Share News

టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లేకుండా వార్డుల విభజన ఎలా ?

ABN , Publish Date - Apr 04 , 2026 | 01:00 AM

ఆకివీడు నగర పంచాయతీకి టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లేరు. మరి వార్డుల విభజన ఎవరు ? ఎలా ? చేస్తారనే ప్రశ్న ఇప్పుడు పట్టణంలో చర్చనీ యాంశంగా మారింది.

టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లేకుండా వార్డుల విభజన ఎలా ?

ఆకివీడు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి):ఆకివీడు నగర పంచాయతీకి టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లేరు. మరి వార్డుల విభజన ఎవరు ? ఎలా ? చేస్తారనే ప్రశ్న ఇప్పుడు పట్టణంలో చర్చనీ యాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల్లో వార్డుల సంఖ్యను పెంచింది. ఆకివీడు మేజర్‌ పంచాయతీగా ఉన్నప్పుడు 20 వార్డులున్నాయి. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయి నప్పుడు అప్పటి అధికారులు తూర్పు వైపు నుంచి వార్డులను విభజించారు. తాజాగా ప్రభుత్వం 20 నుంచి 28 వార్డులకు పెంచింది. 2025 నాటికి ఓటర్ల సంఖ్య 27 వేలు.

అధికారులు తాజాగా ఉత్తరం వైపు నుంచి పడమర వరకూ క్లాక్‌ వైస్‌ డైరెక్షన్‌లో పునర్విభజన చేపట్టి ఈ నెల 9 వరకూ డేటా తయారు చేస్తారు. పదో తేదీ నుంచి 16 వరకూ కౌన్సిల్‌ అబ్జెక్షన్‌ తెలుసుకుంటారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు, కమిషనర్‌ ఆఫ్‌ పురపాలక శాఖకు పంపుతారు. షెడ్యూల్‌ప్రకారం ఈ నెల 26 నుంచి మే 2వ తేదీలోపు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. మే 3 నుంచి 5వ తేదీ మధ్యలో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఇంత వరకూ బాగానే ఉంది. నగర పంచాయతీకి టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లేకపోవడంతో వీటిని ఎవరు చేస్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో వార్డుల్లోని ఓటర్లను ఇష్టానుసారంగా విడదీశారని రాజకీయ నాయకులు మండిపడు తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం వార్డుకు 10 శాతం మించి హెచ్చు తగ్గులు ఉండరాదు. ఈ నేపథ్యంలో నగర పంచాయతీ ఏర్పడి ఐదేళ్లు కావస్తున్నా నేటికి పూర్తిస్థాయిలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు నియంత్రించడంలో వెనుకబడింది. అభివృద్ధి అంతంతమాత్రమే.

Updated Date - Apr 04 , 2026 | 01:00 AM