Share News

పీజీఆర్‌ఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:13 AM

‘కొంత కాలంగా న్యాయం కోసం పోరాడు తున్నా. అధికారులను కలిసి వినతులు అంద జేస్తూనే ఉన్నా. ప్రాణం విసిగిపోయింది.. ఇక చావే శరణ్యం’ అంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్‌ వద్ద పీజీఆర్‌ఎస్‌ జరిగే ప్రాంగణం బయట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ బోగా పోలీసులు అడ్డుకున్నారు.

పీజీఆర్‌ఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పురుగుల మందు డబ్బాతో శ్రీధర్‌ కుమార్‌

ఏలూరు రూరల్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ‘కొంత కాలంగా న్యాయం కోసం పోరాడు తున్నా. అధికారులను కలిసి వినతులు అంద జేస్తూనే ఉన్నా. ప్రాణం విసిగిపోయింది.. ఇక చావే శరణ్యం’ అంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్‌ వద్ద పీజీఆర్‌ఎస్‌ జరిగే ప్రాంగణం బయట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ బోగా పోలీసులు అడ్డుకున్నారు. చాట్రాయి మండలం పోతనపల్లికి చెందిన శ్రీధర్‌ కుమార్‌కు గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో 47 సెంట్లు సరిహద్దు రైతు కలిపేసుకున్నాడు. సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని మండల సర్వే, రెవెన్యూ అధికారులకు వినతులు అందించాడు. న్యాయం జరగక పోవడంతో సోమవారం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు వచ్చాడు. అర్జీ అందించేందుకు క్యూలైన్‌లో నిలబడిన అతను ‘నాకు న్యాయం జరగడం లేదు’ అంటూ ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసి తాగేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. అనంతరం అతన్ని డీఆర్వో విశ్వేశ్వరరావు వద్దకు తీసు కెళ్లగా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే సమస్య పరిష్కారం కాదని, కిందిస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే పైఅధికారులకు తెలపాలే తప్ప ఇలా వ్యవహరించడం సరికాదంటూ సుతిమెత్తగా హెచ్చరిం చారు. న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ భూమి కొంత వివాదంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తక్షణం సర్వే చేసి వివరాలు అందజేయాలని చాట్రాయి మండల తహసీల్దార్‌ను డీఆర్వో ఆదేశించారు.

Updated Date - Mar 03 , 2026 | 12:13 AM