Share News

మా వాటా ఏదీ..?

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:47 PM

భూముల రిజిస్ర్టేషన్‌ల సంద ర్భంగా జరిగే లావాదేవీలపై స్థానిక సంస్థలకు 1.5 శాతం స్టాంప్‌ డ్యూటీ, సర్‌ఛార్జిల రూపంలో జమ కావాల్సి ఉంది.

 మా వాటా ఏదీ..?

స్థానిక సంస్థలకు జమకాని రిజిస్ర్టేషన్‌ స్టాంప్‌ డ్యూటీ

రెండేళ్ల నుంచి రూ.25 కోట్ల పైమాటే..

అభివృద్ధి పనులకు విఘాతం

ఐజీ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది : జిల్లా రిజిస్ర్టార్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

భూముల రిజిస్ర్టేషన్‌ల సంద ర్భంగా జరిగే లావాదేవీలపై స్థానిక సంస్థలకు 1.5 శాతం స్టాంప్‌ డ్యూటీ, సర్‌ఛార్జిల రూపంలో జమ కావాల్సి ఉంది. ఏలూరు జిల్లాలో 547 పంచాయతీలు, 27 మండల పరిషత్‌లు, జడ్పీ, ఏలూరు కార్పొరేషన్‌, చింతలపూడి నగర పంచాయతీ, నూజివీడు, జంగారెడ్డి గూడెం మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటికి రెండేళ్ల నుంచి రూ.25 కోట్ల 56 లక్షల 21 వేల 455 జమ కావాల్సి ఉంది. ప్రభు త్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ కావడం లేదు.

ప్రభుత్వానికి అందించిన సేవల ద్వారా లభించే ఆదాయాలతో స్థానిక సంస్థలు తమ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతుంటాయి. జిల్లాలో 2024 ఆర్థిక సంవత్సరం నుంచి గత మార్చి వరకు రెండేళ్ల పాటు స్టాంప్‌డ్యూటీ, సర్‌ఛార్జిల మొత్తాలు జమ కాకపోవడంతో స్థానిక సంస్థల్లో నైరాశ్యం నెలకొంది. భూముల క్రయ, విక్రయాలపై 6.5 శాతం రిజిస్ర్టేషన్‌ స్టాంప్‌ డ్యూటీ కింద వసూలు చేస్తుంటారు. ఇందులో ఐదు శాతం నికర ఆదాయంగా మిగిలిన 1.5 శాతం స్థానిక సంస్థలకు క్వార్టర్స్‌ ప్రకారం పంపిణీ జరగాల్సి ఉంది. అయితే ఈ విధంగా జరగడం లేదు. స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ఇటీవల ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. దీంతో బకాయిల గురించి అడిగేవారే లేరు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాటా నిఽధులు విడుదల చేయలేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధికి అవకాశం లేకుండా పోతోందని అధి కారులు గతంలో రాతపూర్వంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌కు ఐజీకు లేఖ రాయగా గతంలో ఒక్కసారి రూ.58 లక్షలు జమ అయ్యాయి. వాటిని తీసి ట్రెజరీ ద్వారా ఆయా పంచాతీయలకు జమ చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుతీరాక రెండేళ్ల నుంచి బకాయిలు పడడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది.

రూ.364 కోట్ల ఆదాయం

జిల్లాలో ఏలూరు కేంద్రంగా జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయంతో పాటు 11 చోట్ల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో ఏటా 70 వేల నుంచి 90 వేల వరకు రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. రిజిస్ర్టేషన్ల లావాదేవీల ప్రకారం ఈ శాఖకు గత ఆర్థిక సంవత్సరం రూ.364 కోట్ల ఆదాయం సమకూరింది. ఓవరాల్‌గా 88 శాతం లక్ష్యాన్ని అధికారులు అధిగమించారు.

దామాషా ప్రకారం పంపిణీ

పంచాయతీ పరిఽధిలో జరిగే ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి వచ్చే 1.5 శాతం నిధు లను పంచాయతీ, మండల పరిషత్‌, జడ్పీ లకు మూడు భాగాలుగా విభజిస్తారు. నాలుగింట మూడోవంతు పంచాయతీలకు ఒక వంతు మం డల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు దక్కు తుంది. పట్టణాల్లో పూర్తిగా సంబంధిత పురపాలక సంఘం, కార్పొరేషన్‌ ఖాతాలకు జమ చేయాలి.

రిజిస్ర్టేషన్‌శాఖ ఐజీకి లేఖ రాశాం : కె.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ర్టార్‌

జిల్లాలో రిజిస్ర్టేషన్లపై స్టాంప్‌ డ్యూటీ కింద రెండేళ్ల నుంచి స్థానిక సంస్థలకు బకాయిలు పడిన మాట వాస్తవమే. మేమంతట మేముగా వీటిని విడుదల చేయడానికి లేదు. రాష్ట్ర స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌శాఖ ఐజీకి లేఖ రాశాం. ఆదేశాలు రావాల్సి ఉంది. గతంలో పెండింగ్‌లో ఉన్న రూ.58 లక్షలు మాత్రమే ప్రత్యేక అనుమతితో చాలా కాలం క్రితం విడుదల చేశాం. ఐజీ ఉత్తర్వులు ఇస్తే... మేము ట్రెజరీశాఖకు జమ చేస్తాం. వారి నుంచి ఆయా స్థానిక సంస్థలకు దామాషా పద్ధతి ప్రకారం జమ అవుతాయి.

Updated Date - Apr 18 , 2026 | 11:47 PM