సరదా కోసం స్నానానికి దిగి..
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:06 AM
సరదా కోసం తమ్మిలేరు కాలువలో స్నానానికి వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా, మరొ కరు గల్లంతయ్యారు. ఒక విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు.
విద్యార్థి మృతి.. మరొకరు గల్లంతు
దొండపాడు తమ్మిలేరులో ఘటన
ఏలూరు క్రైం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): సరదా కోసం తమ్మిలేరు కాలువలో స్నానానికి వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా, మరొ కరు గల్లంతయ్యారు. ఒక విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏలూరు శనివారపుపేటకు చెందిన షేక్ కరీమ్‌రోషన్ (17), కనకం దేవేం దర్ పవన్ (17), జక్కుల శ్యామ్‌లు ఏలూరు లోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఒక ఫంక్షన్ ఉందంటూ సోమవారం ఈ ముగ్గురు కాలేజీకి వెళ్లలేదు. సాయంత్రం దొండపాడు లోని తమ్మిలేరు దగ్గరకు ఒక స్కూటర్‌పై వచ్చి ముగ్గురు కాల్వలోకి స్నానానికి దిగారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో కరీమ్‌రోహన్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యా డు. పవన్, శ్యామ్ మునిగిపోతుండగా అటుగా వెళ్తున్న కొందరు వారిని కాపాడారు. అపస్మారక స్థితిలో వున్న పవన్‌ను ఏలూరు ఆయుష్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించారు. శ్యామ్ సురక్షితంగా బయటపడ్డాడు. కరీమ్ ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎప్ సిబ్బంది గాలింపు చేపట్టారు. త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ పి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు
షేక్ ఫైరోజ్ బాబు (కరీముల్లా), షంషద్ బేగమ్‌లకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఫైరోజ్‌బాబు ధర్మాజీ గూడెంలో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కుమా రుడు కరీమ్ రోషన్ తమ్మిలేరులో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ ప్రాంతానికి వచ్చి తల్లడిల్లిపోయారు. వివాహం అయిన ఏడేళ్లకు రోషన్ జన్మించాడు. తమ బిడ్డ ఏమైపోయాడో అంటూ కన్నీటిపర్యంత మయ్యారు.
శనివారపుపేటకు చెందిన కనకం హేమంత్ వాటర్ ఫ్యూర్‌ఫై ప్లాంటును నిర్వహిస్తున్నారు. ఆయన భార్య గృహిణి, వీరికి కుమారుడు దేవేందర్ పవన్, కుమార్తె ఉన్నారు. కుమా రుడు కాలువలో దిగి మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగి పోయారు. ఈ ఘటనతో శనివారపుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. వందల మంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.