వందేళ్లుగా.. అద్దెగూడే దిక్కు!
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:45 AM
ప్రభుత్వానికి ఆదా యం సమకూర్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముదినేపల్లి లో ఏర్పాటైన 99 ఏళ్లు గడిచి వందో సంవత్సరంలోకి అడు గు పెట్టినా ఆ కార్యాలయానికి సొంత భవనం ఏర్పాటు కాలేదు.
ముదినేపల్లి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం దుస్థితి
35 ఏళ్ల కిందటే స్థలం మంజూరు
మంజూరు కాని నిధులు
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
ముదినేపల్లి, జూన్ 6(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వానికి ఆదా యం సమకూర్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముదినేపల్లి లో ఏర్పాటైన 99 ఏళ్లు గడిచి వందో సంవత్సరంలోకి అడు గు పెట్టినా ఆ కార్యాలయానికి సొంత భవనం ఏర్పాటు కాలేదు. నేటికీ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ముదినే పల్లిలో అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మాత్రం స్టాంపులు, రిజిష్ట్రేషన్ శాఖ సొంత భవనాన్ని నిర్మించకుండా శతాబ్దికాలంగా అద్దె భవనంలోనే కొన సాగిస్తోంది. ఈ కార్యాలయాన్ని 1927 జూన్‌లో కృష్ణా జిల్లా కవుతరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని విడదీసి ముదినేపల్లిలో కొత్త కార్యాలయాన్ని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలుత ముదినేపల్లిలోని ఒక భవనంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పదేళ్లు నిర్వ హించి తర్వాత మరో భవనంలోకి మార్చారు. అద్దె భవనాలు మారుతూ ప్రస్తుతం ఉన్న పురాతన భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. కార్యాలయ ఉద్యోగులకు, రిజిస్ర్టేషన్లకు వచ్చే ప్రజలకు అసౌకర్యంగానే ఉన్నప్పటికీ ఆశాఖ ఉన్నతాధికారులు దశాబ్దాల తరబడి ఏ చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత అద్దె భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది.
స్థలం కేటాయించి 35 ఏళ్లు గడిచినా..
ముదినేపల్లిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవనాన్ని నిర్మించేందుకు మండల కార్యాలయాల కాంప్లెక్స్ ఆవరణలో 1990లోనే స్థలం కేటాయించారు. కలెక్టర్ స్థలం కేటాయింపునకు ఆమోదం తెలిపారు. ఆ స్థలంలో కార్యాలయ భవనం నిర్మించాలన్న ప్రతిపాదన అప్పట్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా సుమారు రూ.6 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్న కార్యాలయ భవన నిర్మాణానికి దశాబ్దాల తరబడి నిధులు మంజూరు చేయడం లేదు. 2009 వరకు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ముదినేపల్లిలో ఉన్న ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి భవన నిర్మాణం విషయంపై 37 ఏళ్ల పాటు శాసనసభ్యులుగా వ్యవహ రించిన వివిధ పార్టీ నాయకులు పెద్దగా దృష్టి పెట్టలేదు. 2008లో ముదినేపల్లిలోని నియోజకవర్గం రద్దయి కైకలూరు నియోజకవర్గంలో కలిశాక ఈ కార్యాలయ భవనం నిర్మాణం మరుగున పడిపోయింది. రిజిస్ర్టేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యాలయానికి భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. నూరేళ్లు నిండే 2027 జూన్ నాటికైనా ఈ కార్యాలయానికి సొంత భవనం ఏర్పడుతుందా.. లేదా అన్నది వేచి చూడాల్సిందే.