Share News

తమ్మిలేరుకు తూట్లు

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:56 AM

తమ్మిలేరు కాల్వను ఆక్రమించి ఇళ్లను నిర్మించారు. కాల్వ రక్షణ గోడకు కన్నాలు పెట్టి.. ఆపై తమ మరుగుదొడ్ల నుంచి పైపులను నేరుగా ఇందులోకి వదిలేశారు.

తమ్మిలేరుకు తూట్లు
తమ్మిలేరు కాల్వలో వేసిన సెప్టిక్‌ ట్యాంకులు..వదిలేసిన పైపులు

రక్షణ గోడకు రంధ్రాలు.. పైపు లైన్లతో నేరుగా కాల్వలోకే మలమూత్రాలు..

పట్టించుకోని జలవనరుల శాఖ అధికారులు.. ఏలూరు నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి):తమ్మిలేరు కాల్వను ఆక్రమించి ఇళ్లను నిర్మించారు. కాల్వ రక్షణ గోడకు కన్నాలు పెట్టి.. ఆపై తమ మరుగుదొడ్ల నుంచి పైపులను నేరుగా ఇందులోకి వదిలేశారు. మరికొందరు ఇక్కడే సెప్టిక్‌ ట్యాంకులను నిర్మించారు. చివరకు ఈ నీటినే శుద్ధి చేసి నగర ప్రజలకు తాగునీటిగా అందిస్తు న్నారు. వీటిపై తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారు లు మిన్నకుండిపోతున్నారు.

కృష్ణా.. గోదావరి నీరు సరఫరా

చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం డ్యామ్‌ నుంచి తమ్మిలేరు కాలువ ఏలూరు చొదిమెళ్ల వరకూ ఏకపాయగా వస్తుంది. చొదిమెళ్ల నుంచి రెండు పాయ లు(కాలువలు)గా చీలి కొల్లేరులో కలుస్తాయి. బ్రిటిష్‌ హయాంలో నగర ప్రజలకు తాగునీటిని అందించే దిశ గా విజయవాడ కృష్ణా నది నుంచి ప్రత్యేక కాలువ ద్వారా ఏలూరు పడమర లాకుల వరకూ నీటిని రప్పిం చారు. ఇంకోవైపు ధవళేశ్వరం నుంచి గోదావరి నీరు నిడదవోలు, తాడేపల్లిగూడెం మీదుగా ఏలూరు తూర్పు లాకుల వరకూ వస్తుంది. తూర్పు లాకుల నుంచి పడ మర లాకుల వరకూ కాల్వ ఉండడంతో రెండు నీళ్లు కలిసే మార్గాన్ని ఏర్పాటుచేశారు. దీంతో గోదావరి, కృష్ణా నీటిని ఏలూరు నగరానికి తాగునీటిగా వినియో గించడానికి ప్రణాళిక చేశారు. పంపులచెరువు వద్ద మోటర్లతో కాల్వలో నీటిని తోడుతుంటారు. వాటిని శుద్ధి చేసి ప్రజలకందిస్తారు.

కాల్వ విస్తీర్ణం తగ్గించి..

ఇటీవల తమ్మిలేరు వరద ముంపు లేకుండా చేయ డానికి కోట్లాది రూపాయలతో రక్షణ గోడను నిర్మించా రు. ఇది నిర్మించే సమయంలో తమ్మిలేరు కాల్వ విస్తీర్ణాన్ని తగ్గించి ఇరిగేషన్‌ అధికారులు తెరవెనుక మతలబులు సాగించినట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో ప్రజా ప్రతినిధుల చెప్పు చేతల్లో వారు కాల్వను పూర్తి స్థాయిలో వెడల్పుగా ఉంచి గోడ కట్టలేక కాల్వను ఆక్రమించి ఇళ్లను నిర్మించుకున్న వారికి మేలు చేసే విధంగా కాల్వ విస్తీర్ణాన్ని తగ్గించి గోడను నిర్మించారని విమర్శలు వచ్చాయి.

కాల్వలోకే.. మలమూత్రాలు

కాల్వ పక్కనే ఇళ్లు నిర్మించిన వారు ఇప్పుడు ఏకంగా ఇంటి నుంచి వచ్చే మల మూత్ర వ్యర్థాలను పైపుల ద్వారా తమ్మిలేరు కాల్వలోనే సెప్టిక్‌ ట్యాంకుల ను నిర్మించి వినియోగిస్తున్నారు. తమ్మిలేరు కాల్వ వచ్చినప్పుడు ఈ సెప్టిక్‌ ట్యాంకులు నిండిపోయి ఈ నీరంతా పడమర లాకుల నుంచి తూర్పు లాకుల వైపు ప్రవహిస్తోంది. ఆ నీరే నగరపాలక సంస్థ అధికారులు పంపుల చెరువులోకి తోడి శుద్ధి చేసి ప్రజలకు అందిస్తు న్నారు. చొదిమెళ్ల నుంచి ఎడమ వైపు తమ్మిలేరు కాలువకు 500 ఇళ్ల నుంచి వ్యర్థాల పైపులను కాల్వలోకి పెట్టేసినట్లు కనిపిస్తున్నాయి. కుడివైపు వెళ్లే తమ్మిలేరు కాలువలో అశోక్‌నగర్‌ కాల్వ గట్టు వైపు నూతనంగా నిర్మించిన ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి వచ్చే మల మూత్రాల వ్యర్థాల కోసం తమ్మిలేటిలోనే సెప్టిక్‌ ట్యాంకులను నిర్మించేసి రక్షణ గోడకు ఇష్టాను సారం రంధ్రాలు పెట్టేసి ప్లాస్టిక్‌ పైపులను కాల్వలోకి పెట్టేశారు. జలవనరుల శాఖ అధికారులకు ఇవేమీ కనపడవన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి కాల్వలోని వ్యర్థాల సెప్టిక్‌ ట్యాంకులను తొలగించి రక్షణ గోడకు పెట్టిన రంధ్రాలను పూడ్చి వేసి రక్షణ కల్పించాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి.

తమ్మిలేరు పరిశుభ్రతకు ప్రాధాన్యం

కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చంటి

ఏలూరు టూ టౌన్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఒకప్పటి జీవనదిగా వున్న తమ్మిలేరు పరిసరాల పరి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం 27వ డివిజన్‌లో నిర్వహించారు. ఏటిగట్టు వెంబడి చెత్తను వేయకుండా ప్రజలు సహకారం అందించాలన్నారు. మొక్కలు నాటారు. కలెక్టరేట్‌ సిబ్బంది వచ్చి పరిశు భ్రం చేశారు. స్వచ్ఛతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించా రు. స్వచ్ఛ వారియర్స్‌ కరపత్రాలు ఆవిష్కరించారు. రోడ్లపై చెత్త వేసే వారిపై ఫిర్యాదు చేసేందుకు 94910 41419కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, నగర కమిష నర్‌ భానుప్రతాప్‌, ఏపీ మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆంజనేయులు, ఇడా చైర్మన్‌ శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:56 AM