మిస్సింగ్ పాఠాలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:45 AM
మార్కుల భూతాలు విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఓ వైపు తల్లిదండ్రులు, మరోవైపు ఉపాధ్యా యుల నుంచి వచ్చే బెదిరింపులను తట్టుకోలేక ఇళ్ల నుంచి పారిపోయేలా చేస్తున్నాయి.
తల్లిదండ్రులు, యాజమాన్యాల నుంచి విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిళ్లు
భయంతో ఇళ్ల నుంచి పరార్..
వీరికి వల వేస్తున్న సైబర్ నేరగాళ్లు
చదువుల విషయంలో పెద్దలు
మారాలంటున్న మానసిక నిపుణులు
(తణుకు రూరల్–ఆంధ్రజ్యోతి):
మార్కుల భూతాలు విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఓ వైపు తల్లిదండ్రులు, మరోవైపు ఉపాధ్యా యుల నుంచి వచ్చే బెదిరింపులను తట్టుకోలేక ఇళ్ల నుంచి పారిపోయేలా చేస్తున్నాయి. వీరి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇచ్చి తల్లిదండ్రులను మరింత భయపెడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారన్న భయంతో పాఠశాల నుంచి పారిపోయిన 8వ తరగతి విద్యార్థిని ఆచూకీ 24 గంటల్లోనే లభ్యమైంది. అదృశ్యమైన బాలిక వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరిలో సురక్షితంగా దొరకడంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. ఈ మిస్సింగ్ పాఠాలు తల్లిదండ్రులు, టీచర్లు, స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థులకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నాయి.
దారి మళ్లిన అడుగులు
తణుకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన యూనిట్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులు మందలించారు. ‘మంచి మార్కులు రాకపోతే ఇంటి నుంచి గెంటేస్తాం’ అని హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం భోజనం తర్వాత తండ్రి స్కూల్ వద్ద దిగబెట్టగా నే తరగతి గదిలోకి వెళ్లకుండా పారిపోయింది. ప్రధాన రహ దారికి చేరుకుని అక్కడి నుంచి ఆటోలో తణుకు బస్టాండ్‌కు, అనంతరం ఆర్టీసీ బస్సులో విజయవాడ వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉండిపోయింది. ఆదివారం ఉదయం మరో బస్సులో మంగళగిరి చేరుకుంది.
విశ్రాంత అధ్యాపకురాలి అప్రమత్తత
ఆదివారం ఉదయం మంగళగిరి బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న బాలికను ఓ విశ్రాంత కళాశాల అధ్యాపకురాలు గమ నించారు. సాయంత్రం ఆమె తిరిగి వచ్చేసరికి బాలిక అక్కడే ఉండటంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. బాలిక పొం తనలేని సమాధానాలు చెప్పడంతో, ఆమె ధరించిన స్కూల్ యూనిఫాం, మెడలోని ఐడీ కార్డును పరిశీలించారు. అందు లోని నంబర్ ఆధారంగా పాఠశాలకు ఫోన్ చేసి వివరాలు చెప్పారు. యాజమాన్యం తణుకు రూరల్ పోలీసులను, వా రు మంగళగిరి పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ అధ్యా పకురాలు బాలికను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లా రు. తణుకు పోలీసులు సోమవారం మధ్యాహ్నానికి బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.
డ్రోన్ల నిఘా.. మధ్యలో సైబర్ నేరగాళ్ల ఎంట్రీ!
బాలిక అదృశ్యమైన వెంటనే తణుకు రూరల్ పోలీసులు గ్రామంలో డ్రోన్ల సహాయంతో గాలింపు చేపట్టారు. మరోవైపు బాలిక ఆచూకీ కోసం ఫొటో, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. తాము ఇంటెలిజెన్స్ ఎస్సైలమని, రైల్వే పోలీసులమని చెబుతూ తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి వరుసగా ఫోన్లు చేశారు. బాలిక వైజాగ్ వెళ్లే రైలులో ఉందని, రూ.46 వేలు పంపిస్తే ప్రైవేట్ కారులో తీసుకొచ్చి అప్పగిస్తామని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు ఫోన్ తీసుకుని.. ‘46 వేలు కాదు, ఇంకా ఎక్కువే ఇస్తాం, ముందు పాపను తీసుకురండి’ అని బదులివ్వడంతో నేరగాళ్లు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేశారు.
సోషల్ మీడియాతో నిమిషాల్లో మరో కేసు ఛేదన
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు మరో కేసును గంటల్లోనే పరిష్కరించారు. విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన ఇద్దరు మైనర్లు తప్పిపోయి తణుకు పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తణుకు సీఐ ఆదేశాలతో వారి ఫొటోలను వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో షేర్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే వారు తణుకు జాతీయ రహదారిపై తేతలి వై–జంక్షన్ సమీపంలో ఉన్నట్లు సమాచారం వచ్చింది. జోరు వానను సైతం లెక్కచేయకుండా తణుకు పోలీసులు హుటాహుటీన వెళ్లి ఆ బాలురను అదుపులోకి తీసుకుని గంట్యాడ పోలీసులకు అప్పగించారు. ఈ రెండు ఘటనల్లోనూ టెక్నాలజీని ఉపయోగించి వేగంగా స్పందించిన తణుకు పోలీసులను, బాలికను కాపాడిన విశ్రాంత అధ్యాపకురాలిని గ్రామస్థులు, పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.
పెద్దల్లో మార్పు రావాలి
చదువులంటే కేవలం ర్యాంకులు, మార్కులు మాత్రమేనన్న భారం పిల్లల లేత మనస్సులపై ప్రభావం చూపుతోంది. తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లు తమను దూరం పెడతారేమో, ఇంట్లోంచి గెంటేస్తారేమో అన్న అభద్రతాభావం వారిని వెంటాడుతోంది. కాబట్టి మార్కులు రాకపోతే ఇంట్లోంచి గెంటేస్తాం, చదువు మాన్పిస్తాం వంటి బెదిరింపులు పిల్ల ల పాలిట శాపాలుగా మారుతున్నాయి. పిల్లల మనసు చాలా సున్నితం. ఇంట్లోని ఆడపిల్లలు తమ తండ్రి లేదా తల్లి నుంచి ఆశించే భరోసా లోపిస్తే వారు అభద్రతకు గురవుతారు. కాబట్టి పిల్లల సామర్థ్యాలను మార్కులతో కొలవకూడదు. ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా మేమున్నాం అనే ధైర్యం ఇవ్వాలి. ప్రతిరోజూ పిల్లలతో కనీసం కొంత సమయం గడపాలి. స్నేహ పూర్వకంగా మాట్లాడడం, ఫలితం ఎలా ఉన్నా, పిల్లలు పడిన కష్టాన్ని గుర్తించి మెచ్చుకోవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను తరగతి గదిలో అందరి ముందు టీచర్ అవమానించకూడదు. ఇది వారిని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తుంది. పిల్లలకు ఏ కష్టం వచ్చినా ఉపాధ్యాయులతో చెప్పుకు నేంత చనువు, భద్రత పాఠశాల వాతావరణంలో ఉండా లి. ప్రతి విద్యార్థి చదువులో రాణించలేకపోవచ్చు. ఆటలు, కళలు, ఇతర నైపుణ్యాలను గుర్తించి వాటిలో ప్రోత్సహిం చడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి.
– యనమండ్ర రామకృష్ణ, క్లినికల్ సైకాలజిస్టు, తణుకు