నిప్పులగుండం
ABN , Publish Date - May 25 , 2026 | 12:21 AM
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆదివారం నిప్పులగుండంగా మారింది. అధిక ఉష్ణోగ్రత లతో ప్రజలు విలవిలలాడారు.
భానుడి ప్రతాపంతో అట్టుడికిన జిల్లా
వడదెబ్బకు ఆరుగురి మృతి
రానున్న నాలుగు రోజులు అత్యంత వేడిగాలులు వీచే అవకాశం
అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు.. జిల్లా అధికారుల హెచ్చరికలు
కొనసాగిన విద్యుత్ అంతరాయాలు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆదివారం నిప్పులగుండంగా మారింది. అధిక ఉష్ణోగ్రత లతో ప్రజలు విలవిలలాడారు. ఉదయం 7గంటలకే భానుడి ప్రతాపం కనిపించింది. సాయంత్రం 6గంటల వరకు వేడిగాలులు తగ్గలేదు. వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. వడదెబ్బకు ఆరుగురు మృతి చెందారు.
(ఏలూరుసిటీ – ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఆదివారం అత్యధికంగా కుక్కునూరు మండలంలో 47.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమో దైంది. చింతలపూడి 46.9, భీమడోలు, ఉంగుటూరు 46.7, కొయ్యలగూడెం 46.6, లింగపాలెం 46.1 సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు, జంగా రెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి, భీమడోలు, పోల వరం, కుక్కునూరు తదితర ప్రాంతాల్లో ప్రధాన రహ దారులు నిర్మానుష్యంగా మారాయి. బయట ఉన్నా ఇంట్లో ఉన్నా వడగాడ్పుల దెబ్బకు తల్లడిల్లాల్సి వస్తోం ది. వృద్ధులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఒక పక్క గాలిలో తేమ శాతం గణనీయంగా పడి పోతుండడంతో ఉక్కబోతను భరించలేక ప్రజలు అవ స్థలు పడుతుంటే మరో వైపు విద్యుత్ అంతరాయాలతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నారు. రాత్రి సమయాల్లో అప్ర కటిత కోతలతో నిద్రలేక అసహనానికి గురవుతున్నా రు. వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు అవస్థలు పడాల్సి వస్తోంది. శీతల పానీయాల దుకాణాలు రద్దీగా కనిపించాయి. సోమ, మంగళ వారాల్లో జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్ర తలు నమోదవు తాయని ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. 25న జిల్లాలో నాలుగు మండలాల్లో అత్యం త తీవ్రకరమైన వేడిగాలులు, 15 మండలాల్లో తీవ్ర మైన వేడిగాలులు వీస్తాయని, 26న 22 మండలాల్లో తీవ్రకరమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేసినట్టు కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. రద్దీ ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, శీతలీకరణ షెల్టర్లు , నీడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండ డంతో విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. విద్యుత్ వినియోగం నాలుగురోజులుగా పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్లుపై లోడ్ పెరిగి ట్రిప్ అవుతున్నట్టు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
నేటి నుంచి రోహిణీ కార్తె
ఈనెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభవుతున్న తరుణంలో ఆ కార్తె ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయని పంచాంగ కర్తలు చెబుతున్నారు. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు బద్దలయ్యే రీతిలో ఎండల తీవ్రత ఉంటుందని చెబుతుంటారు. వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తే ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువరు వ్యాఖ్యానిస్తున్నారు.
