రాత్రి వేళ విద్యార్థినిని బయటకు పంపిన ప్రిన్సిపాల్
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:38 AM
ద్వారకాతిరుమల బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చింతలపూడికి చెందిన ఐదో తరగతి చదువుతున్న బాలిక శ్రీవిద్యను ప్రిన్సిపాల్ బయటకు పంపించేశారు.
రాత్రి వేళ విద్యార్థినిని బయటకు పంపిన ప్రిన్సిపాల్
ద్వారకాతిరుమల, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చింతలపూడికి చెందిన ఐదో తరగతి చదువుతున్న బాలిక శ్రీవిద్యను ప్రిన్సిపాల్ బయటకు పంపించేశారు. బుధవారం ఆమె పుట్టినరోజు కావడంతో తల్లి, పెద్దమ్మ, అక్క కేకు కొత్తబట్టలు తీసుకుని స్కూల్‌కు వెళ్లారు. చాలాసేపు బయట కూర్చుని మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో లంచ్ సమయం కావడంతో లోపలికి వెళ్లారు. వీరిని చూసిన ప్రిన్సిపాల్ అడ్డుకుని లోపలికి వెళ్లనీయ లేదు. బాలికను కలుసుకునేందుకు సాయంత్రం వరకూ స్కూల్ గేటు వద్ద ఉండిపోయారు. సాయంత్రం ప్రిన్సిపల్ విద్యార్థినిని బయటకు పంపించాలంటూ ఆదేశించారు. రాత్రి వేళ బస్సులు లేక బిక్కుబిక్కు మం టూ బస్టాండ్‌లో రోదించడం స్థానికులను కలిచి వేసింది. తమ ఇష్టపూర్వకంగా బాలికను ఇంటికి తీసుకెళ్తున్నట్టు బలవంతంగా తల్లితో సంతకం చేయించుకున్నట్టు బాలిక తల్లి విలేకర్లకు తెలిపింది. పుట్టిన రోజు నాడు తమ బిడ్డను తల్లిదండ్రులు కలవకూడదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి భోజనం చేయలేదంటూ విలపించారు. దీనిపై ప్రిన్సిపాల్ వివరణకు ప్రయత్నించగా ఆమె ఫోన్ కలవలేదు.