Share News

మట్టికి రెక్కలు

ABN , Publish Date - May 20 , 2026 | 12:54 AM

జిల్లాలో మట్టి మాఫియా బుసలు కొడుతోంది. ట్రాక్టర్లు, ఇతర భారీ వాహ నాల్లో పరిమితికి మించి మట్టిని తరలిస్తున్నారు.

మట్టికి రెక్కలు
భీమవరం రూరల్‌ మండలం పరిధిలో పరిమితికి మించి ట్రాక్టర్లలో మట్టి తరలింపు

రియల్‌ ఎస్టేట్‌ భూములకు తరలింపు

వినియోగమార్పిడి పన్నుకు స్వస్తి

మెరక చేస్తే మైనింగ్‌కు పన్ను చెల్లించాల్సిందే

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఇదేమీ పట్టని వైనం

నేతల అండదండలు..అధికారులకు సంకెళ్లు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మట్టి మాఫియా బుసలు కొడుతోంది. ట్రాక్టర్లు, ఇతర భారీ వాహ నాల్లో పరిమితికి మించి మట్టిని తరలిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ భూములను మెరక చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు నేతల అండదండలుంటున్నాయి. భూ వినియోగ మార్పిడి లేకుండానే పూడిక చేస్తున్నారు. మైనింగ్‌కు చెల్లించాల్సిన రుసుమును పట్టించుకోవడం లేదు. నేతల ఒత్తిడితో రెవెన్యూ యంత్రాంగం సైలెంట్‌ అవుతోంది. జిల్లాలో అప్పుడప్పుడు మైనింగ్‌ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకునే పరిస్థితి లేదు. నేతల అదుపాజ్ఞలతో అధికారులు మట్టి తవ్వకాలపైనా, రియల్‌ ఎస్టేట్‌ భూముల పూడికవైపు కన్నెత్తి చూడ లేకపోతున్నారు. వాస్తవానికి వేసవి వచ్చిందంటే జిల్లాలో మట్టి తవ్వకాలు జోరందుకుంటాయి. పంటపొలాల్లో మెరకలు తీసుకోవడానికి రైతులు తవ్వకాలు చేపడుతుంటారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లీజుకు ఇచ్చేస్తుంటారు. మరోవైపు కొత్త చెరువు తవ్వకాలు జరిగినా సరే మట్టి తరలిపోతుంది. ఇది వరకే ఉన్న చెరువుల్లోనూ పూడిక తీయడం, పైపొర తొలగించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఆ మట్టిని కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎత్తుకు పోతున్నారు. ఇటీవల పట్టణాలు, పల్లెల్లో పూడిక పనులు కాస్త జరుగుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వర్తకంలో కాస్త కదలిక వచ్చింది. రహదారుల వంటి మౌలిక వసతులు పెరగడంతో భవిష్యత్తులో స్థలాల విక్రయాలు జరుగుతాయంటూ రియల్‌ వర్తకులు ముందుగానే మేల్కొంటున్నారు. డిమాండ్‌ ఉన్న ప్రాంతా లను గుర్తించి మెరక చేసే పనిలో నిమగ్నమయ్యారు.

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తవ్వకాలు

జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి. మొగల్తూరు మండలం తీర ప్రాంత గ్రామాల్లో యథేచ్చగా మట్టిని తరలిస్తున్నారు. మండలం లోని పేరుపాలెం, కెపి పాలెం, శేరుపాలెం, మోళ్లపర్రు, తీర ప్రాంత తోటల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. అదే ఆకివీడు మండలంలో అయితే రాజాలుపేట, గుమ్ములూరు, కుప్నపూడిలో చెరువుల్లో మట్టి తొలగిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ స్థలాలకు మట్టి తరలిపోతోంది. కాళ్ల మండల పరిధిలో గ్రామాల మీదుగా మట్టి తరలింపు ఇటీవల వివాదమైంది. రహదారులు దెబ్బతింటున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వాహనాలను అడ్డుకున్నారు. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం అప్పా రావు పేటలో చెరువు తవ్వకానికి గ్రామస్తులే అంగీక రించారు. అభివృద్దికోసమని కొంత మొత్తాన్ని వ్యాపారి ముట్ట చెప్పారు. తీరా పరిమితికి మించి చెరువు తవ్వకాలు సాగించడంతో అదే గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజుల క్రితమే జగన్నాథపురం గ్రామంలో మట్టి తవ్వకాలను రెవిన్యూ అధికారులు అడ్డుకున్నారు. భీమవరం రూరల్‌ మండలంలో చిన్నగరువులో మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు.ఆచంట నియోజకవర్గ పరిధిలో ఇటీవల నక్కల డ్రెయిన్‌ తవ్వకాలు పెద్ద వివాదాస్పద మైంది. రైతులే ఆందోళనకు దిగారు. ఆ తర్వాత మట్టి తవ్వకాలు నిలిచపోయాయి. ప్రస్తుతం పంటపొలాల్లో మెరక ప్రాంతాలను సరిచేసేందుకు మట్టిని తొలగిస్తున్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పొలాల్లో మట్టిపై ఆసక్తి చూపడం లేదు. మెట్ట ప్రాంతాల నుంచి రప్పించుకుని లేఅవుట్‌లు పూడుస్తున్నారు.

ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం

వెంచర్‌లు పూడ్చినట్టయితే మైనింగ్‌ శాఖకు సొమ్ములు చెల్లించాలి. లేఅవుట్‌ వేసే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మైనింగ్‌కు పెద్దమొత్తంలోనే చెల్లిస్తున్నారు. తాడేపల్లిగూడెం పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ వెంచర్‌లో మైనింగ్‌ శాఖకు రూ. 80 లక్షలు కట్టారు. ఇలా కొద్దో గొప్పో వ్యాపారులు మాత్రమే రుసుము చెల్లిస్తున్నారు. మిగిలిన వారంతా ఎటువంటి చెల్లింపులు చేయడం లేదు. మైనింగ్‌ అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. నేతల ఒత్తిడి వల్లే అఽధికారులు నిస్సహాయస్థితిలో ఉండి పోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 20 , 2026 | 12:54 AM