దివ్యమైన కానుక
ABN , Publish Date - May 20 , 2026 | 12:59 AM
ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తోంది.
ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తోంది. దివ్యాంగులకు నెలకు రూ.6వేల పింఛన్ అందిస్తున్న ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా కొత్త పథకాన్ని ప్రకటించింది. దివ్యాంగులు స్వతంత్రంగా ప్రయాణించేందుకు ఉచితంగా మూడు చక్రాల రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఏలూరు రూరల్, మే 19(ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా మూడు చక్రాల వాహ నాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ద్వారా నియోజకవర్గానికి పది చొప్పున మూడు చక్రాల మోటారు వాహనాలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాలకు 70 వాహనాలు కేటాయించారు. గతేడాది నవంబరులో అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
నేతల సిఫారసు లేఖలు
జిల్లాలో 70 మోటారు (మూడు చక్రాల) వాహనాలు మంజూరు కాగా 160 మంది విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక వాహనానికి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కొందరు దివ్యాంగులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు లేఖలు అందిస్తున్నారు. తమవారికే వాహనాలు మం జూరు చేయాలంటూ ప్రజాప్రతినిధులు అనుచరుల నుంచి ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తమ ప్రజాప్రతినిధి ద్వారా మీకు మూడు చక్రాల వాహనాలు ఇప్పిస్తామం టూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మూడు చక్రాల మోటార్ వాహనాలను ఇప్పిస్తామంటూ ఎవరైనా దళారులు, నాయకులు డబ్బులు ఇవ్వాలని కోరితే నమ్మవద్దని, ఇంటర్యూలకు హాజరైన వారిలో అర్హులను గుర్తిస్తున్నాం, త్వరలో అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సహాయ సంచాలకులు బి రామ్‌కుమార్ తెలిపారు.
వీరికే ప్రాధాన్యం..
70 శాతం శారీరక వైకల్యం ఉన్నట్లు సదరం ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
దరఖాస్తుదారుకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఎల్‌ఎల్‌ఆర్ ఉండాలి.
ద్విచక్ర వాహనం లేదని నిర్ధారణ అయితేనే అర్హులుగా పరిగణిస్తారు.
డిగ్రీ, పీజీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారికి మొదటి ప్రాధాన్యం.
పదో తరగతి పాసై స్వయం ఉపాధి పొందేవారు అర్హులే. పదో తరగతి పాసై స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నట్లు సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది.
రిజర్వేషన్లు వర్తిస్తాయి
రిజర్వేషన్ ప్రాతిపదికన అర్హులకు మూడు చక్రాల మోటారు వాహనాలను మంజూరు చేస్తారు. విభిన్న ప్రతిభావంతులైన మహిళలకు 50 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 7 శాతం, జనరల్ కేటగిరిలో 27 మేర వాహనాలు అందజేస్తారు. అధికారులకు అందిన దర ఖాస్తులు పరిశీలన, బుధవారం జరిగే ఇంటర్వ్యూలో అర్హులను ఎంపిక చేస్తారు. కమిటీ ఆమోదంతో లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేస్తారు.