మేము.. రాం..బాబోయ్ !
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:44 AM
గడచిన నెలల వ్యవధిలో తాడేపల్లిగూడెం సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో ముగ్గురిపై వేటుపడింది. సబ్ రిజిస్ర్టార్, జాయింట్ సబ్ రిజిస్ర్టార్, జూనియర్ అసిస్టెంట్‌లను సస్పెండ్ చేశారు. జిల్లాలో ఇది పెద్ద సంచలనమే అయ్యింది. సస్పెండ్‌కు కారణమైన రిజిస్ర్టేషన్ వ్యవహారం కూడా రాష్ట్ర స్థాయిలోనే అధికారులు, రాజీకయ నాయకుల వద్ద పంచాయతీ నడచింది.
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో పనిచేసేందుకు వెనకడుగు
ఎవరు వచ్చినా మెడపై ఒత్తిడి కత్తి
వేటు తప్పదంటూ గుబులు
నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు సస్పెండ్
జిల్లాలో హాట్ టాపిక్ ఇదే
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రిజిస్ర్టేషన్ శాఖకు ప్రైవేటు భూముల వివాదాలు చుట్టుముడు తున్నాయి. స్థల యజమానుల నుంచి ఫిర్యాదులు అధికమవుతున్నాయి. ఎక్కడనుంచైనా రిజిస్ర్టేషన్ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకుంటోంది. రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసినవి కొన్ని అయితే రాజకీయ, ఇతర ఒత్తిళ్లతో రిజస్ర్టేషన్‌లు చేసేవి ఇంకొన్ని ఉంటున్నాయి. ఆ క్రమంలోనే సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో సిబ్బందిపై వేటు పడుతోంది. గడచిన నెలల వ్యవధిలో తాడేపల్లిగూడెం సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో ముగ్గురిపై వేటుపడింది. సబ్ రిజిస్ర్టార్, జాయింట్ సబ్ రిజిస్ర్టార్, జూనియర్ అసిస్టెంట్‌లను సస్పెండ్ చేశారు. జిల్లాలో ఇది పెద్ద సంచలనమే అయ్యింది. సస్పెండ్‌కు కారణమైన రిజిస్ర్టేషన్ వ్యవహారం కూడా రాష్ట్ర స్థాయిలోనే అధికారులు, రాజీకయ నాయకుల వద్ద పంచాయతీ నడచింది.
తలనొప్పిగా ప్రైవేటు భూమి వ్యవహారం
తాడేపల్లిగూడెంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌కు సమీపంలోని ప్రైవేటు భూముల వ్యవహారంలో రిజిస్ర్టేషన్‌పై రెండు వర్గాలు ఉన్నతాధికారులు ఆశ్రయించారు. ఒక వర్గం తమ ఆధీనంలో భూమి ఉన్నాసరే అక్రమంగా రిజిస్ర్టేషన్ చేసేశారంటూ ఫిర్యాదు చేయగా ఫిర్యాదు చేసిన వారు కేవలం లీజుదారులేనని భూయజమానులే తమకు రిజిస్ర్టేషన్ చేశారంటూ మరో వర్గం అధికారులను ఆశ్రయించింది. ఇలా రెండు వర్గాల నుంచి జిల్లా రిజస్ర్టేషన్ శాఖ అధికారులకు ఒత్తిడి వచ్చింది. రాజకీయ నాయకుల నుంచి సిఫారసులు వెళ్లాయి. అంతిమంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన రిజిస్ర్టేషన్‌ను అధికారులు రద్దు చేశారు. రిజిస్ర్టేషన్ చేసుకున్నవారు దీనిపై హైకోర్టులో కేసు వేశారు. రిజిస్ర్టేషన్ రద్దును హైకోర్టు తప్పుపట్టిందని నేడే రేపో తమ చేతికి హైకోర్టు ఆదేశాలు వస్తాయని ధీమాతో ఉన్నారు. ఇలా ఒక ప్రైవేటు భూమి వ్యవహారం జిల్లా నుంచి రాష్ట్రస్థాయి అధికారులకు వరకు తలబొప్పికట్టించింది. అయితే రిజిస్ర్టేషన్‌ను రద్దు చేసిన అధికారులు అక్కడితో ఆగలేదు. రిజిస్ర్టేషన్ చేసిన జాయింట్ సబ్ రిజిస్ర్టార్‌ను సస్పెండ్ చేశారు. పాలనా పరమైన కారణాలను చూపుతూ సబ్ రిజిస్ర్టార్‌ను సస్పెండ్ చేశారు. దస్తావేజులు స్కానింగ్ చేయలేదంటూ కారణాలను చూపారు. ఇదిలా ఉంటే దస్తావేజుల స్కానింగ్ చేయ లేదంటూ జూనియర్ అసిస్టెంట్‌ను తాజాగా సస్పెండ్ చేశారు. ఇలా ముగ్గురు సిబ్బందిపై తాడేపల్లిగూడెంలో వేటుపడింది.
ఒత్తిళ్ల భయంతో వెనకడుగు
తాడేపల్లిగూడెంలో రెగ్యులర్ సబ్ రిజిస్ర్టార్ లేరు. ఇక్కడ ఎవరు విధులు నిర్వహించినా సరే వేటు పడుతూ వస్తోంది. గతంలో సబ్ రిజిస్ర్టార్‌గా విధులు నిర్వహించిన అధికారి మాత్రం నాలుగేళ్లపాటు బాధ్యతలు నిర్వహించారు. ఏరికోరి బదిలీపై వెళ్లిపోయారు. గతంలో ముగ్గురు సబ్ రిజిస్ర్టార్‌లపై వేటు వేశారు. ఇప్పుడు మళ్లీ ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ కావడంతో తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో విధులు నిర్వహించడానికి ఏ ఒక్కరూ సాహసించడం లేదు. భీమవరం రిజిస్ర్టేషన్ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఇటీవల తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో విధులు నిర్వహించడానికి ఒకరోజు డిప్యూటేషన్‌పై వచ్చారు. అదేరోజు కృష్ణా జిల్లాకు చెందిన భూమిని రిజిస్ర్టేషన్ చేయాలంటూ దళారులు ఒత్తిడి చేశారు. ప్రధాన మీడియాలో తాను పనిచేస్తున్నానంటూ ఓ విలేఖరి కూడా అందులో కీలకంగా వ్యవహరించారు. ఒత్తిడి భరించలేక సదరు అధికారి ఆరోజు మూడు గంటలపాటు రెవెన్యూ కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత రోజుల్లో అదే భూమిని తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ చేసేశారు.ఇలాంటి ఒత్తిళ్లుకూడా అధికారులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదులు వెళితే జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సిన దుస్థితి కూడా ఏర్పడుతోంది. జిల్లాలో తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం అంటే అధికారులు, ఉద్యోగులు అంతగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ప్రైవేటు భూమి రిజిస్ర్టేషన్ వ్యవహారం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.