అంతా నిర్మానుష్యం
ముదినేపల్లి/కామవరపుకోట/కొయ్యలగూడెం: ముదినేపల్లి ప్రాంతంలో ఎండ మండింది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదు కాగా వడగాడ్పులు తీవ్రంగా వీచాయి. ఉదయం 11 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ముదినేపల్లిలో ఎప్పుడూ జనం రద్దీగా ఉండే గురజ రోడ్డు కూడలి నిర్మానుష్యంగా కనిపించింది. హోటళ్ళు, టీస్టాల్స్ ఉదయం 11 గంటలకే మూసేశారు. ముదినేపల్లి, వడాలి, సింగరాయ పాలెం సెంటర్లలో వ్యాపార సంస్థలను సాయంత్రం 6 గంటల వరకు మూసే ఉంచారు. కామవరపుకోట మండలంలో గ్రామాలు నిప్పుల గుండంగా మారాయి. వీధులన్నీ జన సంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. కొయ్యలగూడెంలో ఉదయం 11 గంటలకే జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. షాపులు మూతపడ్డాయి. కొయ్యలగూడెం– జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం– తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం– పోలవరం ప్రధాన రహదారులు రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారాయి.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు (సెంటీగ్రేడ్‌లో)
మండలం నిన్న నేడు రేపు
ఆగిరిపల్లి 44.7 44.1 45.3
భీమడోలు 46.7 45.0 45.5
బుట్టాయిగూడెం 44.9 45.4 44.8
చాట్రాయి 44.2 43.2 44.5
చింతలపూడి 46.9 42.9 44.2
దెందులూరు 45.3 44,8 45.5
ద్వారకాతిరుమల 43.0 44.5 45.1
ఏలూరు రూరల్ 44.3 44.8 45.4
జంగారెడ్డిగూడెం 42.6 44.3 44.3
జీలుగుమిల్లి 44.4 44.2 43.8
కైకలూరు 44.6 45.2 45.5
కలిదిండి 43.7 45.5 45.7
కామవరపుకోట 44.6 43.9 44.8
కొయ్యలగూడెం 46.6 44.8 44.6
కుక్కునూరు 47.3 45.8 44.7
లింగపాలెం 46.1 43.4 44.6
మండవల్లి 44.1 44.6 45.3
ముదినేపల్లి 45.2 44.6 45.2
ముసునూరు 45.3 43.5 45.0
నిడమర్రు 43.8 45.3 45.6
నూజివీడు 44.5 43.7 45.2
పెదవేగి 45.3 44.1 45.2
పెదపాడు 45.6 44.2 45.4
పోలవరం 44.6 45.4 45.9
టి నరసాపురం 45.3 43.4 44.2
ఉంగుటూరు 46.7 44.9 45.4
వేలేరుపాడు 42.3 45.9 44.7
వడదెబ్బకు ఆరుగురి మృతి
దెందులూరు/పోలవరం/కుక్కునూరు/ ద్వారకాతిరు మల/ఏలూరు క్రైం, మే 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం వడదెబ్బకు గురై ఆరుగురు మృతి చెందారు. దెందులూరు మండలంలోని పోతునూరుకు చెందిన కోడెల సత్యనారాయణ (79) మృతి చెందారు. ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యు లు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుం డగానే మృతి చెందారు. రెవెన్యూ అధికారులు ఘటనపై వివరాలు సేకరించారు.
పోలవరం పంచాయతీ నూతనగూడేంకు చెందిన అనిశెట్టి దుర్గ(45) అస్వస్థతకు గురి కావడంతో బంధువులు ఆమెను 108లో పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.
కుక్కునూరు మండలం బంజరగూడేంకు చెందిన గవర్ల పెరుమాళ్లు (80) వడదెబ్బకు గురి కావడం తో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. ఆయన 50 ఏళ్లుగా సీపీఐలో సేవలందించారు. నాయకపోడు కులసర్టిఫికేట్ కోసం పోరాటం చేశా రు. పెరుమాళ్లు మృతదేహానికి సీపీఐ మండల కార్యదర్శి కొన్నే లక్ష్మయ్య పార్టీ జెండా కప్పి నివాళు లర్పించారు. కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొండిపాక పంచాయతీ మిట్టగూడేంకు చెందిన నోముల వంశీకృష్ణ (35) జీవనోపాధి నిమిత్తం తెలంగాణ బూర్గంపాడులోని ఓ హోటల్‌లో వంట చేయడానికి ఆదివారం మధ్యా హ్నం బయల్దేరి వెళ్లాడు. హోటల్‌కు చేరుకోగానే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. హోటల్‌లో సిబ్బంది సపర్యలు చేసినప్పటికీ స్పృహ కోల్పోవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిం చడంతో వైద్యులు కొత్తగూడెం రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతు డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బూర్గం పాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ద్వారకాతిరుమలలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి (50) వడదెబ్బతో మృతి చెందాడు. స్థానిక బంగారు తల్లి కల్యాణ మండ పం సమీపంలో ఎండలో రోడ్డుపై ఫిట్స్ వచ్చిపడి పోగా స్థానికులు 108కి ఫోన్ చేయగా అది వచ్చేలోపే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థ్దలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పంచాయతీకి అప్పగించగా దహన సంస్కారాలను జరిపారు.
ఏలూరు మండలం సాయినగర్ శివారు సూర్యనారాయణ కాలనీలో కనకదుర్గమ్మ గుడి పక్కన రోడ్డుపై 55 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. ఏలూరు రూరల్ పోలీసులు అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.