స్మార్ట్‌గా చెల్లించండి !
ABN , Publish Date - May 18 , 2026 | 12:45 AM
సెల్ ఫోన్‌కు ఏ విధంగా ముందుగానే సొమ్ము చెల్లించి సర్వీసులను వినియోగించుకుంటున్నామో అదే విఽధంగా ముందుగా విద్యుత్ బిల్లు చెల్లించి విద్యుత్ వాడుకునే ప్రీపెయిడ్ విధానం అమలులోకి రానుంది.
ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రయోగం
వచ్చే నెల 1 నుంచి మునిసిపాల్టీల్లో అమలు
భీమవరం టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి) : సెల్ ఫోన్‌కు ఏ విధంగా ముందుగానే సొమ్ము చెల్లించి సర్వీసులను వినియోగించుకుంటున్నామో అదే విఽధంగా ముందుగా విద్యుత్ బిల్లు చెల్లించి విద్యుత్ వాడుకునే ప్రీపెయిడ్ విధానం అమలులోకి రానుంది. జిల్లాలో వచ్చేనెల 1వ తేదీ నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అమలు చేసేందుకు ఉన్నతాధికారలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు విద్యుత్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయంలో అమర్చిన స్మార్ట్ మీటర్ల ఆధారంగా ఈ ప్రీపెయిడ్ విధానం అమల్లోకి రానుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ బిల్లింగ్‌లో పారదర్శకత, వినియో గదారుల్లో జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఈ విధానం అమలు చేయనున్నట్టు చెబుతున్నారు.
ప్రస్తుత నెలవారీ బిల్లు ఆధారంగా..
ప్రీ పెయిడ్ విధానం కోసం ప్రత్యేక సిమ్‌ను ఏర్పాటు చేసి అమలు చేస్తారు. ప్రస్తుతం వస్తున్న కరెంట్ బిల్‌లోని ఒక నెల బిల్లుకు సంబంధించిన సొమ్మును ప్రాతిపదికగా తీసుకుంటారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని విద్యుత్ శాఖకు చెల్లించిన తరువాత ప్రీపెయిడ్ విధానంలో విద్యుత్ సరఫరా అవుతుంది. ఉన్న సొమ్ముకు సంబంధించి విద్యుత్ వినియోగం అయిన తరువాత ఇకనుంచి ప్రతినెల బిల్లు సొమ్మును చెల్లిస్తే సరిపోతుంది. జిల్లాలో మునిసిపాలిటీలు పూర్తయిన తర్వాత పంచాయతీరాజ్ విభాగాలకు ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో విజయవంతం అయితే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రీపెయిడ్ విధానంపై విద్యుత్ శాఖకు పూర్తిస్థాయి సమాచారం రావలసి ఉంది. ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయ్యనున్నారు. విద్యుత్ కోసం ముందుగా బిల్లు చెల్లింపుకు కౌంటర్‌ను ఏర్పాటు చేస్తారా లేక ఆన్‌లైన్ ద్వారా బిల్లును చెల్లించి సెల్‌ఫోన్‌కు రీఛార్జి చేసుకునే విధంగా ఏదైనా సాఫ్ట్‌వేర్ వస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇటువంటి విధానం వల్ల విద్యుత్ పొదుపు కూడా అవ్వడంతో పాటు వినియోగంలో జవాబుదారీ తనం పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో 11 వేల ప్రభుత్వ
కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు
ఏరాటు జిల్లాలో ఉన్న సుమారు 11 వేల ప్రభుత్వ కార్యా లయాలకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు వాణిజ్య విభాగాలకు చెందిన షాపులకు, ఫ్యాక్టరీలకు కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినా మొదటగా ప్రభుత్వ కార్యాలయాలకు అమలు చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయంలో బకాయిల పేరుకుపోతున్న నేపథ్యంలో విద్యుత్తు పొదుపు చేసేందుకు వీలుగా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు వచ్చేనెల 1వతేదీ నుంచి ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పక్రియ త్వరలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే మునిసిపాలిటీలో కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటికి ప్రీపెయిడ్ విధానంలోకి మార్చనున్నారు.