బడి పిలుస్తోంది..!
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:53 AM
ప్రభుత్వ పాఠశాలలపట్ల క్రమంగా తల్లిదండ్రు ల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వారి పిల్లలను మళ్లీ ప్రభుత్వ బడి లో చేర్పించాలనే దిశగా ప్రోత్సహిస్తోంది.
23 వరకు విద్యార్థుల చేరికలకు కార్యాచరణ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల వెల్లువ
జిల్లాలో ముందస్తు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్..
ప్రైవేటు నుంచి గవర్నమెంట్ స్కూళ్ల వైపు ఆకర్షితులవుతున్న తల్లిదండ్రులు
ఎండల్లోనూ అడ్మిషన్లకు చెమటోడుస్తున్న టీచర్లు, హెచ్‌ఎంలు
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలపట్ల క్రమంగా తల్లిదండ్రు ల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వారి పిల్లలను మళ్లీ ప్రభుత్వ బడి లో చేర్పించాలనే దిశగా ప్రోత్సహిస్తోంది. దీనికి నిదర్శనమే జిల్లాలో సమగ్రశిక్ష అభియాన్, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నెలరోజులుగా అన్ని మండలాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్న ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రాం. వాస్తవానికి ఈనెల 17నుంచి ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసే రోజు అంటే ఈ నెల 23వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘బడి పిలుస్తుంది’ పేరిట ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ను నిర్వహించాలని ఉన్నతాధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా, అంతకుముందే జిల్లా లో స్వచ్ఛందంగా విద్యాశాఖ, ఎస్‌ఎస్‌ఏ మండ లాల వారీగా విద్యార్థుల చేరిక (ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్)ను ప్రారంభించాయి. నూజివీడు, కొయ్యల గూడెం, ముదినేపల్లి, తదితర మండలాల్లోని పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యా ర్థులను వారి తల్లిదం డ్రులు సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేం దుకు అంగీకారం తెలపడమే కాకుండా అడ్మి షన్లకు డాక్యుమెంట్లను సంబంధిత హెచ్‌ఎంలు, టీచర్లకు అందజేయడం విశేషం.
ఇప్పటికే 60 శాతానికి పైగా చేరికలు
జిల్లాలో ఐదేళ్ల వయసు పైబడిన బాల బాలికలు 7,468 మంది ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం అంగన్‌వాడీ సెంటర్లలో చదువుతున్న ఈ బాలలందరినీ సమీప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని లక్ష్యంగా ఈ ఏడాది మార్చిలోనే పెట్టుకుని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఒంటి పూట బడులు పూర్తయిన తర్వాత పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలల హెచ్ ఎంలు, టీచర్లు చొరవ తీసుకుని స్కూలు ఆవాస ప్రాంతంలోని ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో లభించే సౌక ర్యాలు, వసతులు, బోధనా పద్ధతులపై అవగా హన కల్పించి పిల్లలను చేర్పించాల్సిందిగా అభ్య ర్థిస్తున్నారు. స్కూలు టాపర్‌ను వెంటబెట్టుకుని స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రాంతో పేరెంట్స్‌ను కలుస్తుం డడం సత్ఫలితాలను ఇస్తోంది. మరో వైపు ప్రతి అంగన్‌వాడీ కేంద్రం నుంచి బడీడు పిల్లలను టీచరుతో సహా రప్పించి ఫన్‌టైం యాక్టివిటీ పేరిట గంటసేపు వినోదాత్మక కార్య క్రమాలను నిర్వహిస్తూ గవర్నమెంట్ స్కూల్స్ వైపు ఆకర్షి తులయ్యేలా చేస్తున్నారు. స్కూలు ఆవాస ప్రాంతం (హేబిటేషన్)లో వున్న పిల్లలం దరినీ ఆహ్వానించి నిర్వహిస్తున్న మినీ ఇండోర్ గేమ్స్ ఫెస్టివల్స్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతా నికి ఉపకరిస్తోంది. ఈ కార్యక్రమాలన్నింటినీ గత నెలరోజులుగా చేస్తుండంతో జిల్లాలో గుర్తిం చిన 7,468 మంది బడిఈడు పిల్లల్లో ఈనెల 8వ తేదీ నాటికి 4,490 మంది బాల బాలికలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలను తీసు కున్నారు. ఇంకా 2,978 మంది బడీడు (ఐదేళ్ల లోపు) పిల్లలను ఎన్‌రోల్‌మెంట్ చేయించడం ద్వారా నూరుశాతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశా లలను విద్యార్థులతో నింపాలని క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలల నుంచి ఎందుకు వస్తున్నారంటే..
ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి కారణాలపై ఆరాతీస్తే తల్లిదండ్రులు ఆసక్తికర విషయాలు చెప్పారని సమగ్రశిక్ష విలీనవిద్య జిల్లా కో–ఆర్డినేటర్, ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న భాస్కరరాజు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల భారం,బస్సుల ఫీజులు, పుస్తకాల కొనుగోలు, విద్యాకానుక ప్రైవేటు పాఠశాలల్లో ఉండకపోవడం, పౌష్టికాహారం వంటివి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలవైపు ఆకర్షించడానికి కారణాలుగా గమనిం చామన్నారు. తల్లికి వందనం ఆర్థికసాయం కింద ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం అందజేసే రూ.13వేలు ప్రైవేటు పాఠశాలలకు చెల్లించినా, అదనంగా వివిధ రకాల ఫీజుల పేరుతో వేలాది రూపాయలు వెచ్చించాల్సిరావడం తల్లిదండ్రులు భారంగా భావించడం ఓ కారణమన్నారు.
కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఎన్‌రోల్‌మెంట్ కమిటీ
పంకజ్‌కుమార్, సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు గతేడాది వేసవిసెలవుల అనంతరం పాఠ శాలలు పునఃప్రారంభమైన తర్వాత ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ చేపట్టడం వల్ల అప్పటికే బడీడు పిల్లల్లో అత్యధికులు ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోయారు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందకముందే జిల్లాలో స్వచ్ఛందంగా ఎన్‌రోల్‌మెంట్‌కు కార్యాచరణ అమలు చేస్తున్నాం. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. మిగిలిన బాలబాలికలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడానికి ఐసీడీఎస్, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది సహకారాన్ని తీసుకుంటున్నాం.