మందులోడా.. ఓరి మాయలోడా
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:31 AM
తాడేపల్లిగూడెం డివిజన్‌లో ఓ వర్తకుడు ఇటీవల రూ.8.50 కోట్ల విలువైన మందులను ఎలాంటి బిల్లులు లేకుండా విక్రయించాడు.
నేరుగా కంపెనీల నుంచి దిగుమతి..
బిల్లులు లేకుండా వైద్యులకు సరఫరా
జిల్లాలో ఓ వ్యాపారి రూ.8.50 కోట్ల
విలువైన మందులు విక్రయం
కోటిన్నరకు ప్రభుత్వానికి టెండర్..
అధికారుల దాడులు..ప్రభుత్వానికి నివేదిక
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెం డివిజన్‌లో ఓ వర్తకుడు ఇటీవల రూ.8.50 కోట్ల విలువైన మందులను ఎలాంటి బిల్లులు లేకుండా విక్రయించాడు. వాస్తవానికి దీనిపై ప్రభు త్వానికి 18 శాతం వరకు జీఎస్టీ కట్టాలి. ఇది కట్టకపో వడంతో సుమారు కోటిన్నర వరకు ఆ వ్యాపారి పన్నుకు టెండర్ పెట్టాడు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఇతర జిల్లాల నుంచి అధికారులను పంపించి దాడులు చేయించడంతో విషయం వెలుగుచూసింది. దీనిపై తనిఖీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ఒక్క వ్యాపారే పన్ను కట్టకుండా ఇంత వెనకేసుకుంటే.. ఇలాంటి వారు ఇంకెందరు వున్నారో ? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మందుల వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది. లక్షలాది మంది ప్రజలు మందులు మింగనిదే రోజు గడవని పరిస్థితి. ఇక భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలతో పాటు ఏలూరు నగరంలోను అత్యధికంగా హోల్‌సేల్ వర్తకులు వున్నారు. ఎక్కువగా వీరి నుంచే ఎక్కువ శాతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వందలాది మందుల దుకాణాలు, ఆసుపత్రులకు మెడిసిన్స్ పంపుతారు. ఇందులో కొందరు వ్యాపారులు బిల్లులు లేకుండా మందులు కావాలంటే ఒక రేటు, బిల్లులతో కావాలంటే మరో రేటుకు ఇస్తున్నట్లు సమాచారం. పన్ను ఎగ్గొట్టేందుకు హోల్‌సేల్ వ్యాపారులు బిల్లులు లేకుండానే ప్రైవేటు వైద్యులను లక్ష్యంగా పెట్టుకుని సరఫరా చేస్తున్నారు. కొన్ని కంపెనీలు హోల్‌సేల్ వర్తకులకు సహకరిస్తున్నాయి. అందుకే వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
తనిఖీలు ఎక్కడ ?
మందుల అమ్మకాలపై ఎప్పటికప్పుడు డ్రగ్ ఇనస్పెక్టర్లు తనిఖీలు చేయాలి. నిబంధనల మేరకు మందులు విక్రయిస్తున్నారా ? నకిలీ మందులు అమ్ముతున్నారా ? షాపు లైసెన్స్ వుందా ? రెన్యువల్ చేయించుకున్నారా ? అమ్మిన వస్తువులకు బిల్లులు ఇస్తున్నారా ? మొదలైన విషయాలపై దృష్టి పెట్టాలి. కాని, సిబ్బంది కొరత కారణంగా తనిఖీలు సక్రమంగా జరగడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఏదైనా ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే సీరియస్‌గా తీసుకున్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అధికారులను పంపి తనిఖీ చేయిస్తోంది. నకిలీ, బిల్లులు లేని మందులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు రిటైల్ షాపులపైనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనఽధికారికంగా మందు లను విక్రయిస్తే షాపులను సీజ్ చేస్తున్నారు. నిషేధిత మందుల విక్రయిస్తే చర్యలు చేపడు తున్నారు. ముఖ్యంగా గర్భ విచ్ఛితి కిట్‌ల విక్రయాలను అరికట్టడంలో అధికారులు కొంతమేర విజయం సాధించారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ముఠా గుట్టురట్టు చేశారు. ప్రోత్సహిస్తున్న షాపుల పైనా చర్యలు తీసుకున్నారు. తాజాగా జీఎస్టీ చెల్లించకుండా మందులు విక్రమించే హోల్‌సేల్ వర్తకులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాడేపల్లిగూడెం డివిజన్‌లో ఓ హోల్‌సేల్ వ్యాపారిపై తనిఖీలతో దడ మొదలైంది. .