూరుసిటీ, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోజురోజుకు వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. జిల్లాలోని శనివారం బుట్టాయిగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో హెచ్చరించింది. బుట్టాయి గూడెంలో 40.2 , కుక్కునూరులో 41.6, పోలవరంలో 40.3, వేలేరు పాడులో 41.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలని , ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో నీడున్న ప్రదేశాల్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బహి రంగ ప్రదేశాల్లో ప్రయాణించడం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. మరోవైపుజిల్లాలో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. జిల్లాలో పగటి పూట వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతుండగా సాయంత్రం పలు ప్రాంతా ల్లో వీస్తున్న ఈదురుగాలుల కారణంగా వాతావరణం చల్లబడుతోంది. ప్రస్తుతం పగటి పూట 39 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతోంది. మధ్యాహ్నం 12 గంటల నాటికి ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరడం, దీనికి తోడు వడగాడ్పుల తీవ్రత పెరగడం కనిపిస్తోంది. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కబోత విపరీతంగా పెరుగుతోంది. ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజులుగా విద్యుత్ వినియోగం పెరిగింది.